జ్జానోదయం

 జ్జానోదయం

రచన:: దొడ్డపనేని శ్రీ విద్య

రామాపురంలో కాశీ అనే యువకుడు ఉండేవాడు. అతడు మంచివాడే కానీ పరిస్థితుల ప్రభావంతో దొంగగా మారతాడు. మనిషి బలీయంగా ఉంటాడు. చురకరి. ఏది చూసినా ఇట్టే పట్టేస్తాడు. అదే అతనిని దొంగతనాల వైపుకి మళ్ళించి ఉంటుంది అనుకునే వారు అందరూ. ఎవరూ లేని వాడు ఏ0కాదు కాశీ. కానీ అందరికీ దూరంగా ఉంటూ ఉంటాడు. తండ్రి దక్షిణామూర్తి గారు . టీచర్ గా చేసి రిటైర్ అయి ఇంటి వద్దనే ఇప్పటికీ ట్యూషన్స్ చెప్పుకుంటూ ఉంటారు. కాశీ భార్య కూడా వారి వద్దనే ఉంటుంది.
ఇంట్లో వారు ఎంత చెప్పినా చెడు సహవాసాలు, దొంగతనాలు మానలేదు కాశీ. వారు చెప్పి చెప్పి విసిగిపోయారు. ఏదో ఒక రోజు బలమైన ఎదురు దెబ్బ తగిలితే కానీ వాడు మారడు తల్లీ అని కోడలిని ఓదారుస్తారు మామగారు.
ఇలా దొంగతనాలు చేస్తూ ఉన్న కాలంలో, ఒకరోజు పట్ట పగలే దొంగతనానికి వెళతాడు కాశీ. ఎవ్వరూ చూడలేదు కదా అని ధైర్యంగా ఉంటాడు. చాలానే ముట్టింది అని సంతోషపడతాడు కాశీ.
ఆ రోజు తనకి చాలా కలిసొచ్చింది అనీ, తనని తానే మెచ్చుకుంటాడు.
ఇలా సాగిపోతున్న తరుణంలో, ఒక రోజు పోలీసుస్టేషన్ నుంచి మనుషులు వచ్చి కాశీ ని పట్టుకుపోతారు. అయ్యా నేను యే దొంగతనం చెయ్యలేదు అని బుకాయిస్తాడు. పోలీసులు వదలరు. కేసు ఫైల్ చేస్తారు కోర్టు కి తీసుకు వెళతారు. బోనులో నుంచో పెడతారు కాశీని.
జడ్జిగారు అడుగుతున్నారు.
ఏమయ్యా బలంగా ఉన్నావు. ఆరోగ్యంగా ఉన్నావు. ఏదైనా పని చేసుకు బ్రతకవచ్చు కదా ! ఈ పనులు ఎందుకు చేస్తున్నావు?. ఒకరి సొమ్ముతో ఎంతకాలం జీవిస్తావు? పాపపు సొమ్ము అవుతుంది . సిగ్గనిపించటం లేదా? అని ఆడుగుతారు. కాశీ దగ్గర సమాధానం లేదు. సులువుగా వచ్చిన డబ్బు నిలవదు. కష్టపడి సంపాదంచు. అందులో ఆనందం ఉంటుంది. నీ వాళ్లు కూడా ఆనందిస్తారు. ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది నీకు అని ఎంతో అనునయంగా బుద్ది చెప్తారు జడ్జి పరాంకుశం గారు.
సీసీ కెమరాల్లో దొరుకుతావని భయం ఉంది కానీ, పై నుంచి దేవుడు చూస్తున్నాడు అన్న భయం లేదా? సీసీ కెమెరాల నుంచి తప్పించుకొని తిరగ వచ్చు. కానీ దైవశక్తి, మనల్ని నడిపే అదృశ్య శక్తి నుంచి తప్పించుకొలేము.
ఎక్కడో ఒకచోట తప్పు చేస్తావు. దొరికిపోతావు.
పాపభీతి లేకపోతే ఎలా కాశీ?. ఇవన్నీ నీకు ఎవ్వరూ చెప్పలేదా? శరీరం మట్టిలో కలిసినా ఆత్మ శాస్వతంగా ఉంటుంది. మంచి చేయక పోయినా పరవాలేదు కాశీ, పాపం చేయకూడదు. మనం చేసే పాపపుణ్యాలు ఆత్మను వదలువు . జన్మజన్మలకి ఆ పాపం వెంటాడుతుంది. బుద్ది తెచ్చుకో ఇకనైనా అని మందలిస్తారు. అక్కడ ఉన్న లాయర్లు, పోలీసులు ఆశ్చర్యపోతారు జడ్డి గారి మాటలకు.
కాశీ కి శిక్ష పడుతుంది. జైలుకి వెళతాడు. ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవిస్తాడు. జైలులో ఉన్నంత కాలం జడ్జి గారు చెప్పినమాటలు మనసులో మెదులుతూనే ఉంటాయి. పరివర్తన తో బయటకి వస్తాడు కాశీ.. సరాసరి ఇంటికి వెళతాడు. తన తల్లితండ్రులను క్షమించమని అడుగుదామని మనసులో అనుకుంటాడు.
కానీ ఇంటికి వెళ్లిన కాశీ, అక్కడ కనిపించిన మనిషిని చూసి నివ్వేరపోతాడు. కాళ్ళ కింద భూమి కదిలినట్లు అనిపిస్తుంది. తట్టుకొని గోడకు ఆనుకుని నిలబడతాడు.
ఇంతకీ కాశీ తన ఇంట్లో చూసిన వ్యక్తి జడ్జి పరాంకుశం గారు. తనకి శిక్ష వేసిన మనిషి. ఇక్కడ , ఇలా అని ఆశ్చర్యపోతాడు.
వివరం లోకి వెళితే, టీచర్ అయిన తన నాన్నకి, ఆ జడ్జి ఒకప్పటి స్టూడెంట్.
లీలగా తన తండ్రీ మాటలు వినపడుతున్నాయి. ఎంతోమందిని ఈ చేతులతో తీర్చిదిద్దాను బాబు. నా కర్మ కాశీని మార్చలేక పోయాను. నేను నా వృత్తిలోనే కాదు జీవితంలో కూడా ఓడి పోయాను. మీ చేత నమస్కారం చేయించుకునే అర్హత నాకు లేదు బాబు అంటూ బాధ పడతాడు. నా కర్మ , యే జన్మలో చేసిన పాపమో వీడు ఇలా తయారయ్యాడు అని కంట నీరు కారుతుండగా…. క్షమించండి నాన్న నన్ను. నేను మారాను. ఇకనుంచి దొంగతనాలు చేయను.బుద్దిగా ఉంటాను. అంతా ఈ జడ్జి గారు వల్లే. నా కళ్ళు తెరిపించారు. నేను మారాను నాన్న. నన్ను నమ్మండి. ఏదైనా పని చూసుకుంటాను. ఇంకా చెడ్డ పనులు చేయను అంటూ కన్నీటితో నాన్న కాళ్ళ మీద పడి వేడుకుంటాడు…..
సంతోషంతో తండ్రీ , గురువుకి గురుదక్షిణ ఈ రకంగా సమర్పించుకో గలిగినందుకు ఆనందంతో , తృప్తిగా జడ్జి గారు అక్కడ నుంచి బయటకు వస్తారు.

(కొసమెరుపు)

పాపభీతి లేని మనిషి, చేసిన తప్పుని తెలుసుకోలేని, జ్ఞానోదయం లేని వాడు, పశ్చితాపం లేని మనిషి పశువు తో సమానం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!