పరిమళించే మానవత్వం

(అంశం : “మానవత్వం”)

పరిమళించే మానవత్వం

రచన: విస్సాప్రగడ పద్మావతి

అనగనగా ఒక ఊరిలో సీత, గీత అనే ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు.వారిద్దరూ కలిసిమెలిసి మంచి మైత్రి కలిగి ఉండేవారు. ఇద్దరూ ఒకే వ్యక్తిత్వం కలవారు. ఎదుటివారికి ఎల్లప్పుడూ సాయపడుతూ ఉండాలి అని, బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి అనే లక్ష్యం తో ఉండేవారు.

సీత, గీత ఆటపాటల్లో మేటిగా ఉండేవారు. చదువు సంధ్యల్లో ఎప్పుడూ ముందంజే. గురువులు వీరిని చూసి మురిసి పోతూ ఉండేవారు.
వేకువజామునే నిద్ర లేచి, శ్రద్ధగా చదువుకుని, కాసేపు ఇంటి పనులలో తల్లికి సాయం చేసి, గుడికి వెళ్లి దణ్ణం పెట్టుకుని, బడికి వెళ్లి శ్రద్ధగా పాఠాలు వినేవారు. చూసిన ప్రతి ఒక్కరు స్నేహితులు అంటే ఇలా ఉండాలని అనుకునేవారు.

ఒక నాడు బడి ముగియగానే ఇంటిముఖం పట్టిన సీత, గీతలకు మార్గంమధ్యలో ఒక దృశ్యం కనబడింది. ఒక అవ్వ ఒక వెర్రోడు దీనంగా కూర్చుని ఉన్నారు. ఏమిటి సంగతి అని సీత, గీత లు దగ్గరికి వెళ్ళి అడిగారు.

అవ్వ ఈ విధంగా చెప్పింది నేను ఎవరూ లేని అనాధను, నాకు తోడుగా ఈ వెర్రోడు, వీరికి తోడుగా నేను ఇంతకాలం ఉన్నాము. ఇప్పుడు నేను ముసలి దాన్ని అయిపోయి ఒంట్లో శక్తి తగ్గిన దాన్ని. ఇప్పుడు ఎవరు వీడిని చూసుకుంటారు అని విలపించింది.
ఈ వెర్రొడు బండచాకిరి చేస్తాడు కానీ వాడికి ఏం కావాలో తెలీదు. ఇది కావాలి అని అడగడం కూడా రాదు. ఇంత మంచి వెర్రోడిని ఎవరు చేరదీస్తారు ఇక వీడి గతి ఏమిటో.. తలచుకుంటేనే గుండె గుభేల్ మంటుంది. అని అవ్వ అంటే… అవ్వ నువ్వేమీ గాబరా పడకు. ఈ వెర్రోడికి తప్పకుండా మేము తగిన సహాయం చేస్తాము అని వాళ్లతో పాటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు.

తల్లి,తండ్రి చూసి ఎవరు ఇతను అని అడిగితే జరిగింది చెప్పారు. వెంటనే తల్లిదండ్రులు మంచి పని చేశారు అని సీతా, గీతలను మెచ్చుకున్నారు.

మర్నాడు ఉదయమే తల్లిదండ్రులతో వెర్రోడిని వెంటబెట్టుకుని సీత గీతలు బడికి బయలుదేరి ప్రధానోపాధ్యాయులతో పరిస్థితిని వివరించారు. ప్రధానోపాధ్యాయులు గారు విషయం తెలుసుకుని ఆలోచిస్తుండగా సీత, గీతలు కలిసి బడి ప్రాంగణంలో వెర్రోడి చేత బడి పిల్లలకు అవసరమైన స్టేషనరీ షాప్ ను పెట్టిస్తే.. అతనికి ఉపాధి కల్పించి ఆదుకున్న వాళ్ళం అవుతాము అని అంటారు. ఈ ఆలోచన అందరికీ నచ్చి అలాగే చేద్దామని.. అనుకున్నదే తడవుగా చిన్న స్టేషనరీ అంగడిని ఏర్పాటు చేశారు ప్రధానోపాధ్యాయుల వారు.

వెర్రోడు ఎంతో ఆనందంతో
చక్కగా అంగడిని చూసుకుంటూ పొద్దంతా బడి పిల్లలతో కలిసిమెలిసి హాయిగా జీవనం సాగించాడు.

నీతి
నాకెందుకులే అనుకుంటే వెర్రోడి పరిస్థితి అగమ్యగోచరం అయ్యేది. చిన్నపిల్లలైనా మానవత్వంతో ఆలోచన చేసి ఆదుకున్నారు కాబట్టే అతనికి ఒక మంచి జీవితం లభించింది.

ప్రతి ఒక్కరూ భూతదయ కలిగి ఉండాలి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!