నా వల్లనేమో

నా వల్లనేమో

రచన: రాయల అనీల

మనసంతా అదోలా అనిపిస్తుంది….
కాసేపు నా బంగారం పక్కన కూర్చుంటేనన్న కాస్త నా మనసు సంతోషంగా ఉంటుందని నా వెన్నెల గదిలోకి వెళ్ళాను…..
గదంతా చీకటి పరుచుకుని ఉంది అచ్చం ప్రస్తుత నా మనసు లానే …. వెంటనే వెళ్ళి వెలుతూరు గదిలోకి ప్రవేషించకకుండా అడ్డుకున్న పరదాలను కాస్త పక్కకు జరపగానే మెత్తని పరుపు మీద ఇటు పక్కగా పడుకుని నిద్ర పొతున్న నా బంగారానికి హఠాత్తుగా వచ్చిన వెలుగు వలన ఇబ్బంది కలిగిందేమో అటు పక్కగా తిరిగి పడుకుంది….

ఎంత ముద్దుగా పడుకుంది నా కూతురు నిద్ర లో కూడా ఎంత ముద్దోచ్చేస్తుందో…. అలానే ముచ్చటగా చూస్తున్న నాకు ఒక విషయం గుర్తొచ్చింది
మా అమ్మ చెబుతుండేది కడుపున పుట్టిన పిల్లలు నిద్ర పోతున్నప్పుడు తల్లి ఎక్కువ సేపు అలానే చూస్తుండకూడదు వాళ్ళకి దిష్టి తగులుతుంది అని…అది నిజమేనా ????
ఏమో!
అయినా తల్లి ప్రేమ కి దిష్టేంటి… తల్లి ఎప్పుడూ తన పిల్లల క్షేమమేగా తలచేది
కానీ అమ్మ చెప్పింది కాబట్టి నిజమేనేమో!ఎందుకంటే అమ్మ ఎప్పుడూ నిజమేగా చెబుతుంది
అని చూపు తిప్పుకునేలోపే కందిపోయిన నా బిడ్డ చెంప నన్ను వెక్కిరించి ఇదేనా నీ ప్రేమ అని ప్రశ్నించినట్లు అనిపించింది…..
ఎంతలా కందిపోయిందో పాపం… పచ్చని పసిమిచాయ రంగున్న పాల బుగ్గలు నా మూలంగానే ఎరుపు రంగులోకి మారిపోయాయి…. బాగా ఎడ్చిందేమో కన్నీటి చారలు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి

ఎంతటి మూర్ఖురాలినయ్యాను నా ప్రాణ సమానమైన నా బంగారాన్నే ఇలా చేతి గుర్తులు పడేలా చేసాను….

దీనంతటికి నేనే కారణం…నా అతి గారాబమే కారణం

నేను చిన్నప్పుడు పొందలేని నా తండ్రి  ప్రేమను ,దాని వలన కలిగే బాధ ని ఎరిగినదానినై ఆ మానసిక వేదన నా బిడ్డ అనుభవించకూడదనే నేను నా బంగారాన్ని చాలా ప్రేమగా కాస్త గారాబంగానే చూసుకున్నాను….

నాన్న గారు నా చిన్నప్పుడు ఎప్పుడూ నాతో గానీ నా తర్వాత పుట్టిన నా తమ్ముడితో గానీ ఏనాడూ ప్రేమగా ఉన్నది లేదు ..ఎప్పుడూ కోపంగా మేము ఎదో తప్పు చేసిన వాళ్ళలా ,తప్పు చేస్తామేమోననేలా ఎప్పుడు ఎదో ముభావంగా ఉండేవారు…. ఉద్యోగ రీత్యా ఎప్పుడూ క్యాంపులకి వెళ్ళే నాన్న గారు ఉన్న కాసేపైనా మాతో గానీ అమ్మ తో గానీ ప్రేమగా ఉన్నది లేదు …ఎప్పుడూ తెచ్చిపెట్టుకున్న గభీరంతో ఉండే నాన్నగారితో సరదాగా మాట్లాడాలన్న భయంగానే ఉండేది….

మా బాల్యం మొత్తం అమ్మ ప్రేమ,  జ్ఞాపకాలే తప్ప నాన్నగారివి ఏవీ లేవు… అమ్మ నాన్నల వ్యతిరేకత మనసుకి ఆ చిన్న వయసులో ఎంతటి వేదనని కలిగిస్తుందో నాకు మాత్రమే తెలుసు…అమ్మ ఎంతటి ప్రేమ ,అనురాగాలను పంచినా ఆ వెలితి మాత్రం అలానే ఉంటుంది…నాన్న గారి మనస్తత్వమే అదేనేమో కానీ మాకు ఆ చిన్న వయసులో అవేమి ఆలోచించేటంతటి పరిజ్ఞానం లేకపోయేది  …ఎన్నో సార్లు అమ్మని అడిగేవాళ్ళం కానీ పాపం అమ్మ మాత్రం ఏం చేస్తుంది….అందుకే ఆ బాధ నా బిడ్డ అనుభవించకూడదని ఒక్కగానొక్క కూతురని ఎంతో గారాబంగా చూసుకున్నాను….

కానీ ఈనాడు అదే గారాబం దాని భవిష్యత్తుకి ఆటంకం గా మారిపోయింది…. ఆయన చెబుతూనే ఉన్నారు అంత గారాబం చేయకు సుశీ మంచిది కాదు అని…నేనే వినిపించుకోలేదు

ఇది ఏం అడిగితే అది కాదనకుండా ,ఏమడిగినా ,ఏం కావాలన్నా లేదని చెప్పకుండా అన్ని తన కాళ్ళ ముందే అమర్చి పెట్టిన మా ప్రేమ ని అర్థం చేసుకుంటుందనుకున్నాను కానీ అలుసైపోయామనుకోలేదు ఎక్కడికి అడిగినా పంపుతుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్న ధైర్యం వచ్చేసిందేమో పదమూడేళ్లకే తల్లిదండ్రులకు చెప్పకుండా స్కూల్ కి వెళ్ళకుండా తన స్నేహితులతో సినిమాకి వెళ్ళెటంత పెద్దది అయిపోయింది…..

ఆఫీసు నుండి వచ్చేటప్పుడు ఆయన చూసి అది నాకు  చెప్పినప్పుడు ఎంత బాదేసిందో అంతటి స్వేచ్ఛ ని ఇచ్చిన నా దగ్గర కూడా నా కూతురు నాకీ విషయం చెప్పలేదు కనీసం నా అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనుకుందా అని ….ఇంటికొచ్చాక చాలా శాంతంగానే అడిగారు ఆయన కానీ ఇది రెక్లెస్ గా చెప్పిన సమాధానానికి పట్టరాని కోపం వచ్చింది అందుకే ఎప్పుడూ మాట వరసకైనా కసురుకోని నా వెన్నెల మీద వేళ్ళ అచ్చులు పడేలా కోట్టాల్సోచ్చింది……

నిజానికి ఈ దెబ్బ దీనికి కాదు నాకు తగలాల్సింది…నా పెంపకానికి పడ్డ చెంప దెబ్బ ఇది…..

నాన్న మా మీద చూపించని ప్రేమ ,ఆ బాధ  నేను నా బిడ్డ మీద చూపే అతి ప్రేమ కి దారి తీసింది…అప్పుడు అది తప్పైతే ఇప్పుడు నేను ఇలా మంచి చెడు, అవసరం ,వృథా లాంటి వాటికి మధ్య వ్యత్యాసం తెలపకుండా ఇలా పెంచడం కూడా తప్పే….

పిల్లల మీద తల్లి తండ్రుల ప్రవర్తన, ప్రేమ అతిగా ఉన్నా ,నిర్లక్ష్యం గా ఉన్నా ప్రమాదకరమే అది వాళ్ళ భవిష్యత్తు కి ఆటంకం గా మారిపోవడమే గాక మరేదైనా జరగొచ్చు……

నా బిడ్డ గురించి నాకు తెలుసు ఇన్నాళ్ళు నా పెంపకంలో పెరిగిన కూతుర్ని ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు…ఇది ఎటంటే అటు ఆకర్షణ కి గురయ్యే వయసు దాని నుంచి నా బిడ్డ ని కాపాడుకొవాల్సిన సమయం ఇదే కాపాడుకుంటాను….. పిల్లల ప్రవర్తన పెద్దల ఆలోచన, పెంపకం మీదే ఆధారపడి ఉంటుంది.

 

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!