లక్ష్యం

(అంశం:: “అర్థం అపార్థం”)

లక్ష్యం

రచన:: సావిత్రి కోవూరు

లీవ్ పెట్టి వచ్చిన వినయ్ ఇంటికి తాళం ఉండేసరికి ఆశ్చర్యపోయాడు. పెళ్లయిన మూడేళ్లలో స్వప్న ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేసే వెళ్ళేది. మరి ఎందుకు ఈ రోజు ఫోన్ చేయకుండ ఎక్కడికెళ్ళింది అనుకుని తనే ఫోన్ చేశాడు. జవాబు లేదు.

పక్కింటి ఆంటీకి ఫోన్ చేసి “స్వప్న ఎక్కడికెళ్తుందో మీకేమయిన చెప్పిందా ఆంటీ” అన్నాడు.

“లేదు బాబు నాకు ఏం చెప్పలేదు. తను ఈరోజు నాతో మాట్లాడ లేదసలు” అన్నది పక్కింటి ఆంటీ.

కొత్త సినిమా టికెట్స్ తీసుకుని, ఆఫ్ డే లీవ్ పెట్టి వచ్చాడు. స్వప్నను ‘సర్ప్రైజ్’ చేద్దామని ఎంతో ఆశతో. సరేలే ఏదో పని పడి వెళ్ళి ఉంటుంది. అనుకొని టీవీ చూస్తూ కూర్చున్నాడు. ఒక గంట తర్వాత వచ్చింది స్వప్న.

“ఎక్కడికి వెళ్లావు స్వప్న,  కొత్త సినిమా టికెట్స్ తెచ్చాను. వేస్ట్ అయినాయి” అన్నాడు.

స్వప్న “సారి అండి, పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్లాను” అన్నది స్వప్న.

“ఎక్కడికి” అన్నాడు నొక్కి పలుకుతూ.

“పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్లి, అక్కడి నుండి బ్యాంగిల్స్ షాప్ కి వెళ్లా”నని తేలికగా అబద్దమాడేసిన స్వప్నను వింతగా చూశాడు.

“సరేలే” అన్నాడు వినయ్.

మళ్లీ రెండు రోజుల తర్వాత వినయ్ , స్వప్నకు ఫోన్ చేస్తే జవాబు లేదు. ఏమైంది స్వప్నకు ఈమధ్య చాల వింతగా ప్రవర్తిస్తుంది.  ఫోన్ ఎక్కడ పెడుతుందో ఏమో ఎప్పుడు ఫోన్ చేసినా జవాబుండదు, అని విసుక్కున్నాడు.

రెండు మూడు రోజులకు వినయ్ చెల్లెలు రాజీ ఆఫీస్ కి ఫోన్ చేసి,
“అన్నయ్య నేను వదిన తో కలిసి షాపింగ్ చేద్దామని వచ్చాను. వదిన లేదు ఇంటికి తాళం ఉంది. పక్కింట్లో కూర్చున్నాను చాల సేపయ్యింది” అన్నది.

“అవునా రాజీ సరె నేను వస్తున్నాను పదిహేను నిమిషాల్లో. అక్కడే ఉండు అని, పదిహేను నిమిషాలకు వచ్చాడు వినయ్. వినయ్ వచ్చేసరికి రాజీ, స్వప్న స్నాక్స్ తింటూ, నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. నన్ను చూసి స్వప్న నాక్కూడ స్నాక్స్ తెచ్చింది. ముగ్గురం కూర్చుని స్నాక్స్ తిని, కాఫీ తాగుతుండగా,

“స్వప్న ఎక్కడికి వెళ్లావు. రాజీ వచ్చేసరికి లేవట” అన్నాడు.

“వీధి చివర షాప్ లో సారీ ఫాల్స్ కు వెళ్ళానండి” అన్నది.

రెండు రోజులు స్వప్న, వినయ్, రాజీతో కలసి షాపింగ్ చేశారు. “అయిపోయిందా నీ పెళ్లి షాపింగ్. మరి బట్టలకి ఎప్పుడు వస్తున్నారు? అయినా ఊరికే అటూ ఇటూ తిరిగే బదులు షాపింగ్ అంతా అయిపోయే వరకు ఇక్కడే ఉండొచ్చు కదమ్మా”అన్నాడు వినయ్ చెల్లెలితో.

“అవును రాజీ అత్తయ్య వాళ్ళని కూడా రమ్మందాము. పెళ్లి నెలరోజులు కూడ లేదు. మొదట చీరలు కొంటే వాటికి ఫాల్స్, బ్లౌజెస్  స్టిచ్చింగ్ కి టైం పడుతుంది. నీవు ఇక ఇక్కడే ఉండు” అన్నది స్వప్న.

“సిటీకి షాద్ నగర్ ఎంత దూరం వదిన. ఓ.ఆర్.ఆర్ పై నుండి పోతే గంటన్నరలో ఇంటికి చేరుకుంటాము. నీకు తెలుసు కదా! నాన్న ఎంత బిజీగా ఉంటారు. అక్కడ వ్యవసాయం పనులు, బిజినెస్ పనులు. నాకు కూడా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. అవి అయ్యాక అమ్మానాన్న తో కలిసి వస్తాను. చీరల షాపింగ్ చేసిన తర్వాత అమ్మ నాన్న వెళ్లి పోతారు. నేను ఉంటాను లే” అన్నదిరాజీ.

“సరేలే నీ ఇష్టం. అది సరే కాని మీ పెద్దనాన్న కూతురు ఇందిర ఎలా ఉంది.ఇక్కడ ఉందా? అత్తవారింట్లో ఉందా?”

“ఆషాడ మాసం కదా వదిన మొన్ననే వచ్చింది. వాళ్ళ అత్తగారు కూడా కొత్త కోడలిని బాగానే చూసుకుంటున్నారట. చాల సంతోషంగా ఉన్నది. అది వచ్చిందని పెద్దమ్మ, పెదనాన్న వాళ్ళు ఎంతో హడావుడి చేస్తున్నారు. మొన్న జూన్ లోనే కద దాని పెళ్లి అయ్యింది. అప్పుడే పెద్దదానిలా మా ఆయన, మా ఆయన అని నిమిషానికి పదిసార్లు వాళ్ళాయన భజన చేస్తు తెగ బోర్ కొట్టిస్తుంది వదిన. అయినా ఏ మాటకామాటే చెప్పుకోవాలి. దాని పెళ్ళి ఎంతో సరదాగా జరిగింది కదా వదినా. ఈ మధ్యన ఇంత సరదాగా గడిపిన పెళ్ళిళ్ళే లేవు.” అన్నది రాజీ.

“నీ పెళ్లి కూడా అలాగే సరదాగా జరుగుతుందిలే” అన్నది స్వప్న.  మూడవ రోజు రాజీ వెళ్ళిపోయింది.

మరుసటి రోజు ఏదో పేపర్ కాపి అవసరం ఉండి ఇంటికి ఫోన్ చేశాడు వినయ్. మళ్లీ జవాబు లేదు. వినయ్ తనే ఇంటికి వచ్చి ఆ పేపర్ తీసుకుని వెళ్ళిపోయాడు.

సాయంత్రం వచ్చాక “ఎక్కడికి వెళ్లావు మధ్యాహ్నం వచ్చి వెళ్లాను. ఒక పేపర్ ఫోటో తీసి వాట్సప్ లో పంపుతావేమో అని ఫోన్ చేశాను. నీ ఫోన్ ఎక్కడ పెడుతున్నావసలు ఎప్పుడు జవాబు ఉండదు” అన్నాడు కొంచెం అసహనంగా.

ఏదో పొంతనలేని జవాబు చెప్పింది స్వప్న. ఆ రోజు నుండి వినయ్ ఆలోచించడం మొదలు పెట్టాడు. అసలు పెద్ద నాన్న కూతురు పెళ్లికి ఊరికి వెళ్ళి వచ్చినప్పటి నుండి స్వప్న మారి పోయింది. రోజు తను ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ఎక్కడికో వెళుతుంది. ఆ విషయం మామ గారికి ఫోన్ చేసి చెప్పాడు

“మామగారు మీ అమ్మాయికి పాత ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉన్నారా? ఆయిన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే, చెప్పాలి కదా! నాకు. రోజు ఎక్కడికో వెళుతుంది. అసలు ఎక్కడికి వెళతానన్నా నేను వద్దంటానా. కావాలంటే నేను తీసుకెళ్తాను కదా. ఎక్కడికి వెళ్లావు అని ఎప్పుడు అడిగినా ఏదో అబద్దాలు చెప్తుంది. సరిగ్గా జవాబు చెప్పదు. కానీ నేను ఆఫీస్ కి వెళ్ళగానే వెళ్ళిపోతుంది. నాలుగైదు గంటల వరకు రావట్లేదు. చెప్పకుండా ఎందుకు వెళ్ళడం. నన్ను ఏం చేయమంటారు? తను ఒట్టి మనిషి కూడ కాదు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇలా తిరిగితే బాగుంటుందా” అన్నాడు ఆవేదనగా.

“నీవు బాధపడకు బాబు. నేను తీరిక చేసుకుని వచ్చి నెమ్మదిగా అడుగుతాను. నీవు ఏమనుకోకు. నీవు అడగకు స్వప్నను హర్ట్ అవుతుంది. ఇది సున్నితమైన విషయం. అనవసరంగా చిక్కులు తెచ్చుకోకండి. ఆ సంగతేమిటో నేను మెల్లగా అడుగుతాను” అన్నాడు దశరధ రామారావు

“అది కాదు మామయ్య తనకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండేవాళ్ళా? పెళ్లికి ముందు. వాళ్ళని కాదని నాకు ఇచ్చి చేశారా అని అనుమానమొస్తుంది. మరి ఇంకెవరినైన కలవడానికి వెళ్తుందా. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు. నెల రోజులనుండి ఇదే తంతు. మామూలుగా అయితే నాకు చెప్పాలి.  ఇలా దొంగతనంగా వెళ్ళడం ఏంటి? తను ఎందుకు ఇలా తిరుగుతుంది.ఆలోచించి ఆలోచించి నా బుర్ర వేడెక్కి పోతుంది. మీరు అడుగుతారా ప్లీజ్. అన్నాడు వినయ్.

“అయ్యో బాబు అలాంటిదేం లేదు. అది మేలిమి బంగారం. మిమ్మల్ని పెళ్ళి చూపుల్లో చూసి నచ్చారని చెప్తేనే పెళ్ళి చేశాము. నా దగ్గర దానికి చిన్నప్పటి నుండి మనసులో మాట చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. మీరు ఎప్పుడూ అలా అనుకోకండి. నా పెంపకంపైనా, మా అమ్మాయి నడవడిక  పైనా నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు కూడా మూడేళ్ల నుండి చూస్తున్నారుగా ఎప్పుడైనా అనుమానం వచ్చేలా ప్రవర్తించిందా. అది పూర్తిగ మెచ్యూర్డ్ మెంటాలిటీ ఉన్న పిల్ల. నేను దాంతో మాట్లాడే వరకు మీరేమీ ఈ విషయం కదపకండి. ఎందుకంటే ప్రెగ్నెంట్ కదా ఒత్తిడికి గురైతే మంచిది కాదు. మీ చెల్లి పెళ్లి అయిందాక ఓపికపట్టండి. తర్వాత నేను అడుగుతాను” అన్నారు స్వప్న వాళ్ళ నాన్న దశరథ రామారావు.

ఎంత చెప్పినా వినయ్ మనసులో ఒకలాంటి అనుమానం మొదలై, రోజు రోజుకు పెరగ సాగింది. స్వప్నతో మునపట్లా ఉండలేక పోతున్నాడు.  రోజురోజుకీ రకరకాల అనుమానాలు వస్తున్నాయి. చెల్లి పెళ్ళికి ఊరికి వెళ్ళినా, అక్కడ కూడా సంతోషంగా గడప లేక పోతున్నాడు.

పెళ్లి కూతురుని చేసే రోజు పాటల విషయం వచ్చేసరికి, అందరూ మామూలు పాటలు వస్తాయి కానీ, సాంప్రదాయపు పెళ్లి పాటలు రావు అన్నారు.

ఎవరో “స్వప్న నీవు పాడవే” అన్నారు.

వెంటనే వినయ్ “తనకు రావండి” అని చెబుదామని అనే లోపలే,

“సరే పిన్ని” అని  పెళ్ళి కూతురిని చేసేటప్పుడు పాడే పాట రాగయుక్తంగా పాడడం మొదలు పెట్టింది.  స్వప్న అలాంటి  సాంప్రదాయపు పాటలు, అది కూడ శాస్ర్తియ బద్దంగా పాడుతుందని ఎవ్వరూ ఊహించలేదు.ఎందుకంటే అంతకు నెల ముందరే జరిగిన వాళ్ళ పెద్ద మామ గారి కూతురు పెళ్లి లో అందరు పోటీలు పడి పాటలు పాడారు, ఒక స్వప్న తప్ప. ఈ పెళ్లి లో  కొట్నం దగ్గర పాట, ఎదుర్కోళ్ళ పాట, పెళ్లి కూతురును చేసే పాటలు  ఏ సందర్భానికి తగిన పాటలు ఆ సందర్భంలో పాడుతుంటే వినయ్ తో పాటు అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు.

కొద్ది సేపయిన తర్వాత వినయ్ మేడ పైన బట్టలేవో తెచ్చుకోవడానికి వెడుతుంటే, మేడపై నుండి స్వప్న, ఇందిర మాట్లాడే మాటలు వినిపించి మెట్లపైనే ఆగిపోయాడు.

“వదిన నా పెళ్లప్పుడు ఒక్క పాట కూడా పాడలేదు. మరి ఇప్పుడు అడుగు అడుగుకి పాటలు పాడుతున్నావు. నీవు కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నావా” అన్నది ఇందిర.

“ఇందిరా నీ పెళ్లి అప్పటికీ నాకస్సలు పాటలు రావు. అందరూ పాడుతుంటే మీ అన్నయ్య చాలా ఇంట్రెస్ట్ గా వింటున్నాడు. దానివల్ల వినయ్ కి పాటలు వినడం ఇష్టం అని అర్థమైంది. ఎలాగైనా తనకు తెలియకుండా సంగీతం నేర్చుకుని, ఈ పెళ్ళిలో మీ అన్నయ్యని సర్ప్రైజ్ చేద్దామని, ఒక నెల నుండి ఒకావిడ దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నాను. ఆమెకి డబుల్ ఫీజు ఇచ్చి, ఎక్కువ టైమ్ సాధన చేసి ఎలాగైనా ఈ పెళ్లి లో పాడాలని పట్టుదలగా నేర్చుకున్నాను. మీ అన్నయ్య ఎన్నిసార్లు “ఎక్కడికి వెళ్తున్నావ్”అని అడిగిన ఏవో జవాబులు చెప్పి అసలు సంగతి దాచిపెట్టాను. ఒక్కొక్కసారి మీ అన్నయ్యకి కోపం వచ్చి విసుక్కునేవారు. అయినా సంగీతానికి వెళుతున్నట్లుగా ఒక్కసారి కూడా చెప్పలేదు. ఈరోజు శాస్త్రీయంగా నేను పాటలు పాడే సరికి మీ అన్నయ్య మొహం లో కనిపించిన ఆశ్చర్యం నేను ఎప్పటికీ మర్చిపోను. నీ పెళ్లిలో నాకు పాటలు రావని, నా కంటే ముందు తానే చెప్పి నన్ను రక్షించాడు. మా ఆవిడకు పాటలు రావని చెప్పవలసిన అవసరం ఇక ముందెప్పుడు మీ అన్నయ్యకు రాకూడదని, నెల రోజులు ఎంతో కష్టపడి నేర్చుకున్నాను. ఇప్పుడు పెండ్లి పాటలు పాడి నట్టుగానే మీ అన్నయ్యకి ఇష్టమైన ఘంటసాల పాటలు కూడా చాలా నేర్చుకున్నాను. ఇక చాలు మొర్రో అనే వరకు పాడి వినిపిస్తాను మీ అన్నయ్యకు” అన్నది సంతోషంతో కూడిన స్వరముతో.

ఆ మాటలన్నీ చాటుగా మెట్ల పై నుంచి విన్న వినయ్, పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. తను స్వప్నను మూర్ఖంగా ఎంత అపార్థం చేసుకున్నాడు. మూడేళ్లలో ఒక్కరోజు కూడా అనుమానించేటట్టు  ప్రవర్తించని స్వప్నను ముప్పైరోజుల్లో ఎంత అనుమానించాడు. దేవుని దయవల్ల స్వప్న ముందర తన అనుమానం వ్యక్త పరచలేదు. కనుక తన గౌరవం దక్కింది. లేకపోతే జీవితాంతం స్వప్న ముందర తలవంచుకునే పరిస్థితి వచ్చేది. తన మనసులో వచ్చిన అనుమానం స్వప్న కి తెలిస్తే జన్మలో క్షమించేది కాదు అనుకున్నాడు.

వెంటనే మామ గారికి ఫోన్ చేసి “సారీ మామయ్య స్వప్న విషయంలో నేను మూర్ఖుడిలా మాట్లాడాను. అంతా  మర్చిపోయి నన్ను క్షమించండి. మన ఇద్దరి మధ్య జరిగిన విషయాలేవీ స్వప్నకు
తెలియనివ్వకండి ప్లీజ్. తనకి తెలిస్తే నన్ను జన్మలో క్షమించదు నా స్వప్న. నా కాపురం కూలిపోతుంది.
అన్నాడు వినయ్. కూతురి గురించి అల్లుడు మాట్లాడిన మాటలు విన్న ఆ పితృ హృదయం ఉప్పొంగి పోయింది.

You May Also Like

One thought on “లక్ష్యం

  1. థీమ్ చాలా బాగుంది. కంగ్రాట్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!