వికసించిన హృదయం

(అంశం : “మానవత్వం”)

వికసించిన హృదయం

రచన:చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

కరుణ అనే పదమే తెలియని కరుణాకర్ దయార్ద్ర హృదయుడిగా సమాజంలో పేరు పొందాడు.పైకి మంచి మాటలు నటిస్తూ లోపల లోభిగా స్థిరపడి స్వార్థపు నరాలను గుండెలకు బిగించుకున్నాడు. కరుణాకర్ కార్యోన్ముఖుడు కాకపోయినా తన పనికై ఇతరులను కార్యోన్ముఖులనం చేసి పెద్దరికం ముసుగులో మసిబారిన మానవత్వమే లేని ఓ గ్రామ పెద్ద.
పొలంపనులు చేయిస్తూ పనోళ్ళు అంటే పేదోళ్ళని రాచి రంపాన పెట్టే ఓ ధనిక డాంబికానికి నిదర్శనమైనా ఆయనో పెద్ద మనిషని అందరూ తలొంచి తీరక తప్పదు.రామేశం రెక్కాడితేగాని డొక్కాడని కూలి.రోజంతా కరుణాకర్ గారి పొలంలో పనులు చేసి ,సాయంత్రం వాళ్ళ ఇంట్లో పనులు చేసి రేతిరి కూటికి ఇంటికెళ్తే అక్కడ భార్య రాజమ్మ చేసిన పచ్చడి మెతుకులే పరమాన్నంలా తిని అలసిన ఒళ్ళు మరచి నిద్రపోతాడు.రోజూ అదే తంతు సాగుతూ ఉన్నా సంపాదన మాత్రం పెరగడంలేదు.ఎందుకు ఇంత కష్టం చేస్తున్న నాయనకి డబ్బులు మిగలడంలేదని కొడుకు శీను రామేశం దగ్గరికెళ్ళి”నాయనా నేను కూడా పనికి వస్తా “అన్నాడు.”నువ్వు చదువుకోరా .ఈ పనులు జేసి చెడిపోబాక.నేనున్నాగా “అంటూ రామేశం వద్దంటూ వారించాడు.అయినా శీను నేనూ వస్తానంటూ పనిలో దిగాడు.కరుణాకర్ శీనూని చూసి ఏరా ఈరోజు కొడుకుని పనిలో దించావ్,పిల్లోడికి సగం కూలీ ఇస్తా అన్నాడు.ఆ పెద్ద చెట్లు రెండూ నరికేయండి ఈరోజుకి అన్నాడు.రామేశం ఈరోజుకి కష్టమయ్యా అది రెండురోజుల పని అన్నాడు.ఇద్దరున్నారుగా కానీ అవుతుంది అంటూ వెళ్ళిపోయాడు. కరుణాకర్ పీనాసితనం అర్థం చేసుకున్న శీను ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకున్నాడు.నాయనా నువ్వు ఈ చెట్టు నరుకు నేను ఈ చెట్టు నరుకుతా అంటూ చెట్లు నరుకుతూ ఉండగా రామేశాన్ని తేలు కుట్టేసింది.నొప్పితో విలవిల లాడుతున్న రామేశాన్ని చూసి కరుణాకర్ పిల్ల తేలు లేరా కాసేపటికి తగ్గిపోద్ది ముందు చెట్లు నరకమన్నాడు.శీనుకి విపరీతంగా కోపం వచ్చినా సముదాయించుకొని పరిగెత్తుకుంటూ కట్టకిందకెళ్ళి ఆకుపసరు తెచ్చి రామేశానికి కట్టాడు.నొప్పి తగ్గాక రామేశం పని చేస్తానన్నాడు కానీ శీను చేయనివ్వలేదు.సాయంత్రమైంది కరుణాకర్ వచ్చాడు.ఏరా ఇంకా ఒక చెట్టు కూడా నరకలేదు అన్నాడు.నా సగం పని అయిపోయింది మా నాయన పూర్తి పని కూడా అయిపోయింది.డబ్బులిప్పిస్తే బయలుదేరుతాం అన్నాడు శీను.ఏంట్రా తమాషాగా ఉందా.రెండు చెట్లకూ సగం కాండం నరికి వెళ్ళిపోతే అవి రాత్రి గాలికి పైరుమీద పడి అంతా నాశనం అవ్వదా అంటూ తిట్టబోయాడు.శీను అయ్యా ఆగండి.. మీరు చెప్పినట్లే చేశాం తర్వాత ఏం జరిగినా మాకేం సంబంధం అన్నాడు.ఏందిరా నేను చెప్పింది అని అడగగా శీను”నాకు సగం కూలీ ఇస్తానన్నారు నేను చేయగల్గింది సగం కాండం నరికాను సరిపోయింది,మా నాయన అంతా శుభ్రం చేసి మరో చెట్టు సగం కాండం నరికాడు పొద్దుగుంకింది అంతే” అన్నాడు.కరుణాకర్ కోపంతో రగిలిపోయాడు కూలీ లేదు ఏమీ లేదు పోండి అంటూ తుండుగుడ్డ విదిలించి ముందుకు కదలబోయాడు చెట్టుమీదనుంచి నల్లత్రాచు కరుణాకర్ మెడపై కాటేసింది.రామేశం పరిగెత్తుకుంటూ వెళ్ళి కరుణాకర్ ని పట్టుకున్నాడు.శీను “అయ్యా..నిన్ను కాటేసింది పిల్ల త్రాచు అంతే.ఏం కాదులే నిదానంగా ఇంటికెళ్ళండి, నాయనా ఆయనెళ్తాడులే వదులు “అన్నాడు.కరుణాకర్ కి ఒక్కసారిగా తన లోభి తనం మొత్తం గిర గిరా తిరుగుతూ గుర్తుకొస్తూ ఉంది.ఒళ్ళంతా చెమటలు పడుతూ వణికిపోతున్నాడు.”శీనూ..నన్ను క్షమించరా .నేను ఎంత దుర్మార్గుడినైనా నా పెళ్ళాం బిడ్డలు అన్యాయం అయిపోతారు.దయచేసి నన్ను కాపాడండి అంటూ వేడుకోవడంతో శీను”నీలా మానవత్వంలేని రాతి గుండెలు కావు మావి.నువ్వు ఎప్పుడో చచ్చావ్.ఈరోజు కొత్తగా చచ్చేదేముంది.డబ్బు పిచ్చితో కనికరం లేకుండా శ్రమ దోపిడీ చేసిన నాడే చచ్చావ్.నీకెందుకు భయం,నువ్వున్నప్పటి కంటే పోయాకే నీ భార్య పిల్లలూ సంతోషంగా ఉంటారు “అన్నాడు.నన్ను క్షమించండి రామేశం నన్ను కాపాడండి అంటూ స్పృహ కోల్పోయాడు కరుణాకర్.శీను, రామేశంలు కలిసి కరుణాకర్ ని ఆస్పత్రిలో చేర్చి ప్రాణభిక్ష పెట్టారు.అప్పటినుంచి మానవత్వం వికసించిన హృదయంతో కరుణాకర్ ఆ ఊర్లో మసలుకున్నాడు.

***********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!