భక్తిలో గొప్ప
రచన: గాజులనరసింహ
అనగనగా ..ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతను బలహీనుడు శాఖాహారి. ప్రతి రోజు ఉదయం శివపూజ చేయడం ఇతనికి అలవాటు. రోజు ఊరిబయట ఉన్న శివాలయంకు వెళ్లి పక్కనే ఉన్న నదిలో స్నానం చేసి, మడితో బిందెలో నీళ్లు తీసుకొని అక్కడ ఉన్న శివునికి అభిషేకం చేసి పూలు పండ్లు, నైవేదాలు పెట్టి కుంకుమ చందనం, విభూది లేపనాలు చేసి దండాలు పెట్టుకోని పోతువుంటాడు. ఇలా ఇతను పూజ చేసి పోగానే గొర్రె ల కాపరి ఒకడు ఆ గుడిలోకి వస్తాడు. అక్కడున్న కొబ్బరి చిప్పలు తిని కాళ్ళు చేతులు కడుక్కోకుండానే చేతులతో నోటితో నీళ్లుతెచ్చి శివుని తలపై చల్లి అతను సద్ధి తెచ్చుకొన్న దానిలో కొంత పెట్టి పోయేవాడు. ఇలా ప్రతి రోజు బాపణయ్య పూజ చేసి వెళ్ళగానే గొర్రె ల కాపరి వచ్చి పూజ చేసుకొనేవాడు. ఇదంతా గమనిస్తున్న పైన ఉన్న శివుడు సంతోష పడుతుంటాడు. ” పార్వతి ..అంటుంది స్వామి …”అనగా శివుడు “హుం ..” అని మూలుగుతాడు. నాకు ఒక సందేహం స్వామి? .
శివుడు:- చెప్పు దేవి
పార్వతి:- ఆ బ్రాహ్మణుడు నిష్ఠగా.. శ్రద్ధగా.. మడి కట్టుకోని మీకు ఆరాధన చేస్తుంటే ..ఈ మూర్ఖుడు వచ్చి అపూజ అలంకారంను చెరిపి తన ఎంగిలి నోటా నీళ్లు తెచ్చి నీపై ఉమ్మేసిపోతువుంటే ,అతనిపై ఏమి కోపం రావట్లేదా..స్వామి..అని అడుగుతుంది .
అపుడు
శివుడు :- ఎవరు ఎలా చేసినా నా పై భక్తితోనే కదా పార్వతి, అయినా వారిలో ఎవరి భక్తి గొప్పది పార్వతి? అని శివుడు అడగగా..
పార్వతి :- ఎవరిది ఏమిటి స్వామి ఆ బ్రాహ్మణునిదే భక్తి గొప్పది కదా.. వాన ఎండ చలి అనక చల్లని నీటిలో మునిగి నిత్యం సేవలు చేస్తూ ఉన్నాడు కావున అతని భక్తే గొప్పది అని అనగా..
శివుడు :- అయితే …పార్వతి వారి ఇద్దరికీ ఒక పరీక్ష పెడతాను ఎవరి భక్తి గొప్పదో తెలుస్తుంది అని అనగా.
పార్వతి :- సరే అంటుంది.
ఇంక తెల్లవారుజామున యదామామూలుగా బాపణయ్య వేకన శివపూజకు రావాలి కదా! ఆ సమయంలో ఉన్నట్టుండి పెద్ద గాలి వాన ఉరుములు మెరుపులతో అంత అల్లకల్లోలంగా ప్రకృతి ప్రకోపిస్తుంది. వానదేవుడు మోదుకుంటూ. జడివానగా వస్తూ ఉంటాడు. ఎక్కడ చూసినా వాగులు వంకలు పొంగి పోరాలుతూ వస్తున్నాయి పెద్ద పెద్ద చెట్లు విరిగి పడుతున్నాయి. ఆ సమయంలో బాపణయ్య శివ శివా అంటూ తడుస్తూ గుడి దగ్గరకు వచ్చి యదతీరుగా నదిలో మునిగి గుడిలోకి వెళ్తాడు. వెళ్లి వెళ్ళగానే పిడుగులతో శబ్దాలు పటపటమని మెరుపులు మెరుస్తున్నాయి. ఆ శాబ్ధాలకు గుడి కదిలి పోతుంది. మీద పడుతుందేమో అన్నటుగా అవుతుంది. ఆ పరిస్థితి బాపణయ్యకు ప్రాణం మీద తీపి భయపడుతున్నాడు, చలికి వణుకుతున్నాడు అయిన మంత్రాలు చదువుతూ బిరబిరా.. పూజ కార్యక్రమాన్ని ముగించుకొని అరచేతిలో ప్రాణం పెట్టుకోని వెళ్తాడు. తర్వాత గొరె ల కాపరి వస్తాడు రోజు శివునికి మొక్కే అలవాటు కదా ..ఈ రోజు కూడా ఆ వానలో వస్తాడు. నోట్లో యేటి నీళ్లుపట్టీ గుడి లోపలికి వస్తాడు అపుడు కూడా అదే రీతిలో గుడి పడేటట్లు ఉగిసలాడు తుంటది. అయిన ఇతను తన పూజను దైర్యంగా ..చేస్తూ ..శివునిపై వాలిపోతాడు తనకు ఏమైనా సరే ప్రాణం పోయిన సరే , అనుకుంటూ కట్టు కదలకుండా..అక్కడే శివుని పై వాలిపోతాడు. ఇదంతా గమనిస్తున్నారు పైనా శివపార్వతులు అపుడు
శివుడు :- చూశావా.. పార్వతి ఆ బ్రాహ్మణుడు ప్రాణంపై ప్రీతితో భయపడి నన్ను వదిలేసి పోయాడు ఈ కాపరి తన ప్రాణాలనే అడ్డు పెట్టాడు. ఇపుడు చెప్పు పార్వతి ఎవరి భక్తి గొప్పదో…అని అనగా ..
పార్వతి:- కాపరిదే గొప్ప స్వామి.
శివుడు:- చూడు పార్వతి ఎవరు ఎలా చేస్తున్నారు అన్నది కాదు ఎంత మక్కువ, ఎంత పట్టుదలతో చేస్తున్నారన్నది ముఖ్యం, అని పార్వతికి హితం చెబుతాడు.