గూటికి చేరిన గువ్వలు

గూటికి చేరిన గువ్వలు

 

“నీ నిర్ణయం చెప్పు సుజాత ఏమంటావు?” భార్యని అడిగారు సత్యమూర్తి.

“ప్రత్యేకంగా నా అభిప్రాయం ఏమీ లేదండి. మీ ఇష్టం. మీరు ఏమంటే నేనూ అదే” అందావిడ.

“అయితే సరే పిల్లలకి ఈ విషయం ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నాను” అన్నాడాయన.

“అదేదో మీరే ఆలోచించండి. మీ మాట వాళ్ళు ఎప్పుడూ కాదనలేదు కదా” అంది ఆవిడ.

ఆ రాత్రి కొడుకు ఫోన్లో “గుడ్ మార్నింగ్ నాన్నా. ఇప్పుడే కాఫీ తాగాను. చెప్పండి, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు, రాత్రి నాకు కుదరక మీకు ఫోన్ చెయ్యలేదు. ఏంటి నాన్నా ఆ విషయం” అంటూ అడిగాడు సుభాష్.

“అదీ ఏం లేదురా. నా ఉద్యోగం కోసం, మీ చదువుల కోసం ఇక్కడకు వచ్చాము. మీ చదువులు అయిపోయాయి. మీ అక్కా, బావా కాలిఫోర్నియా లో సెటిల్ అయిపోయారు.

నువ్వేమో పెళ్లి కాగానే అమెరికాలో ఉద్యోగం తెచ్చుకున్నావు. ఇప్పుడే ఇండియా వచ్చేది కూడ లేదన్నావు. ఇంకా మేము ఇక్కడే ఎందుకు ఉండాలి? ఇక్కడ మాకు ఎవరున్నారని? అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఊర్లో మన ఇల్లు అమ్మకుండా అలాగే ఉంది కదా. హాయిగా మా ఈ శేష జీవితాన్ని అక్కడే గడిపెయ్యాలని అనుకుంటున్నాం. ఏమంటారు?” అని నెమ్మదిగా విషయం సూటిగా చెప్పారు సత్యమూర్తి గారు.

“అదేంటి నాన్నా, అక్కడ మీకు ఏం తక్కువ ఉందని ఇప్పుడు ఊరికి వెళ్ళి ఏం చెయ్యాలి? మీకోసం అనే కదా ట్రిపుల్ బెడ్రూం, ఇండిపెండెంట్ ఇల్లు, అన్ని సౌకర్యాలతో తీసుకున్నాం. పక్కనే మార్కెట్, దగ్గర్లో పార్కు, అన్నీ ఉన్నాయని ఖర్చుకు కూడా వెనకాడలేదు. ఇప్పుడు మీరు అక్కడనుంచి వెళ్లిపోతాను అంటారేంటి నాన్నా?” అనడిగాడు అనుమానంగా సుభాష్.

“అదేం లేదురా నాన్నా, ఇక్కడ అంతా బాగానే ఉంది రా. కానీ ఏదో వెలితి. ఇక్కడంతా కార్పోరేట్ విధానాలు, వెస్ట్రన్ పద్ధతి. పలకరించే వారు లేరు, అవసరం అయితే సహాయం చేసేవారు లేరు. నవ్వినా కూడా ఆర్టిఫిషియల్ గా ఉందిరా నాకు…” అంటూ చెప్తూ ఉండగానే,

“అదేంటి నాన్నా, మీకోసం అక్కడ రవీంద్ర ఉన్నాడు కదా మీ బాగోగులు చూడటానికి?” అడిగాడు సుభాష్.

“ఉన్నాడు రా, కానీ తన పని కూడా ఉంది కదా తనకి. అప్పుడప్పుడు వచ్చి చుట్టంచూపుగా చూసి వెళ్తూ ఉంటాడు. అతన్ని తప్పు పట్టలేం, ఇక్కడ మీ పనులు అలా ఉంటాయి మరి. మీరు అన్నీ అమర్చి పెట్టారు మాకు, కానీ ఈ వయసులో మాకు అన్ని సదుపాయాల కంటే మాట్లాడే మనుషులు, ఆత్మీయత అదే రా కావాల్సింది.

అదే ఊర్లో అయితే మూర్తిగారు మూర్తి గారు అంటూ అందరూ వచ్చి చూసి పలకరించి వెళ్తూ ఉంటారు. ఇక్కడ అందరివీ పల్లెను మరిచిన బతుకులు. ఈ కాలుష్యం, ఈ వాతావరణంలో, ఏసీ రూముల్లో ఉండటం కంటే ఊర్లో పచ్చని చెట్లు, పొలాల మధ్య చల్లని ప్రకృతి గాలి పీలుస్తూ బ్రతికేయ్యాలని నా ఆశ రా కన్నా. మీ అమ్మకి కూడా ఆరోగ్యం కొంచం నలతగా ఉంటోంది. కారణం డి విటమిన్ లోపం అన్నారు డాక్టర్లు.

ఇక్కడ అయితే టాబ్లేట్లు వాడాలి, అదే అక్కడ ఊర్లో అయితే మంచి సూర్యరశ్మి ఉంటుంది. కావాల్సినంత ఎండ, గాలి. ఈ వయసులో మాకు అక్కడే ప్రశాంతత ఉంటుంది నాన్నా. మీరు ఎప్పుడైనా వచ్చినా అక్కడకి రావచ్చు. అక్కడ కూడా మీకు ఉండటానికి అన్ని సదుపాయాలు ఉండేలా ఇంటిని నేను బాగు చేయిస్తాను. కానీ నా కోరిక కాదనకు రా నాన్నా.” అంటూ బ్రతిమాలుతున్నట్టు చెప్పారు మూర్తిగారు.

ఆయన మాటలకు కాదనలేక పోయాడు సుభాష్. “సరే నాన్నా, మీ ఇష్టం నేనెందుకు కాదనాలి. ఊర్లోనే ఉండండి, అక్కడ కూడా మీకు తోడుగా ఉండేందుకు ఒక మనిషిని పెడతాను. కానీ మీ ఆరోగ్యం జాగ్రత్త. ఇంతకీ అక్కకి చెప్పారా ఈ విషయం?” అనడిగాడు.

“చెప్పానురా.  మీ ఇష్టం అంది అక్క కూడా. సరే రా కన్నా. మీరు జాగ్రత్త. రేపే ఊరికి వెళ్తున్నాం” అంటూ ఫోన్ పెట్టేసారు మూర్తి గారు.

“నిజమే నాన్నా, మావి పల్లెని మరిచిన బతుకులు. ఈ ఉద్యోగాలు, విదేశాల మోజులో పడి ఉన్న ఊరిని, కన్న వారిని దూరంగా ఉంచుతున్నాం. ఎన్ని ఉన్నా మాకు ఎక్కడో ఓమూల అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. అదే ఊరిని మిస్ అవుతున్నాం అనే భావన. మీరు అక్కడకి వెళ్తే కనీసం మీకోసం అన్నా మేము కూడా ఎప్పుడో ఓసారి అటు వస్తాం. పక్షులు కూడా వలస వెళ్లినా తిరిగి మళ్ళీ వాటి గూటికి చేరతాయి. అలాగే మీరు కూడా తిరిగి మన ఊరికి వెళ్తున్నారు. మీరు అక్కడ కూడా బాగుంటే చాలు!” అనుకుని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు సుభాష్.

రచయిత:: పరిమళ కళ్యాణ్

 

You May Also Like

2 thoughts on “గూటికి చేరిన గువ్వలు

  1. చాలా బాగుంది చెల్లి. అఖరికి కొడుకు పల్లె విలువ తెలుసుకున్నాడు 👏👏👏👍😊🌹🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!