ఊహ…వాస్తవం

అంశం: అందమైన అబద్ధం

ఊహ…వాస్తవం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: చంద్రకళ. దీకొండ

ప్రేమించుకునే రోజుల్లో…
ఆకాశం నేలకు దించుతా…
నెలవంక తుంచుతా…
సిగలో ఉంచుతా…
చుక్కల్ని కోసి మెళ్ళో
హారంగా వేస్తా…
అంటూ ఎన్నో మనసు దోచే
అందమైన అబద్ధాలు…!
నువ్వే జాబిలి…
నీ నవ్వే వెన్నెల…
నీ నడకే నెమలి నాట్యం…
నీ చూపే ఇంద్రచాపం…
అంటూ ఎన్నో కవిత్వాలు…!
నువ్వే నా ప్రాణం…
నీ తోడిదే లోకం…
నాకేల ఈ ప్రపంచం…
అంటూ ఎన్నో ప్రేమలేఖలు…!
పెళ్లి జరిగాక…
ఆకాశం సంగతెందుగ్గానీ…
అటక మీది సామాను దించరు…
జాబిలి ముఖం కాస్తా…
జిడ్డుముఖం బిరుదు తగిలించుకుంటుంది…
నువ్వే నా లోకం అన్నది కాస్తా…
బైట నాకు బోలెడు పనులు…
నిన్నే పొద్దస్తమానం పట్టించుకోమంటే ఎలా…?!
ఇలా మారిపోతుంది మాటల తీరు…
పెరుగుతుంది విసుర్లు,
కసుర్ల జోరు…!
చేతిలో చెయ్యేసి చెప్పుకున్న
బాసలన్నీ అవుతాయి…
నీటి మీది రాతలు…!
అదే మరి…
ఊహకు,వాస్తవానికి…
బంధానికి,బాధ్యతకు
ఉన్న భేదం…!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!