కుదమ సంక్రాంతి

కుదమ సంక్రాంతి

రచన: కుదమ తిరుమలరావు (టీచర్)

ఎంతటి స్థాయిలో ఉన్నా, సముద్రాలు దాటి ఎక్కడో స్థిరపడినా, పుట్టి పెరిగిన ఊరుకి వెళ్ళాలని, ఆచోట ఆనాటి బాల్యాన్ని చూసుకోవాలని, చిన్ననాటి స్నేహితులతో ముచ్చటించుకోవాలనీ ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందుకు అసలుసిసలైన సందర్భం సంక్రాంతి పండుగ. ఒకరికొకరు చెప్పుకొని మాత్రమే పూర్వ విద్యార్ధుల సమావేశాలు జరుగుతాయి. కానీ ఈ సొంతూరు వేదికే వేలుపు, సంక్రాంతి వేడుకే పిలుపు. మళ్ళీ సంక్రాంతి వరకూ సంవత్సరం పాటు హాయినిచ్చే తీపి స్మృతుల సమాహారంగా ఈ సంక్రాంతి నిలుస్తుందనుట అతిశయోక్తికాదు. మా సొంతూరు పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలం, కుదమ గ్రామం. కుదమ రావడానికి తోటపల్లి అనే ఊరు దాటాలి. అది తిరుమల తిరుపతి దేవస్థానం. భోగి రోజుకి ముందు రోజున ఇక్కడ ఆగీ, వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మేమంతా కుదమ చేరుకున్నాం.

ఆనాటి నుండి ఈనాటి వరకూ భోగీమంటను మా ఊరి చివర్లో ఒకే చోట అదే చోట వేయడం జరుగుతూ ఉంది. మేమందరం వేకువజామునుండే భోగి మంట వేడిమిని మనసారా ఆస్వాదిస్తూ ఎంతో సంతృప్తిని పొందాం. మా ఇలవేల్పు వేంకటేశ్వరస్వామి. దేవుడింటిలో సంక్రాంతి రోజున దేవుణ్ణి దించే పూజా కార్యక్రమాలు నిర్వహించాం. మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజున ఇలాగే దేవుణ్ణి దించే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ పూజలో అందరమూ వేంకటేశ్వర స్వామి పాటల్ని ఆలపించాం. నమో వెంకటేశా నమో తిరుమలేశా, ఏడుకొండల శ్రీనివాసా మూడు మూర్తుల తిరుమలేశా, ఏడుకొండల స్వామి ఎక్కడున్నావయ్యా ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా, అదివో అల్లదివో శ్రీహరివాసమూ పదివేలు శేషుల పడగలమయమూ, నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగివత్తునో, నూట ఎనిమిది గోవిందా నామాలను ఈ పాటలతో బృందంగా పాడుతూ పూజించాం. అనంతరం ఊర్లో విషయాలు, తాజా విశేషాలు, నాయకత్వం వహించిన నేతలెవరూ వంటి ఆసక్తికరమైన కబుర్లతో కాలక్షేపం చేసాం. పనిలో పనిగా ఆనాటి కుప్పిగంతులు, సిడతా బిళ్ళా ఆటలు, మేకనుచంప్తాన్ కాళ్ళిరగ్గొడతాన్ ఆట, కర్ర-రాయి ఆట, దాడాట, అష్టాచెమ్మా ఆట, రుమాలాట, ఇసుకలో లాంగ్ జంప్ ఆట, నాణేల ఎగరేతలు, పేకముక్కలతో మంగాపతి రాణీసరి ఆటలు, ఖోఖో ఆట, కబడీ ఆటలు ఇతరత్రా చర్చించాం. ఇంకా కొన్నికంటిన్యూ ఔతున్న వాటిని తెలుసుకుని సరదాపడ్డాం. మా అన్నయ్య విజయనగరం నుంచి, మా తమ్ముడు ఒడిశాతాల్చేరు నుంచి, మేము రాజాం నుంచి ముందుగానే కుదమ చేరుకున్నాం. ఏర్పాట్లు చేసాం. ఎప్పటిలాగే మా అన్నయ్య కుదమ పరమేశ్వరరావు ఆధ్వర్యంలోనే మొత్తం సంక్రాంతి పండుగ అంతా విజయవంతంగా నిర్వహించాం.మా అక్కలు గరుగుబిల్లి, పెందుర్తి, శ్రీకాకుళంల నుంచి, మా అన్నయ్యల అక్కల పిల్లలు కూర్మన్నపాలేం, నర్సీపట్నం, తాళ్ళపాలేం, చినముసిలివాడ, కాకినాడ, విశాఖపట్నం, మధురవాడ తదితర ఊళ్ళనుండి మా పుట్టినూరు కుదమ చేరుకున్నాం. వీళ్ళందరికీ ఫోన్లు చేసి రప్పించేందుకు మా ఒడిశా తాల్చేరు తమ్ముడు సత్యసాయిబాబా కీలకపాత్ర పోషిస్తాడు. మా అమ్మ అరంజ్యోతి కి తొంభై సంవత్సరాల వయసు. ఐనా మహా శక్తివంతమైన వ్యక్తి. ఎంతో ఓపికగా మా ఇళ్ళ ముంగిట ముగ్గులు వేసింది. మా ఇంటి ముందే గల రామమందిరంకి వెళ్లి గ్రామ ప్రజలతో సరదాగా మాట్లాడుకున్నాము పలు దఫాలు. రామమందిరంలో కూర్చోని మైక్ అందుకొని నేను పాటలు పాడాను. మా చిన్నాన్నల ఇళ్ళు కూడా ఇరుగూ పొరుగే కావడంతో వాళ్ళింట్లో  కూడా వాళ్ళ పిల్లలు రావడంతో అందరికీ సందడే సందడి. కుదమ గోపి అనే నా కజిన్ బ్రదర్ మా అందరితో అందమైన కుటుంబం అనే వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి, సంక్రాంతి పండుగ చక్కగా సఫలీకృతం అవ్వడానికి కారకుడు. భోగిరోజున ఇడ్లీలు, కుడుములు శనగపిండి చెట్నీతో ఉదయం టిఫిన్ ఆరగించాం. సంక్రాంతి రోజున కక్కరాలు, పొంగడాలు వంటి తీపి పదార్థాలు చేసుకుని తిన్నాం.

కనుమ రోజున ఉదయం మటన్ పకోడీతో టిఫిన్ లు ఆరగించాం.  కనుమ రోజున సాయంత్రం తోటలో పండుగకు వెళ్ళాం. ముక్కనుమ నాడు కూడా తోటలో పండుగకు వెళ్ళాం. అక్కడికి అందరిండ్ల చుట్టాలూ వచ్చారు. పలకరింపులు మాటామంతీ జరిపాం. బాల్యమిత్రులను కలుసుకున్నాం. కుటుంబ సభ్యులం అందరమూ సంక్రాంతి రోజున సాయంత్రం మా కుదమ గ్రామానికి దగ్గరలో ఉన్న  తోటపల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్ళి అక్కడ నిర్మించిన పార్వతీపురం ఐటిడిఎ పార్క్ లో ఎంజాయ్ చేసాం. బోటు షికారు కూడా చేసాం. తోటపల్లిలో ప్రకృతి వ్యవసాయం లక్ష్యంగా, ప్రకృతి ఆదిదేవోభవ సందేశంతో డా.డి.పారినాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జట్టు అనే జాతీయ స్థాయి సేవా సంస్థనూ సందర్శించాం. భోగి రోజున సాయంత్రం మా కుదమ గ్రామానికి దగ్గరలో ఉన్న అడ్డాపుశిల అనే పుణ్యక్షేత్రానికి వెళ్లాం.
అది కొండకు ఆనుకుని ఉన్న దేవాలయం. అక్కడ్నుంచి కాశీ వరకూ సొరంగం ఉందట. దానిని మూసేసారు లెండి.
మా కుదమ గ్రామానికి బయట గల  దేశితల్లి బంగారమ్మ గుడికి నడిచి వెళ్ళి దైవదర్శనం చేసుకున్నాం.

ఇలా పలు ప్రత్యేకతలతో సాగింది మా సంక్రాంతి. పిల్లల పెద్దల ఆటా పాటా మాటలతో, గ్రూప్ ఫోటోలతో సంబరాలు బాగా చేస్కున్నాము. మనసంతా కాస్తా చివుక్కుమంటూ తిరుగు ప్రయాణం ఐనాం.

ఇట్లు

కుదమ తిరుమలరావు (టీచర్)

రాజాం
విజయనగరం జిల్లా
9505665748

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!