మూడు కాళ్ళ ఆవు

మూడు కాళ్ళ ఆవు

రచన: కవిత దాస్యం

ఒక గ్రామంలో శీనయ్య అరుణ అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక అవిటి కుమారుడు చింటూ. వర్షాలు లేక కరువు సంభవించింది. చిన్నాచితక కూలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. చాలీచాలని డబ్బులతో ఎలా ఇల్లు నడిపేది అంటూ భార్య పోరు ఒకవైపు. ఏమి చేయాలో పాలుపోని సమయంలో అరుణ నేను ఒక సలహా ఇస్తాను వింటారా, అంటూ ఏమీ లేదు మనకున్న కొద్ది డబ్బుతో ఆవును కొనుక్కుని పాలు, నెయ్యి అమ్ముదాం. వెంటనే శీనయ్య ఓ అలాగే బావుంది ఉపాయం, అని ఆవును కొనడానికి వారి దగ్గర ఉన్న డబ్బుతో సంతకి బయలుదేరుతారు. ఒక వ్యాపారి దగ్గరికి వెళ్లి ఆవును బేరం చేస్తారు 20000 చెబితే 5000 అడుగుతారు. కొనే పరిస్థితి లేనప్పుడు ఇక్కడిదాకా ఎందుకు వచ్చారని హేళన చేస్తాడు వ్యాపారి. మరొక వ్యాపారి దగ్గరికి వెళ్లి ఆవును బేరం చేస్తే పాలిచ్చే ఆవు కొనాలంటే మీ దగ్గర ఉన్న డబ్బులకు రాదు అని మొఖాన చెప్పేస్తాడు. ఇదంతా గమనిస్తున్న ఒకతను ఇటు పక్కకు రండి అని పిలుస్తాడు నా దగ్గర ఒక అవిటిఆవు ఉంది 5 వేలకు ఇచ్చేస్తాను పాలు బాగా ఇస్తుంది అని చెప్తాడు. చేసేదిలేక సరే ఏం పర్లేదు ఆవును మేము కొనుక్కుంటాం. అని చెప్పి తమతో తీసుకొని వెళ్తుంటే, దారిలో ఒకతను తారసపడి అయ్యో ఈ మూడు కాళ్ళ ఆవును ఎందుకు కొనుక్కున్నారు. ఎన్నో రోజులుగా సంతలో పడి ఉంది. ఎవ్వరూ దీనిని ఖరీదు చేయలేదు, వెంటనే తిరిగి ఇచ్చేయండి దీనివల్ల మీకు నష్టమే గాని లాభం ఉండదు అని చెప్తాడు. దానికి శీనయ్య మాకు దేవుడు అవిటి కుమారుని ప్రసాదించాడు మేము చాలా ప్రేమగా పెంచుతున్నాం అలాగే మా తో పాటు ఈ ఆవు కూడా అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతారు. దానిని చాలా ప్రేమగా చూస్తూ, చింటూ కూడా దానికి గడ్డి పెట్టడం నీళ్లు పెట్టడం అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. ఒకరోజు చింటూ బకెట్ నిండా నీళ్లు తీసుకెళ్లి పెడతాడు. ఆ నీరు త్రాగిఆవు బకెట్ నిండా కనక వర్షం కురిపిస్తుంది. వెంటనే తల్లిదండ్రులను పిలుస్తాడు. వారు ముందుగా ఆశ్చర్యచకితులై తర్వాత ఎనలేని సంతోషంతో ఒకటికి నాలుగు ఆవులను కొనుక్కుని గొప్పగా బ్రతక సాగారు. ఇదంతా గమనించి ఆ ఊరి రాజు వెంటనే ఆ మూడు కాళ్ళ ఆవు నా దగ్గరికి తోడ్కొని రండి అంటు పంపిస్తాడు. ఆ ఆవును తెచ్చి ఇంట్లో కట్టేసి దానికి పంచభక్ష పరమాన్నాలు పెడుతూ రోజు ఆశగా ధన వర్షం కురిపిస్తుందని చూస్తూంటాడు. ఎన్ని రోజులైనా ఫలితం రాకపోవడంతో శీనయ్య దగ్గరికి ఆవును తీసుకొని వెళ్తాడు. నీ ఆవు నీ దగ్గర ఉండడమే సబబు. నీ ప్రేమ ఆప్యాయత ముందు నేను ఎంత చేసినా తక్కువే అని గ్రహించాను. ఇది నీకు చెందవలసినదే, ఎవరు పడ్డ శ్రమకు వారే ఫలితం అనుభవిస్తారు. ఎవరి అదృష్టాన్ని ఎవరు దోచుకెళ్లలేరు. అంటూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు. తమ కళ్ల ముందు కలిసొచ్చిన ధనలక్ష్మి ఆవును చూసుకొని మురిసిపోతారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!