పండుగొచ్చింది

పండుగొచ్చింది

          అదొక మారుమూల పల్లెటూరు. నాగరికతకూ, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయిన ఒక చిన్న గ్రామమది. పట్టుమని ముప్పై నుండి  నలభై గుమ్మాలు ఉంటాయేమో. వాటిల్లో  మూలగా విసిరేసినట్టుగా ఒక పాతతరం మండువా ఇల్లు ఒకటి. చూస్తే పైకప్పు కూడా సరిగ్గా లేదు ఆ ఇంటికి. చుట్టూ విశాలమైన పెద్ద వసారా. మామిడి, జామ, కొబ్బరి చెట్లతోనూ, రకరకాల పువ్వులు, కూరగాయల మొక్కలతో పచ్చగా కనబడుతూ ఉంది. అలాగే రాలిన ఎండుటాకులు,  చెత్త వగైరాలతో పేరుకుపోయి ఉంది. అందులో నివాసముంటున్న ఓ వయసు మళ్ళిన ముసలి జంట. ఒకరికి ఒకరు అండగా ఆసరాగా అంత పెద్ద ఇంటి ఇంటిమొత్తానికి వారిద్దరే బ్రతకలేక బ్రతుకీడుస్తున్నారు.

తిన్నారో లేదో, ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేరో కూడా ఎవరికీ పట్టదు. ఏదో మధ్య మధ్యలో ఇంటి చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు  వచ్చి పలకరించి పోతూ ఉంటారు.

ఆరోజు ఆ గ్రామంలో సందడి వాతావరణం. ఊరంతా  ఒకటే కోలాహలం. అందరి ఇళ్ళు చుట్టాలు, స్నేహితులు బంధువులతో కళకళలాడుతూ ఉన్నాయి. ఆ ఊరి   తిరునాళ్ళు జరుగుతున్నాయి. ఏడాదికి ఒక్కసారి గ్రామ దేవతలకు  చలవ చేసుకుని ఊరిని చల్లగా చూడమనీ కాపాడమంటూ ఊరంతా కలిసి చేసుకునే పండగ అది.

ఉద్యోగాలనో, వ్యాపారాలనో  ఇతరత్రా కారణాలతో ఊరికి దూరంగా ఉంటున్నవారు కూడా విధిగా వచ్చి హాజరవుతారు. సొంత ఊరిలో అయినవాళ్ళతో సరదాగా గడిపి, తమ మొక్కుబడులు గట్రా చెల్లించుకుంటూ ఉంటారు. ఆ ఊరికి అదే నిజమైన, ఇంకా పెద్ద పండుగ.

అందరూ తమ తమ ఇళ్లలో తమ తమవారితో ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు. ఎటు చూసినా మామిడి తోరణాలు. విచ్చుకున్న నవ్వుల పువ్వులు. పిల్లా పాపల అల్లరి ఆటలు, చిందులు, కేరింతలు. ఆ పండుగ వాతావరణం కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది.

కానీ ఆ మండువా ఇల్లు మాత్రం  వెలవెలబోతూ బోసిపోతూ ఉంది. ఎటువంటి సందడి లేదు. అలాగే ఆ ముసలి దంపతుల కళ్లల్లో కూడా ఆనందం ఉత్సాహం మచ్చుకైనా కనపడటం లేదు. పైగా ఆ తడిబారిన కళ్లల్లో అంతుచిక్కని ఎదురు చూపులు. ముసురుకున్న ఏదో నిరాశా నిర్వేదం.

రోజులు కాదు యేళ్లు గడుస్తున్నాయి. ప్రతి ఏటా అలాంటి పండుగలు వస్తున్నాయి పోతున్నాయి.కానీ అలుపెరగని ఆ ఎదురుచూపులకి మాత్రం అంతు చిక్కడం లేదు.

పేగు పంచీ, కనీ కష్టపడి పెంచారు. అలా ప్రేమానురాగలను పంచి పైకి తీసువచ్చిన కన్నబిడ్డలు బ్రతుకుతెరువు కోసమని పట్నాల దారి పట్టి నాగరికత ఉచ్చులకి చిక్కుకుని మమ్మల్ని మర్చిపొయరా..? అంటూ ఏదో తెలియని ఆవేదన. ఆ ముసలి వయసులో, వాళ్ళు పడే ఆ ఆవేదనకి ఎవరు సమాధానం చెప్తారు.ఆ ఎదురు చూపులకి అంతం ఎప్పుడు.

అలా కాలం గడుస్తున్న క్రమంలో, ఏ పేగుబంధం కదిలించిందో, లేక, ఆ ముసలివాళ్ల కన్నీరు ఏ దేవుడిని కరిగించిందో తెలియదు. ఉన్నట్టుండి ఆ ఇంటికి అనుకోని తీరుగా చెప్పలేనంత కళ వచ్చింది. ఎన్నాళ్ళ నుండో వేచిన

ఉదయం ఆ ఇంటికి కొత్త వెలుగులు తెచ్చింది.

కడుపున పుట్టిన పిల్లలు, మనుమలు మనువరాళ్లతో సహా అందరు కూడపలుక్కుని ఒకేసారి వచ్చి  అ ఇంటి వాకిట వాలిపొయారు. అమ్మా, నాన్న..అసలు మొన్న పండుగ నాటికే ఇక్కడికి రావలసింది.కానీ కొన్ని అనుకోని పరిస్థితుల రిత్యా ఆలస్యమైపోయింది.  సారీ అమ్మ ” మిమ్మల్ని ఇన్నాళ్లూ పట్టించుకోకుండా వదిలేసి మేము ఏమి కోల్పోయామో, మిమ్మల్ని ఎంతగా బాధ పెట్టామో అర్దం చేసుకున్నాం. నిజానికి మిమ్మల్ని మేము ఎప్పుడూ మరచిపోలేదు. మీ నుండి దూరంగా ఉండాలని, మిమ్మల్ని దూరంగా పెట్టాలని కూడా ఉద్దేశ్యపూర్వకంగా ఎప్పుడూ అనుకోలేదు. కానీ భవిష్యత్తు వేటలో మమ్మల్ని మేమే మరచిపోయేంతగా పరుగు  పెడుతూ, ఏ దారి పోతున్నామో, అసలు ఏమై పోతున్నామో కూడా చూసుకోలేంతగా మరచిపోయాం.ఆ యాంత్రిక జీవితం నుండి  బయటపడాలని, ఊరు రావాలని, మీతో ఉండాలని  ఎప్పటికప్పుడు అనుకోపడమే,సరిపోతుంది కానీ అనుకున్నది మాత్రం చేయలేక, ఎన్నిసార్లు బాధపడి ఓడిపోయామో మాకే తెలుసు. కానీ ఈసారి ఆలస్యమైనా పర్వాలేదు కానీ , ఓడిపోయి ఆగిపోకూడదని గట్టిగా అనుకున్నాం. దాని ఫలితమే ఈ రోజు ఇలా మీతో. మీ కోసమే వచ్చాం” అని వాళ్లు చెబుతూ ఉంటే, ఆ ముసలి దంపతుల కళ్ళవెంట గిర్రున నీళ్లు తిరిగాయి.

ఎక్కడ లేని ఆనందం వారి పరమైనది. వయసు కూడా  సగమైపొయింది. ఉత్సాహంగా ఉల్లాసంగా చిందులు వేస్తూ సంబరపడిపోయారు. తిరునాళ్ళు ముగిసి నాలుగు రోజులు అయిపొయింది. కానీ ఆ ఇంటికి మాత్రం ఆ రోజే నిజమైన పండగ వచ్చింది.

ఎంత ఎత్తుకు ఎదిగినా. కన్న వారిని, పుట్టి పెరిగిన సొంత ఊరిని, మర్చిపోకూడదు. బంధాలను బాంధవ్యాలను గౌరవిస్తూ మనం మనుగడ సాగించగలిగితే, ప్రతి ఊరిలోనూ ప్రతి ఇంటిలోనూ,  నిజంగా, ప్రతీ రోజూ పండుగే కదా.

రచయిత :: సత్య కామఋషి’రుద్ర’

You May Also Like

One thought on “పండుగొచ్చింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!