మనసు

మనసు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

వ్యాసకర్త: కొల్లూరు వెంకటరమణమూర్తి

మనసే మందిరం, జీవమే దైవము అంటారు. అటువంటి మందిరం ఎంత గొప్పగా ఉంటే అంత మంచిది కదా! మంచి మనసుతో మనం అందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉండగలుగుతాం. మన సంబంధబాంధవ్యాలను, పరిసరాలను కూడా చక్కదిద్దుకోగలుగుతాం. మనసులో అనునిత్యం అనేకానేక కోరికలు ఉత్పన్నమౌతూనే ఉంటాయి. పరిస్థితులు అనుకూలిస్తే అవి ఫలించి, ఆనందం పొందుతాం, అనుకూలించకపోతే నిరాశ నిస్పృహలకు లోనై, దుఃఖపడతాం. ఆ దుఃఖము వల్లనే పలు విధముల మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తి, శరీరం ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్నవాళ్ళమౌతాం.
మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. మంచి మనసుతో ఆలోచిస్తే మంచి మార్గం లభిస్తాది క్లిష్టపరిస్థితుల్లో కూడా. మనోవికారమూ, మనోవికాసమూ రెండురకాలూ మన మనశ్చలనంతో చేసే చర్యల ఫలితాలే. కాబట్టి మనసుని స్థిరంగా మంచి స్థితిలో ఉంచడానికి తరచూ ప్రయత్నం చేస్తుండాలి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు  కూడా మనసుని రంజింపజేస్తాయి. ఎటువంటి చాపల్యాలకూ లోనుకాకుండా మనసును దృఢంగా ఉంచుకోవడం కష్టమే. మనం ఎప్పటికప్పుడు ధ్యానయోగాలతో మన మనస్సుని ప్రక్షాళన చేసుకుంటూ, నియంత్రించుకోగలిగే శక్తిని పొందాలి. మన మనసుని అదుపులో ఉంచుకొని, సద్వినియోగ పరచుకోగలిగితే స్వకల్యాణంతోపాటు లోక కల్యాణం కూడా జరుగగలదు. మన మనసు మన వశమై, చక్కగా సత్కర్మలు ఆచరిస్తూపోతే ఉత్సాహం పెరిగి, సేవాకార్యక్రమాలు చేయగలుగుతాం. ఇలాంటి సంతృప్తితో జీవితం ప్రశాంతంగా గడపగలుగుతాం. మంచి మనసుతో సద్బుద్ధి, ఉత్తమ సంస్కారం వెనువెంటనే వచ్చి, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. మనసులోనిది, మాటల్లోనూ, మాటల్లోనిది చేతల్లోనూ చూపించగలిగి, ఔన్నత్యం పొందగలుగుతాం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!