పల్లెతల్లి

*పల్లెతల్లి*

       “ఏమిటండీ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు” అంటూ కాఫీ కప్పుతో వచ్చి భర్త పక్కన కూర్చుంది జానకమ్మ.

        భార్య మాటతో తన దీర్ఘాలోచనను వీడి కప్పు అందుకుని మెల్లగా తాగసాగారు రఘురామయ్య. భర్త ముఖాన్ని చూస్తూ ఆయన అంతరంగాన్ని అంచనా వేస్తూ, తను కూడా మెల్లగా కాఫీ తాగి కప్పు పక్కన పెట్టి, భర్త చేతిలో కప్పు తీసుకుంటూ “చెప్పండి” అంది మెల్లిగా. 

        ఏమిటీ అన్నట్టు చూసారు రఘురామయ్య గారు. దానికి జానకమ్మ గారు చిన్నగా నవ్వి, “యాభై ఏళ్ళ నుండి మీతో ఉన్నాను. మీ ఆలోచన గ్రహించలేనా? తిరుగు ప్రయాణం కోసం అబ్బాయిని అడుగుదామనుకుంటున్నారా?” అని అడిగింది. “హ్మ్… మనం అడుగుతూనే ఉన్నాం! వాడు వాయిదా వేస్తూనే ఉన్నాడు! ఈ రోజు మన నిర్ణయం వాడికి ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. నువ్వేమంటావ్” అని భార్య వైపు చూసారు. “ఏమంటాను, మీ ఇష్టమే నా ఇష్టం. మీరక్కడుంటే నేనూ అక్కడే” అంటూ లోపలికి వెళ్లిపోయారు కప్పులు తీసుకుని. 

నిజానికి ఆ కాంక్రీటు అరణ్యం లో ఉండటం జానకమ్మగారికి కూడా ఇష్టం లేదు. కొడుకు మీద ప్రేమతో తప్పక ఉంటున్నారు. 

సాయంత్రం అయ్యేసరికి కొడుకు, కోడలు తలొక బ్యాగ్ వేసుకొని నీరసంగా ఇంటికి చేరారు. రాగానే కొడుకుతో మాట్లాడటానికన్నట్టు సిద్ధమవుతున్న రఘురామయ్య గారిని కళ్ళతోనే వారించి, “అసలే బయట రోజులు బాగోలేదు; స్నానం చేసి రండి. చెరొక బాత్రూమ్ లో ఇద్దరికి వేడి నీళ్లు పెట్టేసాను” అని కొడుకుని కోడల్ని లోపలికి పంపించారు జానకమ్మ. వాళ్ళు వెళ్ళగానే, భోజనాలయ్యేవరకు ఏమి మాట్లాడొద్దని భర్తకి చెప్పి, భోజనాల బల్ల సర్ధడానికి వెళ్లిపోయారు.

భోజనాలయ్యాక తీరికగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో, రఘురామయ్య గారు “అబ్బాయ్, మేము ఇంటికి బయల్దేరదామనుకుంటున్నాంరా; ఇంకా ఎన్నాళ్ళని ఉన్న ఊరిని వదిలి ఇలా ఉండగలం?” అన్నారు. వెంటనే కొడుకు ” అదేంటి నాన్న? ఇక్కడ మీకు ఏం తక్కువైందని? అక్కడ మన మనుషులు ఉన్నారుగా అన్నీ చూసుకోవటానికి” అని ఒకింత విసుగు ప్రదర్శించాడు. కోడలు తన భర్తకి వంత పాడింది ఎక్కడ అత్తగారు వెళ్ళిపోతే, మళ్ళీ పనంతా తనమీద పడుతుందోనని.

రఘురామయ్య గారు సర్దుకొని కూర్చొని; “నీకు కారణాలు చెప్పాలి అంతే కదరా అబ్బాయ్. చెప్తా విను. మన ఊరిలో ఉన్నపుడు ప్రొద్దున్నే లేచి సూర్యనమస్కారం చేసుకొని, ఆరుబయట కుర్చీలో కూర్చొని, సూర్యుని లేలేత కిరణాలు ఒంటిని తాకుతుండగా, మీ అమ్మ చేతి కాఫీ తాగితే ఆ రోజంతా ఎంతో అద్భుతంగా గడిచేది. కానీ ఇక్కడ సూర్యకిరణాలకు బదులు Dవిటమిన్ మాత్రలు మింగుతున్నారు. అక్కడ పచ్చని చెట్ల మధ్యనుండి రెండు మైళ్ళు నడిచి మన పొలానికి వెళ్లి పొద్దస్తమానూ పొలంలో పనిచేసి, తిరిగి అదే రెండు మైళ్లు నడచి ఇంటికి చేరిన కాళ్ళు నొప్పులు కూడా వచ్చేవి కాదు. ఇక్కడ కిందకి పైకి వాటికవే నడిచే మెట్లు, ఏంటవి? హా.. ఎస్కలేటర్లు. అవి ఎక్కి నుంచొని ఆయాసం కూడా రాకుండా తిరిగినా రెండడుగులు బయటకు వెళ్తే, కాళ్ల నొప్పులూ, కీళ్లనొప్పులూ.

మన ఊరిలో కనిపించే అందాలు, దొరికే ప్రశాంతత ఇక్కడ లేవురా! లెగదూడల అందాలు ఇక్కడ కానరావు, బొచ్చు కుక్కపిల్లలు తప్ప. గడ్డ పెరుగు, జున్ను పాలు దొరకవు, ప్యాకెట్ పెరుగులు కృత్రిమ జున్నులు తప్ప. అంతెందుకు ఇక్కడ ఒకరినొకరు పలకరించుకోవడమే లేదు కదరా! అదే మన ఊరిలో అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకూ పెద్దమ్మ పెదనాన్న, పిన్ని బాబాయ్, అన్నయ్య వదినా, అక్క బావా ఇలా ఎన్నో రకాలుగా పిలుచుకుంటూ పలకరించుకుంటూ ఉంటాం. మన పెరటిలో పండిన పంటలు తింటాం. ఒకరికష్టం ఒకరం పంచుకుంటాం. చదువులంటూ, ఉద్యోగాలంటూ *పల్లెను మరచిన బ్రతుకులు* మీవి! పల్లెనే తల్లిగా తలచి, పల్లెకు దూరమై బ్రతకలేని బ్రతుకులు మావి! వలస వెళ్లి గూటికి చేరలేని పక్షులు మీరు! గూడు వీడి బయటికి రాలేని పక్షులం మేము! ఇక్కడ ఉంటే ఇంకొక పది పదిహేను సంవత్సరాలైన బ్రతికే మేము రెండు మూడు ఏళ్లలోనే కాలం చేస్తాం. మీకు బెంగ అనిపించినపుడు, తీరిక దొరికినపుడు వచ్చి చూద్దురుగాని.మమ్మల్ని ఊరు పంపించెయ్ అబ్బాయ్” అని తను చెప్పాల్సినవి చెప్పి ముగించారు రఘురామయ్య గారు. 

కొడుకు తండ్రి మాటలన్నీ శ్రద్ధగా విని, వారి ఇబ్బందిని అర్ధం చేసుకుని, ఒకసారి తల్లిని కూడా చివరి ప్రయత్నం గా అడుగుదామని ఆమె వైపు చూసాడు. భర్త నిర్ణయమే తన నిర్ణయమని ఆమె హావభావాలలొనే అర్ధం అయ్యేసరికి ” సరే నాన్న మీ ఇష్టం. రేపు ఉదయమే కారు మాట్లాడతాను. బట్టలు సర్దుకొండి” అని చెప్పి, తన గదిలోకి వెళ్ళిపోయాడు తన బాధ బయటికి కనిపిస్తే తల్లిదండ్రులు ఇబ్బంది పడతారని.

గదిలోకి వెళ్లిన కొడుకు “ఏం చెయ్యను నాన్న? మిమ్మల్ని వీడి ఉండలేను, అలా అని లక్షల జీతం వచ్చే ఉద్యోగం వదలలేను. మీరెక్కడున్నా సంతోషంగా ఉండాలి” అనుకుంటూ రాత్రంతా కలత నిద్రతో గడిపేశాడు. 

ఉదయాన్నే తల్లిదండ్రులు ప్రయాణమయ్యేసరికి కారు మాట్లాడి తీసుకొచ్చాడు. రఘురామయ్యగారు సతీసమేతంగా బయల్దేరబోతూ కొడుకు మొహం లోని దిగులు గమనించి “ఒరే అబ్బాయ్, మనమెంత ఎదిగిన మూలాలను మర్చిపోకూడదు. నీ బిడ్డల్ని కార్పొరేట్ స్కూళ్లలో చదివించినా, మన మూలాలను చెప్పి పెంచు. అప్పుడు, నా మనసెరిగి నువ్వు నడుచుకోవడం వల్ల నేను నీతో ఎంత ఆనందంగా ఉన్నానో, నువ్వు నీ పిల్లలతో అంత ఆనందంగా ఉంటావు. దసరాకి పిల్లల్ని కోడల్ని తీసుకొని ఊరికి వచ్చేయి. బెంగ పెట్టుకోకు. నన్ను మన ఊరు తల్లిలా చూసుకుంటుంది. బయట తిండి అస్తమాను తినకండి. ఉంటాను.” అని చెప్పి తన పల్లెకు *తల్లి ఒడికి చేరే పసిబిడ్డలా* ఆనందంగా ప్రయాణమయ్యాడు . 

రచయిత::శాంతి కృష్ణ

 

You May Also Like

7 thoughts on “పల్లెతల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!