పరిపక్వత

(అంశం : “మానవత్వం”)

పరిపక్వత

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

చిన్నప్పటి నుంచే పిల్లలకి వాళ్ల వయసుకు తగ్గట్టు సామాజిక స్పృహ అవసరమవుతుంది.  అప్పుడే వాళ్ళల్లో పరిపక్వత ఏర్పడి,  కష్టతరమైన సంఘటనలలో వాళ్ళని వాళ్ళు అదుపులో పెట్టుకో గలుగుతారు అన్నది నా ఉద్దేశం.  ఇంకా కథలోకి వచ్చేస్తున్నాము.

కుశాల్,  కృప ఇద్దరూ తాతయ్య,  నానమ్మల ప్రేమ ఆప్యాయతలతో మునిగితేలుతున్నారు.

ఒకరోజు వాళ్ళిద్దరి దగ్గర కూర్చుని వాళ్ళ  ఫ్రెండ్స్ తో వాళ్ళు చేసుకునే పార్టీలు, పంచుకున్న స్వీట్లు,  వెళ్ళిన టూర్లో వాళ్లు చేసిన ఎంజాయ్ మెంట్ లు, టీచర్ ఇచ్చిన సందేశాలు అన్ని ముచ్చటించుకుంటూ ఉన్నారు.

పిల్లలు అలా పెద్ద వాళ్ల దగ్గర, వాళ్ళ మమకారం పంచుకుంటూ ఉంటే, శ్రావ్యకు ఆ దృశ్యం చూడటానికి రెండుకళ్ళూ చాలలేదు.

ఎంత అపురూపంగా ఉన్నారు నా పిల్లలు.అనుకుంటూ మురిసిపోయింది. వాళ్ళ ముచ్చట్లలో  వాళ్ళు ఉంటే,  శ్రావ్య అందరికీ టిఫిన్ రెడీ చేసి తీసుకువచ్చింది.

వాళ్లు మాటల్లో ఉండగానే,  వాళ్ల ఇంటి బయట ఏదో కోలాహలం మొదలయింది  పెద్ద పెద్దగా అరుపులు వినపడుతున్నాయి.ఇంట్లో అందరూ బయటికి వచ్చి ఏం జరిగిందని చూస్తున్నారు.

వాళ్ళ ఇంటి ముందు ఉన్న రోడ్డుపైన,  ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. బండి మీద వచ్చే ఒక యువకుడు ఆ స్పీడ్ అదుపు చేయలేక,  చిన్న కుక్క పిల్లను గుద్దించాడు. దాంతో ఆ కుక్క పిల్ల పరుగెత్తుకు వెళ్ళి వేరే మోటార్ బైక్ కింద పడింది. ఆ కుక్కపిల్ల వల్ల మోటర్ బైక్ అబ్బాయికి కూడా  చిన్న చిన్న దెబ్బలు తగిలాయి.

నేను పడిపొవడానికి నువ్వే కారణం అంటూ మోటార్ బైక్ అబ్బాయి ఇంకో అతని మీద పోట్లాడుతున్నాడు.

ఆ సన్నివేశం చూసి, అక్కడ జనాలు గుమిగూడారు. వాళ్ళిద్దరికీ సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. బుజ్జి కుక్క పిల్ల మాత్రం కింద పడి పోయి మూలుగుతూ ఉంది.

ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళిద్దరూ,  వాళ్లకి తెలిసిన వాళ్ళు అవటంచేత,  తన ఇంటిలోనికి రమ్మని పిలిచారు.  లోపలికి వచ్చిన ఇద్దరూ,  పరంధామయ్య గారిని ఉద్దేశించి తాతగారు అనుకోకుండా జరిగిన ఒక చిన్న సంఘటన బట్టి ఏమి మాట్లాడుతున్నాడో చూడండి. అని మొదటి వ్యక్తి చెప్పాడు.

అది అనుకోకుండా జరిగిన ప్రమాదమే అవ్వచ్చు కానీ,  నాకు ఎంత నష్టం జరిగిందో గుర్తించావా?

నా మోకాళ్లు రెండూ గీరుకుపోయాయి.  అంతేకాకుండా నా బండి కూడా చాలా డ్యామేజ్ అయ్యింది. నా భాద నీకు అర్థం అవ్వట్లేదు. అన్నాడు రెండో వ్యక్తి.

పరంధామయ్యగారు కల్పించుకొని,  ఇద్దరికీ ఎంతోకొంత నష్టమే జరిగింది. కానీ,  ఇది తీరలేనిది,  తీర్చుకోలేనిది కాదు కదా!!!!!

అతడు కావాలని చేసింది కాదు.  అలాగని అతి వేగం మంచి పని కూడా  కాదు. కనుక ఇద్దరూ తప్పుఒప్పులు  పక్కన పెట్టి,  ముందు ఆ గాయాలకు మందు రాసుకోవాలి. లేదా సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది. అని ఇద్దరినీ మందలించారు.

పక్కనే ఉన్న శ్రావ్య,, వాళ్లకి అత్యవసర మెడికల్ కిట్ ఇచ్చింది.  అన్నపూర్ణమ్మ గారు చల్లని నీళ్ళు తెచ్చి ఇచ్చి గాయాల్ని కడగ మన్నారు.

ఇద్దరికీ కొంచెం ఉపశమనం లభించింది. ఇద్దరు కొంచెం తేలిక పడ్డారు. అందరూ మాటల్లో పడ్డారు.

స్వరూప్ ఆఫీస్ నుంచి అప్పుడే ఇంటికి వచ్చాడు. నాన్నను చూడటంతోనే కుశాల్,  కృపా డాడీ అంటూ పరుగుతీశారు.  చేతిలో ఉన్న ఆ  బుజ్జి కుక్క పిల్లను చూసి,  ఇది ఎక్కడిది బలే ముద్దుగా ఉంది అన్నా డు.

జరిగినదంతా వాళ్ల డాడీకి , వాళ్ల మాటలలో వివరించి చెప్పారు పిల్లలు.  అంతేకాదు,  ఆ కుక్కపిల్లకు కూడా చిన్న గాయమవడంతో, దాన్ని నీళ్ళతో కడిగి,  పౌడర్ వేసి, కాలు కి చిన్న  కట్టు కూడా కట్టారు.

తరువాత, పిల్లలు వాళ్ళ అమ్మని అడిగి ఒక చిన్న గ్లాసు పాలు కూడా పట్టించారుట.

ఇదంతా, వాళ్లు మాటల్లో ఉండగానే ఆ పిల్లలిద్దరూ వాళ్లకి తెలిసిన మొదటి చికిత్స ఆ కుక్కపిల్లకు అందించారు.  ఆ చిన్న పిల్లలకు ఆ పప్పీని చూడాలన్నా ఆలోచన రావటమే చాలా అబ్బురంగా అనిపించింది అక్కడి వాళ్లకు…..

పెద్దవాళ్ళు అడుగుజాడల్లోనే పిల్లలు నడుస్తారు అనేదానికి ఒక నిదర్శనం ఈ సంఘటన.

ఆ ఒక్క రోజే కాదు,  ఆ పప్పీ ని ఇంకా వాళ్ల ఇంటికి పెంపుడు జంతువుగా మార్చుకున్నారు ఆ పిల్లలు ఇద్దరు.

అందుకే అంటారు…. చిన్నా , పెద్దా అ అని వయసుతో నిమిత్తం లేకుండా,  మనసులో  సున్నితంగా ఉండే ఈ మానవత్వం అనేది ఒక అపురూపమైన మధుర భావన.

ఈ భావన అందరికీ సాధ్యం కాదు. అందరి హృదయాల్లో ఉండదు కూడా.

హామీ పత్రం: ఈ రచన పూర్తిగా నా స్వీయ రచన

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!