చిత్తు చేసే మత్తు

(అంశం:”అగమ్యగోచరం”)  

చిత్తు చేసే మత్తు

రచన ::చంద్రకళ. దీకొండ

యువతను చిత్తు చేసే మత్తు…
విచిత్ర చిత్త భ్రమల్లో తేలియాడిస్తుంది…
సూదులు గుచ్చినా తెలియని హాయిని కలిగిస్తుంది…!
తీయని చాక్లెట్లలో,
ఆకర్షణీయ ప్యాకెట్లలో దాగి
ఊరిస్తుంది ఉచితంగా అందజేయబడి…
ఉద్యోగ సమస్యో,
కుటుంబ కలహాలో
మరిచిపోదామనే
సాకుతో అలవాటై…
చివరకు వదుల్చుకోలేని వ్యసనమై…
బయటపడలేని ఊబియై…
దొంగతనాలకు,నేరాలకు
పాల్పడేలా దిగజారుస్తుంది
నైతిక విలువల వలువలను…!
వంద రూపాయలకే పది
సిగరెట్లలో ఉన్న మత్తుతో
కిక్కెక్కించి…
లాగేస్తుంది నరాల సత్తువను…
వణుకులతో మెలికలు
తిరిగేలా చేస్తూ…
నాడీ వ్యవస్థను
చేస్తుంది కుదేలు…
సామాజిక క్షీణతకు
దారితీసే రుగ్మతై…
కొల్లగొడుతుంది ఆరోగ్య
ఆనందాలను…
చేస్తోంది యువత
భవితవ్యాన్ని అగమ్యగోచరంగా…!
తిరుగుబాట్లు,ఉగ్రవాదానికి
ఊతమిచ్చే కోట్ల లాభం…
“కీటమైన్” ఫ్యాక్టరీలుగా రూపుదిద్దుకొని…
రోగనిరోధక వ్యవస్థను అణచివేసి…
దేశానికి వెన్నెముకైన
యువత భవిష్యత్తును
చేస్తోంది నిర్వీర్యం…!
తల్లిదండ్రుల పర్యవేక్షణా
లేమి…
తనిఖీలు,నిఘాల వ్యవస్థ లోపాలతో…
హాస్టళ్లలో విద్యార్థులే
టార్గెట్లుగా…
ఇంజినీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా…
అనాథ పిల్లలే పెడ్లర్లుగా మారి…
విద్యాలయాల చేరువలోనే
లభ్యమవుతోన్న మాదక ద్రవ్యాలకు…
యువత అవుతోంది బానిస…!
చికిత్సా కేంద్రాలు…
అవగాహనా సదస్సులు…
మంచి అలవాట్లు,
కుటుంబ విలువలు…
ఆధ్యాత్మికత,ఆరోగ్య
ప్రాధాన్యత నివారణ మంత్రాలై
విలువైన యువత భవితకు
కావాలి పునాది…!!!

***

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!