తొలివలపు

(అంశం:: “నా ప్రేమ కథ”)

 తొలివలపు

రచన: వడ్ల పాండు రంగాచారి

కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆపలేం అంటుంటారు కదా! నా విషయంలోనూ అదే జరిగింది. పెళ్లంటే అయిదురోజుల పెళ్లి అంటారు కదా, కానీ నా పెళ్లి అయిదు రోజుల ముందే నిశ్చయం అయ్యింది.
ఓ.. మర్చిపోయా.. ముందు నేనెవరో చెప్పాలి కదా, మీకు..
నా పేరు మీరా, పుట్టింది పెరిగింది అంతా అమ్మమ్మ వాళ్లింట్లోనే, అమ్మమ్మ వాళ్ళకి అమ్మ ఒక్కతే కూతురు, అమ్మకి పెళ్లి అయ్యాక, అమ్మ నాన్నమ్మ వాళ్ళ దగ్గరే ఉండేది, నేను కడుపులో పడ్డాక అమ్మమ్మ దగ్గరకు వచ్చింది, నేను అక్కడే పుట్టాను, నేను ఒక సంవత్సరం వయసు రాక ముందే నాకో తమ్ముడు కూడా..
ఏడాది ఉన్న నన్ను, పుట్టి కొన్ని రోజులే అయిన తమ్ముడిని చూసుకోవడానికి అమ్మకి కష్టం అవుతుందని నన్ను అమ్మమ్మ దగ్గర ఉంచారు తమ్ముడు కాస్త పెద్దయ్యే వరకు. ఆలోపే నాకు అమ్మమ్మ బాగా అలవాటయ్యింది. అమ్మ వచ్చి తనతో రమ్మన్నా వెళ్ళేదాన్ని కాదు, ఒకసారి బలవంతంగా నాన్న ” నన్ను చూడలేక ఉండలేకపోతున్నాను” అని ఇంటికి తీసుకెళ్లారు, తీసుకెళ్లాక ఒక్క రోజులోనే నాకు జ్వరం పట్టుకుంది, నిద్రలో అమ్మమ్మ అమ్మమ్మ అని కలవరిస్తుంటే, డాక్టరుకి చూపించారు, డాక్టరు “బయపడాల్సింది ఏం లేదు, బెంగ జ్వరం, వాళ్ళ అమ్మమ్మని తీసుకు వచ్చి చూపించండి” అన్నారు.

అమ్మమ్మని రమ్మని అడిగితే, తాతయ్యని ఒక్కడినే వదిలేసి రావడానికి ఒప్పుకోలేదు, నన్నే అక్కడికి తీసుకురమ్మని, తనే చూసుకుంటాను నన్ను అని చెప్పింది.

నన్ను వదిలేసి అమ్మ నాన్న ఉండలేరు, అయిన కూడా నా ఆరోగ్యం కోసం నన్ను అమ్మమ్మ దగ్గరే ఉంచారు, అమ్మ నాన్న వారానికి పడి రోజులకు వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు..

అమ్మమ్మ నాకు అమ్మ అయింది, అన్నీ తానే చూసుకునేది, నేను వయసుకు వచ్చాక నా పెళ్లి విషయం కూడా అమ్మమ్మ చేతిలోనే పెట్టింది అమ్మ.

ఆడుతూ పాడుతూ తిరిగే నాకు, చిన్నప్పటి నుండి ఎంతో స్వేచ్ఛని ఇచ్చిన అమ్మమ్మ ఆ తరువాత నుండి కొన్ని హద్దులు పెట్టడం మొదలు పెట్టింది, ఇంట్లో పనులు నేర్పేది, ఎందుకని అడిగితే, ఇప్పుడు అలవాటు చేసుకోకపోతే అత్తారింటికి వెళ్ళాక ఇబ్బంది పడతావు అంది.

ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎవరితో ఏం మాట్లాడకూడదో కూడా చెప్పేది.
ఎంతో ప్రేమగా చూసుకునే అమ్మమ్మ కొన్ని విషయాల్లో నన్ను కోప్పడడం నాకు కొత్తగా అవడం వలన కొంత బాధనిపించినా, నా అమ్మమ్మేగా ఏం చేసినా నా మంచికే అని అనుకునేదాన్ని.

రోజులు అలా గడుస్తుండగా.. హఠాత్తుగా ఒకరోజు మా ఇంటికి కొందరు అపరిచితులు వచ్చారు. నన్ను చూసుకోడానికి అంట అమ్మమ్మ చెప్తే తెలిసింది, పక్కింట్లో ఉండే రాజి అక్క వచ్చి హడావిడిగా రెడీ చేసింది నన్ను, నాలో అప్పుడు ఎలాంటి భావాలు కలిగాయో నేను తెలుసుకునేలోపే నా పెళ్లి చూపులు అయిపోయాయి, అలా హాల్లో అందరి ముందు కూర్చోవడం నాకు కాస్త ఇబ్బందిగా ఉన్నా కూడా తప్పదు కదా, కూర్చున్నాను, అక్కడ ఉన్నది పది నిమిషాలే అయినా నాకు పది యుగాలు గడిచినట్లుగా ఉంది, వచ్చిన వాళ్ళు నన్ను చూసుకున్నారు, అమ్మమ్మని ఏవేవో అడిగారు, నన్ను కూడా అబ్బాయిని చూడమని చెప్పారు, కను రెప్పలు కూడా అంత బరువుగా ఉంటాయని అప్పుడే తెలిసింది, మెల్లగా కన్నెత్తి చూసాను ఎదురుగా… ఒక ముసలాయన కనిపించారు బట్ట తలతో, పక్కనుండి ఒక ఆడ గొంతు ” అమ్మా! ఆయన మీ తాత గారు, మీ కాబోయేవారు ఇదిగో ఇటు పక్కన” అన్నది నవ్వుతూ,  నేను చురుక్కున అటు తిరిగాను, నా కళ్ళల్లో ఉన్న కోపం మాయం అయింది, శ్రీ రామ చంద్రుని గురించి వినడమే కానీ చూసే అదృష్టం లేదు అనుకునేదాన్ని, కానీ ఆయన్ని చూసాక అలానే ఉంటారేమో అనిపించింది, శివధనుస్సు విరిచిన సమయంలో సీతాదేవి కూడా రాముడి అందానికి నాలానే పడిపోయింది కాబోలు. కళ్ళతో మాయ చేయడం ఎక్కడ నేర్చుకున్నారో నాకు తెలియదు కానీ చేసేసారు, ఇద్దరం కనురెప్పలు వేయడం మరిచాము, కాలం కూడా కదలడం మానేసింది, మా ఇద్దరి చూపులు కలిసిన క్షణాలను దాచుకుంటూ..

“ఇక చూపులతోనే కాపురాలు చేసేస్తారా? లేక మీకు పెళ్లి చేసే అవకాశం మాకు ఇస్తారా? ” ఒక అమ్మాయి చురక వేసింది, దాంతో సిగ్గుతో నా బుగ్గలు ఎర్ర బడ్డాయి, అయన కళ్ళు కిందకి వాలాయి, ఇందాక ఆలా అన్న ఆవిడ, నాకు కాబోయే వారి అక్క అని తరువాత తెలిసింది.

“అమ్మాయిని లోపలి తీసుకెళితే పెద్దవాళ్ళం మనం మాట్లాడుకునేది మాట్లాడుకోవచ్చు” మా కాబోయే మామగారి గొంతు.

ఎవరివరివో మాటలు వినపడుతున్నాయి, కానీ మా వారి అదే నాకు కాబోయ్ భర్త స్వరం వినే అవకాశం రాలేదు. నన్ను రాజి అక్క లోపలికి తీసుకుని వచ్చింది, లోపలికి వచ్చినా, హాల్లో  ఉన్నవారి మాటలు నాకు వినపడుతున్నాయి, మా అమ్మానాన్న లేకుండానే నా పెళ్లి చూపులు జరిగాయి, కానీ నాకు లోటు ఎక్కడ తెలియలేదు, మా అమ్మమ్మ ఉండగా ఏం వెలితి నాకు. అన్ని మాటలు అమ్మమ్మే మాట్లాడేసింది, నా కట్నకానుకలతో సహా, రెండు కుటుంబాలకి అన్నీసమ్మతమే అవడంతో,  మా ఇద్దరి జాతఃక చక్రాలు ఒకరివి మరొకరికి ఇచ్చిపుచ్చుకుని, ముహుర్తాలు చూసుకుని కబురు చేస్తామని వాళ్ళు వెళ్లిపోతున్నారు, నాకు నా ప్రాణాన్ని ఎవరో లాగేసుకుని వెళ్ళిపోతున్నట్లు అనిపించింది, కిటికీలో నుండి తొంగి తొంగి చూసాను, ఆయన కనిపిస్తారేమో అని,  మా ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టు కొమ్మల్లో నుండి నన్ను వెతుకుతూ కనిపించారు ఆయన, మా ఇద్దరి చూపులు కలవకుండానే ఆయన కారు ఎక్కేసారు.

అప్పటి నుండి ఆయనే నా కళ్ళ ముందు కనపడుతూ ఉన్నారు, అబ్బాయి నచ్చాడా అని అమ్మమ్మ అడిగితే నా ఎర్రబడి సిగ్గుల బుగ్గలతో సమాధానం చెప్పాను, అమ్మా  వాళ్లకి అమ్మమ్మ ఫోన్ చేసి చెప్పింది విషయం. నాన్న కూడా మీకు ఇష్టం అయితే మాక్కూడా ఇష్టమే అన్నాడు, అమ్మమ్మ కంగారు పడుతూ ఉంది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, ఎలా అయినా ఈ సంబంధం ఖాయం చేయమని ఏ దేవుడు గుర్తొస్తే ఆ దేవుడికి మొక్కుతోంది, మా జాతకాలు కలిసేలా చూడమని .

అమ్మమ్మ మొక్కిన అందరు దేవుళ్లలో ఏ దేవుడు కరుణించాడో కానీ అదే రోజు సాయంత్రం వాళ్ళు ఫోన్ చేసి ” ఇద్దరి జాతకాలు కలిసాయి, కానీ ఒకటే సమస్య” అన్నారు.

అమ్మమ్మ గుండె అరచేతిలో పట్టుకుని ” ఏమిటి సమస్య?” అని అడిగింది.

వాళ్ళు “ఈ బుధవారం రోజున మంచి ముహూర్తం ఉంది, అది దాటితే మళ్ళీ అయిదు సంవత్సరాల వరకు ముహుర్తాలు లేవు, ఇద్దరి జాతకాల ప్రకారం” అన్నారు.

అమ్మమ్మ “బుధవారం అంటే ఇంకా అయిదు రోజులే ఉంది కదండీ, మరి పెళ్లి పనులు అంటే ఎన్నో ఉంటాయి కదా, అవుతాయా? ” అని అమ్మమ్మ అనుమానంతో అడిగింది, పెళ్లి చేసేస్తే అంత కన్నా సంతోషం ఏంటి నాకు అనే భావంతో..

అవతల నుండి “మీరు ఏమి కంగారు పడవలసింది ఏమి లేదు, పెళ్ళికి ఎవరిని పిలవాలి అని మాత్రం లిస్టు రాసి పిలుచుకోండి, పెళ్ళికి ఏమేమి కావాలో అవన్ని ఇద్దరం కలిసే ఒకేసారి తీసుకుందాం, ఖర్చులు సమయం ఆదా అవుతాయి, ఏదైనా ఉంటే పెళ్లి తరువాత చూసుకుందాం, ముందు పెళ్లి అవనీయండి” అన్నారు.

అమ్మమ్మ కూడా సరేనని ఒప్పేసుకుని వెంటనే అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసింది, అయిదు రోజుల్లో పెళ్లి, కుటుంబం మొత్తం వచ్చేయండి అని.

నాకు గుండెల్లో గుబులు మొదలయ్యింది, “అమ్మమ్మని వదిలి వెళ్లిపోవాలా? నా పెళ్లి అయితే, అంటే అమ్మమ్మ నాతొ ఇంకా అయిదు రోజులు మాత్రమే ఉంటుందా?” అని.

అమ్మమ్మని చుట్టేసుకుని ఏడ్చేసాను.అమ్మమ్మ భయపడింది, “ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా?” అని అడిగింది.

“కాదు అమ్మమ్మ , నిన్ను వదిలి వెళ్లాలంటే దిగులుగా ఉంది” అన్నాను.

“ఓసి పిచ్చిదానా ఎక్కడికి వెళుతున్నావు? పక్క ఊరికే కదా, నీకు వీలైనపుడు నువ్వు ఇక్కడికి రా, నాకు నిన్ను చూడాలనిపించినపుడు నేను మీ దగ్గరకి వస్తాను, నా మనుమడు కాదంటాడా ఏంటి?,అబ్బాయి మంచివాడు. ఇంతకన్నా మంచి సంబంధం కుదరదు, నా మాట విని చేసుకో ” అంది.

అమ్మమ్మ మాటలకి కాస్త ధైర్యం వచ్చింది.

ఈ అయిదు రోజులు పెళ్లి పనుల్లో అసలు సమయమే తెలీలేదు. ఈ రోజే నా పెళ్లి, ఆయన్ని పెళ్లి కొడుకుగా చూడబోతున్నాను. సిగ్గు, ఆత్రుత, ఇక ఏవేవో కొత్త కొత్త భావాలు నాలో…

వేదిక ముందు ఎవరెవరు కుర్చున్నారో అని గమనించే స్థితిలో నేను లేను, పురోహితుడి మంత్రాలను చేపిస్తున్న పూజలను నామనసు వినడంలేదు, ఆయన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉగిసలాడుతోంది.

ముహూర్త  సమయం ఆసన్నమైంది, ఇద్దరిని ఎదురెదురుగా నిల్చోబెట్టి మధ్యలో పరదా వేసారు, మా ఇద్దరి చేతిలో జీలకర్ర బెల్లం పెట్టి మంత్రాలు చదివి ఆ జీలకర్ర బెల్లం ఒకరి తలపై ఒకరిని పెట్టమని చెప్పారు, అలాగే చేస్తూ మేము ఒకరి కళ్ళల్లోకి ఒకరం చూసుకున్నాము, ఆకాశంలో ఉండే మెరుపులకన్నా కాంతివంతమైన మెరుపులు కనిపించాయి, అయన కళ్ళల్లో.

తరువాత మాంగళ్య ధారణ కార్యక్రమం, నేను మనసా వాచా అయన సొంతం ఇప్పుడు, మూడు ముళ్ళేసి, జన్మజన్మల బంధం మాది, ఏ జన్మలోను విడిపోము అని నన్ను ముడివేసుకున్నట్లు అనిపించింది నాకు.

అయన తలంబ్రాలు పోస్తుంటే, నా తలపై నుండి జాలువారుతుంటే నేను ఆయనని చూస్తున్నాను ఆ జాలువారుతున్న తలంబ్రాల మధ్యలో నుండి, నక్షత్రాల నడుమ చంద్రుడిలా అయన కనిపిస్తున్నారు,

హోమం చుట్టూ ఏడడుగులు  నడుస్తూ జీవితాంతం నా అడుగులు అయన అడుగుల్లోనే అనుకుంటూ నడిచాను.

పెళ్లి అయిపొయింది, పెళ్ళికి వచ్చిన పెద్దలు అంతా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు, మా స్నేహితులు వచ్చి అభినందిస్తున్నారు, ఎవరెవరు వచ్చారో నాకు అసలు గుర్తే లేదు, “ఎంత అదృష్టమో నాది, చూడముచ్చటైన జంట” అని అందరూ అనుకుంటున్న మాటలు నా చెవుల్లో ఇంకా వినపడుతున్నాయి, ఎందుకంటే ఆ మాటలు అయన గురించి కదా.

పెళ్ళికి ముందు ప్రేమకథలు ఎన్నిసుఖాంతం అయ్యాయో నాకు తెలీదు కానీ, పెళ్లితో మొదలైన ప్రేమకథలు మాత్రం ఎప్పటికి విడిపోవు అని నా నమ్మకం.

నా ప్రేమ వయసు అయిదు రోజులే అని నాకెప్పుడూ అనిపించలేదు, ఏడడుగుల అనుభందం, ఎన్నెన్నోజన్మల బంధం మాది అని అనిపించింది, మా జంట కలకాలం ఇలాగే ప్రేమను పంచుకుంటూ, పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని దీవించండి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!