నిర్లక్ష్యం

నిర్లక్ష్యం

రచన: సావిత్రి కోవూరు 

“ఏవండీ నేను ఒక మాట చెప్తాను మీరు ఏమి అనకూడదు” అన్నది ప్రభావతి.”చెప్పు. ఏంటి” అన్నాడు చక్రధరరావు.”ఈ మధ్యన నాకు చాల విసుగనిపిస్తుంది. ఒక లక్ష్యం అనేది లేకుండా, జీవితమంత నిస్సారంగా గడుప వలసిందేనా అనిపిస్తుంది” అన్నది.”అసలు సంగతి ఏమిటో డైరెక్ట్ గా చెప్పు. ఎక్కడికైనా వెళ్దామా. మీ తమ్ముడు ఇంటికి వెళ్దామా కొన్ని రోజులు. వాళ్ళ పిల్లలతో సరదాగా గడపొచ్చు. లేక మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామా” అన్నాడు చక్రధరరావు.”ఎవరింటికి వెళ్ళినా రెండు రోజులకి మళ్లీ ఇదే జీవితం కదా” అన్నది ప్రభావతి నీరసంగా. “సరే మరి ఏం చేద్దాం. ఏం చేస్తే నీవు హుషారుగా ఉంటావు. పోనీ మా తమ్ముని పాపనో, మీ చెల్లి పాపనో మన దగ్గర ఉంచుకుని చదివిద్దామా. నీవు వాళ్ళకి సేవలు చేయడం, బాధ్యత తీసుకోవడం చేయగలవా” అన్నాడు.”వాళ్ళు ఎవరైనా మనకు తాత్కాలికమే. మనకు పర్మినెంట్ గా మన ఇంట్లో ఉండే పాప కావాలి” అన్నది భర్త ముఖంలోకి చూస్తూ. “అది ఎలా కుదురుతుంది. అన్నీ టెస్ట్ లు చేయించుకున్నాము కదా. మనకి పిల్లలు పుట్టరని ఎప్పుడో చెప్పేశారు డాక్టర్లు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ ప్రస్తావన ఎందుకు” అన్నాడు. “మనకు పుట్టరని తెలుసు. అందుకే అనాధాశ్రమం నుండి ఒక పాపని తెచ్చుకుని పెంచుకుందాం” అన్నది ప్రభావతి.
“ఇన్నేళ్ళ తర్వాత పాపని తెచ్చుకుని ఆ పాపను పెంచడమంటే  ఎన్నో సేవలు చేయవలసి ఉంటుంది. నీకేమో అప్పుడే మోకాళ్ళ నొప్పులు అంటున్నావ్. ఒక పాప బాధ్యత తీసుకోవడం అంటే అంత ఈజీ కాదు. నువ్వు బాగా ఆలోచించుకుని చెప్పు” అన్నాడు చక్రధర్రావు. “నేను చేయగలుగుతానండి. కొంచెం కష్టమే అనుకోండి అయినా పర్వాలేదు” అన్నది.”కొంచెం కష్టం కాదు. పాప పోషణ అంటే, మంచి చదువు చెప్పించాలి, పెద్ద అయ్యేదాక స్నానం చేయించడం, భోజనం పెట్టడం, స్కూల్ కి తీసుకెళ్లడం, తినిపించడం, ఆడించడం, హోంవర్క్ చేయించడం ఎన్నో ఉంటాయి. పెద్దయిన తర్వాత పుట్టినరోజులు, పెళ్లిళ్లు, పేరంటాలు ఇలా ఎన్నో బాధ్యతలు ఉంటాయి. నీవు ఆలోచించుకుని అన్నిటికీ రెడీ అంటే అప్పుడు ప్రొసీడ్ అవుదాం” అన్నాడు చక్రధరరావు.
అలా తర్జనభర్జనలయింతర్వాత ఒక శుభముహూర్తాన ఇద్దరు అనాధ ఆశ్రమం వెళ్ళి, తమ నిర్ణయం తెలిపారు. అనాధ ఆశ్రమం వాళ్ళు ఎన్నో ప్రశ్నలు అడిగి, కొన్ని ఫామ్స్ నింపించి అన్నింటికీ సంతృప్తి చెందిన తర్వాత అక్కడి పిల్లలను చూపించి వారిలో ఎవరిని పెంపకానికి తీసుకుంటారో చెప్పమన్నారు. అక్కడున్న ఐదు సంవత్సరాల ముద్దుగా, బొమ్మలా, పెద్ద పెద్ద కళ్ళతో ఉన్న ‘శృతి’ అనే పాపని సెలెక్ట్ చేసుకుని ఎత్తుకున్నది ప్రభావతి. అక్కడున్న మేనేజర్ రుక్మిణితో ఆ పాప కావాలని చెప్పింది. ఆమె “ఈ పాపని ఇవ్వడము కుదరదండి. ఎందుకంటే ఈ పాపతో పాటు వాళ్ళ అక్క శ్రావ్య కూడా ఇక్కడే ఉంటుంది. వాళ్ళు ఇద్దరు ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేరు. వాళ్ళ తల్లిదండ్రులు ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. ఎవరో బంధువులు తెచ్చి ఇక్కడ వదలి వెళ్ళారు” అని చెప్పింది. “నాకు ఆ పాపనే బాగా నచ్చిందండి. ఎలాగైనా ప్రయత్నించండి” అని ప్రాధేయపడింది ప్రభావతి. “మీరు ఒక నెల తర్వాత రండి. అప్పటికి ఆ అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ వేర్వేరుగా ఉండేలా మెంటల్ గా మేము ప్రిపేర్ చేస్తాము. అప్పుడు చూద్దాము” అన్నది మేనేజర్. “సరె”నని చెప్పి ఇంటికి వచ్చేసారు చక్రధర్రావు దంపతులు.
కానీ ప్రభావతి మనసంతా ఆ పాపతోనే నిండి పోయింది. పాపని తెచ్చుకున్న తర్వాత ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఎలాంటి డ్రెస్సులు కొనాలి, పాప గది ఎట్లా డెకరేట్ చేయాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి అని ఎప్పుడు ఆ పాప గురించే మాట్లాడడం మొదలుపెట్టింది భర్తతో.ఇవన్నీ విని విని విసిగు పుట్టిన చక్రధరరావు “ప్రభా ఆ పాపని వాళ్ళు ఇస్తారో, ఇవ్వరో ఇంకా మనకు తెలియదు. నీవు ఇలా కలలు కనడం మానేసేయి” అన్నాడు. “లేదండి ఎలాగైనా రిక్వెస్ట్ చేసి ఆ పాపనే తెచ్చుకుందాం మనము. ఆ పాపని ఎత్తుకుంటే నాకు మన పాపే అన్నంత తృప్తిగా అనిపించింది” అన్నది ప్రభావతి.
ఇంక ఏం చెప్పినా వినే స్థితిలో లేదని మౌనంగా ఉండిపోయాడు చక్రధరరావు. సరిగ్గా నెలకు మళ్ళీ అనాధ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడి వాళ్ళు వీళ్ళని పిల్లల దగ్గరకు తీసుకెళ్లారు ‘వాళ్ళిద్దరినీ వేరు వేరుగా ఉంచడానికి చాలా వరకు ప్రయత్నించాము. కానీ వాళ్ళు ఒకరినొదలి ఒకరు సంతోషంగా ఉండగలరని మాకు నమ్మకము కుదరటం లేదు. మీరేమో అంత పట్టుదలగా ఉన్నారు. కనుక మేము ఒప్పుకుంటున్నాము. పాప ఏమాత్రం వాళ్ళ అక్కనొదిలి ఉండలేక బెంగ పెట్టుకున్న వెంటనే మీరు ఇచ్చేయాల్సి ఉంటుంది. పాపని చాలా సంతోషంగా ఉంచాలి. కొంచెం పెద్దగ అయింది కనుక అడ్జస్ట్ కావడం కొంచెం కష్టమే. నిజానికి ఆ పాపంటే నాకు కూడ చాల ఇష్టం నేను కూడ మధ్యమధ్యలో వస్తా చూడడానికి మీరు ఒప్పుకోవాలి.” అని పాపనిచ్చి అనాథాశ్రమం అధికారులు కూడా ఇంటికి వచ్చి వీళ్ళ పరిస్థితులను చూసి, “మేము మధ్య మధ్యన వచ్చి పాప యోగక్షేమాలు తెలుసుకుంటాము అన్నింటికీ మీరు ఒప్పుకోవాలి” అని చెప్పారు.
వచ్చిన తర్వాత మూడు రోజుల వరకు కొత్త కొత్త బొమ్మలతో ఆడుకుంటూ సంతోషంగానే గడిపింది శృతి. నాలుగవ రోజు నుండి మెల్లగా “అక్క కావాలి అక్క దగ్గరికి వెళ్దాము” అని పేచి పెట్టడం మొదలు పెట్టింది. ఐదవ రోజు ఉదయం లేవగానే అక్క కావాలి, అక్క దగ్గరకు వెళ్దాము ఏడుస్తూ పడిపోయింది. ఒళ్లంతా నీలంగా మారిపోయింది. భయపడిపోయిన దంపతులు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు అన్ని టెస్టులు చేయించారు. వచ్చిన నాలుగు రోజులకే భార్య భర్తలు ఇద్దరు ఆ పాప పై ఎన్నో ఆశలు పెంచుకున్నారు. పాపకి ఏమన్నా అయితే అని ఊహించుకోవడం కూడా ఇష్టపడటం లేదు. వాళ్ళు ఇద్దరూ బాగా ఆలోచించి మరుసటి రోజు మళ్ళీ అనాధ ఆశ్రమానికి వెళ్లి,  “శ్రుతి వాళ్ళ అక్క లేకుండా ఉండలేక పోతుంది. కనుక శ్రుతి వాళ్ళ అక్క శ్రావ్యను కూడా పెంచుకుంటాము మీరు అనుమతిస్తే” అన్నారు. చెల్లిని తీసుకుపోయిన అప్పటినుండి, అక్క కూడా ఇక్కడ చెల్లి కొరకు పేచి పెడుతుందని దానికి పరిష్కారంగా శ్రావ్యను కూడా చక్రధరరావు దంపతులకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు మేనేజ్మెంటు వాళ్ళు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి శ్రావ్యని కూడా పంపించారు. ఎప్పుడు పిల్లలకు అక్కడ ఉండడం కష్టమనిపిస్తే అప్పుడు తిరిగి పంపించే పూచీతో అధికారులు పంపించారు. ఇద్దరు పిల్లలు ఇంట్లో తిరుగుతుంటే కన్నుల పండుగగా ఉంది దంపతులకు. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత మేనేజర్ రుక్మిణీ శ్రావ్య, శ్రుతి ఎలా వున్నారో చూసివేలదామని చక్రధర్ రావు  ఇంటికి వచ్చింది. ఆమె వచ్చేసరికి శ్రావ్య, ప్రభావతి గారి పిన్నిగారు ఉన్నారు ఇంట్లో. శ్రావ్య రుక్మిణితో తనకు ఇక్కడ ఉండడం అసలు ఇష్టం లేదని తీసుకెళ్ళమని అడిగింది. “మీఅమ్మ, నాన్న, మీ చెల్లి ఎక్కడికి వెళ్లారు. నీకు వాళ్లతో ఉండడం ఎందుకు ఇష్టం లేదు” అని అడిగింది రుక్మిణి.

“ఆంటీ మమ్మల్ని తెచ్చిన అమ్మ, నాన్నకు చెల్లి అంటేనే ఇష్టం. నేనంటే అస్సలు ఇష్టం లేదు. మా చెల్లికి అన్ని పనులు మా అమ్మనే చాలా ప్రేమగా చేస్తుంది. నాకేమో నాన్న ‘నువ్వు పెద్ద దానివి కదా అన్ని పనులు నేర్చుకొని నీవే చేసుకోవాలి” అని అంటారు. చెల్లి స్కూలుకి వెళ్లనని అంటే ఏమనరు. నన్ను మాత్రం బలవంతంగా స్కూల్కి పంపిస్తారు. చెల్లిని బయటకు తీసుకెళతారు. నన్ను మాత్రం అసలు తీసుకెళ్ళరు. చెల్లితో ఆడుకుంటూ ఉంటే అది అలసిపోతుందని ఆడనివ్వరు. అది నా బొమ్మ ఏది అడిగినా ఇచ్చేయ్య మంటారు. చెల్లి అసలు ఏడవకూడదు అంటారు. దానిని ఎక్కువ నడువనియ్యరు. ఎప్పుడు దాని దగ్గరే కూర్చుంటారు. నన్ను మాత్రం అంత ప్రేమగా చూడరు. చెల్లికి బలానికి మందులు, పండ్లు రెగ్యులర్ గా తీసుకోమంటారు. ఇప్పుడు కూడా నాలుగు రోజుల నుండి ఇంట్లో ఈ బామ్మ దగ్గర నన్ను వదిలిపెట్టి చెల్లిని తీసుకుని ఎక్కడికో వెళ్లారు. అందుకే నాకు ఇక్కడ నచ్చటం లేదు. నేను అక్కడికి వచ్చేస్తాను” అన్నది శ్రావ్య ఏడుస్తూ. అప్పుడే  కారు దిగి లోపలికి వస్తున్న చక్రధరరావు దంపతులను చూసిన రుక్మిణి వాళ్ళతో శ్రావ్య ఫిర్యాదు గురించి చెప్పారు. “మీరు ఇద్దరు పాపలకు సమానంగా ప్రేమను పంచాలి. ఒక పాపను అపురూపంగా చూస్తూ ఇంకొక పాపను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ చిన్న మనసు తల్లడిల్లి పోతుంది” అన్నది.
దానికి చక్రధరరావు “చిన్న పాప ఎక్కువ పెద్ద పాప తక్కువ కాదు మాకు. చిన్న పాప ఆరోగ్యం బాగాలేదు లేదని హాస్పిటల్ కు తీసుకెళ్తే టెస్టులు చేసి హార్ట్ లో హోల్ ఉందని, ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, చాలా వీక్ గా ఉంది కనుక పాపను చాలా జాగ్రత్తగా చూసుకుని, ముఖ్యంగా ఏడవకుండా, బలం పెంచేందుకు మందులు, పండ్లు ఇచ్చి ఆమె శరీరం ఆపరేషన్ కు తట్టుకునే శక్తి వచ్చిన తర్వాత తీసుకొని రమ్మని చెప్పారు. అందుకే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మధ్యమధ్యన హాస్పిటల్ కి  తీసుకెళ్లి చూపించాము. నాలుగు రోజుల కింద మా బంధువును రిక్వెస్ట్ చేసి నాలుగు రోజులు మా ఇంట్లో పెద్ద పాప దగ్గర ఉంచి ఈ పాపకు ఆపరేషన్ చేయించడానికి హాస్పిటల్ కి వెళ్ళాము. ఇప్పుడే డిశ్చార్జ్ చేశారు. ఈ పాపకి ఎలా ఉంటుందో అన్న బెంగతో పెద్ద పాపని కొంచెం నిర్లక్ష్యం చేసిన మాట నిజమే. కానీ ఆ పాప అంటే ఇష్టం లేక కాదు మాకు ఇద్దరు పాపలు రెండు కళ్ళు. ఇకముందు ఇలాంటి కంప్లైంట్ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాము” అన్నారు చక్రధరరావు దంపతులు. వాళ్లు చెప్పిన కారణాలకు తృప్తి చెందిన అనాధాశ్రమం మేనేజర్ రుక్మిణి వెనుతిరిగింది. ఇదంతా వింటున్న శ్రావ్య తన చెల్లికి ఒంట్లో బాగాలేదు అన్న నిజం తెలిసి చక్రధరరావు దంపతుల దగ్గరికి వచ్చి, “సారీ అంకుల్ ఆంటీ మీరు ఎందుకలా ఉంటున్నారో నాకు తెలియలేదు. ఇప్పటినుండి మీరు ఎలా చెప్తే అలా చేస్తాను చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటాను అన్నది మనస్ఫూర్తిగా.
తమ నిర్లక్ష్యానికి ఆ చిన్న పాప మనసు ఎంతో ఒత్తిడికి గురైందని తెలుసుకున్న చక్రధరరావు దంపతులు శ్రావ్యను దగ్గరకు తీసుకుని మళ్లీ ఎప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటామమ్మ అని హత్తుకున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!