నల్లనయ్య

నల్లనయ్య

రచన: సావిత్రి కోవూరు 

నల్లా నల్లాని వాడు, చిన్ని కన్నయ్యా వీడు
చల్లా చల్లాని చూపులతోను, మెల్లామెల్లగా వచ్చేటోడు,

గొల్లాలిండ్లల్ల  దూరి, అల్లారెంతో చేసేవాడు. అందరినీ అలరించేవాడు,

పాలుపెరుగూ లాను, వెన్న మీగడలాను ప్రీతితోడ ఆరగించేవాడు ,

పాల భాగము పైన, కస్తూరితిలకాము మెరియా,
కాళ్ళ గజ్జేలేమో గల్లుగల్లూన మ్రోగ, వేణుగానమెంతో వీనులవిందూలు చేయ,

నెమలి పింఛము తలపై పెట్టి, పట్టూ ధోవాతి కట్టి,
చెంగల్వ పూలదండ, చేతా మురళీని పట్టి,

నందానందానుండు వీడు, రేపల్లెన తిరిగేటోడు,

పూతన ప్రాణాలు పీల్చి, శకటాసురుని చంపినోడు
కంసుని కాలరాచి, శిశుపాలుని శిరమూ త్రుంచినోడు

కాళిందీ మడుగులోను, కాళీయునిపై నాట్యమాడి కొనగోట గోవుల గాచిన, గోవర్ధనగిరి ధారి వీడు

వెన్నెల్లాంటి నవ్వులతోనే, వెన్నదొంగైయ్యీనాడు

మాయలెన్నో చేసేవాడు, యశోదమ్మకు ముద్దుల తనయూడు వీడు, నందుని ఇంట పెరిగీనోడు

కుచేలుని బాల్యమిత్రూడు వీడు,  జన్మా ధన్యము చేసినోడు

వాసుదేవూడు వీడు,  కృష్ణ భగవానూడు వీడు

మనసిచ్చిన రుక్మిణిని పరిణయమాడీన వాడు, పట్టరాని మోదము తోడ, పట్టపురాణిని చేసినోడు,

జాంబవంతునీతొ పోరి, జాంబవతిని చేకొన్న వాడు

శమంతకమణిని తెచ్చినోడు, సత్యభామను చేపట్టినోడు

అష్టమి నాడు జన్మించినాడు, అందరి మన్ననలు పొందినాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!