రాలిన ఆశలు
రచన :: జయసుధ కోసూరి
రాలిపోతున్న బంధాలు
మూగబోతున్న మనసులు..!
జీవితం నల్లేరు పై నడకేం కాదు.
గుచ్చిన పల్లేరు కాయల మయమే..!
ఎన్నో ఆశలు, ఆశయాలతోనిండి
చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా
ఊరిస్తుంది..!
ఆశగా శ్వాస కోసం చెట్టు వైపు చూసే
ఆ చూపే చివరిదైతే..?
అల్లుకున్న ఆశాలతలు పందిరెక్కకుండానే
మొదలంటా కూలిపోతున్నాయి.
ఎన్ని దిగుళ్ల మూటల్ని
నెత్తికెత్తుకుందో మనసు..
మెలిదిరిగిన సుడిగాలిలా
కొట్టుకుంటోంది..!!
అయిన వాళ్ల కోసం ఆరాటపడుతూ..
జీవితం నిమ్మళంగా సాగాలని కోరుకుంటుంది.
ఇన్ని బాధల్ని వెనకేసి..
త్వరగా రెండేళ్లు ముందుకు
పరిగెత్తాలని..
కాలపు చక్రాలకు
ఆత్రపు గ్రీజు పూస్తున్నా..!!
****