ఎలా చేశావు

ఎలా చేశావు???!!!

రచన :: కమల ముక్కు (కమల’శ్రీ’)

నవమాసాలూ మోసి కన్నావే
నడిరోడ్డున ఎలా విడిచిపెట్టాలనిపించింది

పురిటినొప్పులు పంటి బిగువున
భరించి నన్నీ లోకానికి పరిచయం చేశావే
చెత్త కుండీలో ఎలా విడిచిపెట్టాలనిపించింది

ఓ నెల వేవిళ్లనీ ఓ నెల కళ్లు తిరగడం అనీ
నవమాసాలూ ఒక్కో రకంగా ఉన్నా
నవ్వుతూనే భరించావే
నీకెలా అనిపించింది నదిలో విడిచిపెట్టాలని

నీకే కష్టం వచ్చిందో నాకు తెలియదు
నిన్నేం బాధించిందో నాకు తెలియదు
ఎంత కష్టం వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా
నన్ను వదులు కునేంత కష్టాలు నీకేం ఉన్నాయి
ముద్దులొలికే నా ముఖాన్ని చూస్తుంటే
నీకెలా వదలుకోవాలనిపించింది

తనివి తీరా చనుబాలు తాగనేలేదు
నోరారా అమ్మా అని పిలవనే లేదు
అసలు కళ్లు తెరవనే పసికందును
ఒంటరిగా ఎలా వదలగలిగావమ్మా!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!