ఆనందాల హరివిల్లు

అంశం:: (“ఎవరికి వారే యమునా తీరే..” )

ఆనందాల హరివిల్లు 

రచన: సావిత్రి కోవూరు 

“అమ్మ అక్క వాళ్ళు రేపే కదా వస్తున్నారు” అన్నది శ్రీయ తల్లి సుజాతమ్మతో.

“అవునమ్మా ఎందుకు అన్నది” సుజాతమ్మ.

“ఏం లేదు ఈసారి అక్క నెల రోజులు మన ఇంట్లో ఉంటది కదా! ఒక వారం రోజులు అయినా లీవ్ పెట్టి హాయిగా అక్కతో ముచ్చట్లు పెడుతూ గడుపొచ్చని” అన్నది.

పక్కనే ఉన్న శ్రేయస్ “నీవు సంవత్సరం నుండి లీవన్నట్టె కద ఇంక ప్రత్యేకంగా లీవ్ పెట్టడం ఎందుకు?” అన్నాడు ఎగతాళిగా.

“అరేయ్ నీవు నోరు మూయి మొదట. నేను రోజు పది గంటల నుండి రాత్రి ఎనమిది వరకు డ్యూటీ చేస్తున్నాను. మీటింగ్స్ అటెండ్ అవుతున్నాను. ఒక్క క్షణం తీరిక ఉండట్లేదు, నీకు నేను లీవ్ లో ఉన్నట్లు కనిపిస్తుందా? అసలు ఈ కరోన వచ్చినప్పటి నుండి ఎక్కడికి వెళ్ళక, ఎవరితో మాట్లాడక, ఎవరిని కలవక, పిచ్చెక్కి నట్టు ఉంది” అన్నది శ్రీయ.

“అయితే నేను కూడా క్లాసెస్ అటెండ్ కాను”  అన్నాడు శ్రేయస్.

“నీకు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తూ ఉంటావు. ఇంటర్ అంటే టర్నింగ్ పాయింట్. ఇప్పుడు మార్కులు మంచిగ రాకపోతే మంచి కాలేజీలో సీటు దొరకదు. ఫ్యూచర్ అంతా ఇంటర్ పైనే ఆధారపడి ఉంటుంది.”  అన్నది శ్రీయ.

“నేను టెన్త్ లో ఉన్నప్పుడు కూడా ఇవే డైలాగ్స్ చెప్పావ్. ఇంటర్ కొచ్చినాక కూడా అవే రిపీట్ చేస్తున్నావ్” ఆన్నాడు రోషంగా.

అప్పుడే లోపలికి వచ్చిన జగన్నాథం గారు “ఏంటి మళ్లీ మీరు గొడవ పడుతున్నారా. మీకెంత వయసు వచ్చినా, ఈ పోట్లాటలు మాత్రం మానరు కదా” అన్నారు.

“అది కాదు నాన్న అక్కా, బావ వస్తారని నేను ఆఫీస్ కి లీవ్ పెడతానంటే, వీడు కూడా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ కాడట  చూడండి.” అన్నది శ్రీయ.

“అరే అది చదువు అంతా అయిపోయి ఉద్యోగం చేస్తోంది. నీవు ఇంటర్ ఎంత ముఖ్యమైనదో తెలిసి కూడా క్లాసులు అటెండ్ కాను, అంటే ఏమనాలిరా నిన్ను.” అన్నారు.

“అది కాదు నాన్న, అక్కతో రోజుకు ఒక్కసారైనా పోట్లాడకపోతే నాకు తోచదు” అన్నాడు నవ్వుతూ శ్రేయస్.

వాళ్ళ మాటలకు తల్లిదండ్రులు వారిద్దరిని మురిపెంగా చూసుకున్నారు.

ఉదయం 9 గంటలకు అత్తవారింటి నుండి మొదటిసారి ఆషాడ మాసమని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది శ్రావ్య.

వెంటనే కారు దగ్గరికెళ్ళి సూట్ కేస్ తెచ్చిన శ్రేయస్ “అక్కా, బావ గారు రాలేదా?” అన్నాడు.

“లేదురా ఆయనకి ఏదో పని ఉందట రాలేదు.” అన్నది.

“అదేంటమ్మా, అల్లుడు గారు రాలేదు. మొదటిసారి నినొక్కదాన్నే పంపించారు. ఈరోజు ఎలాగూ ఆదివారమేగా ఏం పనులు ఉన్నాయి” అన్నారు జగన్నాధం గారు.

“ఏమో నాన్నా చాలా పనులు ఉన్నాయి అన్నారు” అన్నది శ్రావ్య.

“సరేలే నీవైన వచ్చావు. వెళ్లి స్నానం చేసి రా, టిఫిన్ చేద్దాం.” అన్నారు.

ఎన్నో రోజుల తర్వాత అందరూ కూర్చుని సరదాగా మాట్లాడుతూ టిఫిన్ చేస్తుంటే, చాలా సంతోషంగా ఉంది శ్రావ్యకు. భోజనం చేస్తుంటే తల్లి కొసరి కొసరి వడ్డించడము, తండ్రి తనకు ఇష్టమని మీగడ పెరుగు మళ్ళీ మళ్ళీ వడ్డించడము, చెల్లి, తమ్ముడు మాటిమాటికి సరదాగా వాదులాడుకోవడం ఈ మధుర ఘట్టాలన్నీ మిస్ అవుతున్నాను అని ఆలోచించసాగింది.

భోంచేసాక హాల్ లోకి వచ్చి నేలపై కూర్చుని వాలు కుర్చీలో కూర్చున్న తండ్రి మోకాళ్ళపై తల వాల్చిన శ్రావ్య తలపై చేయి పెట్టి ప్రేమగా నిమురుతూ  “ఏమ్మా అక్కడంతా బాగానే ఉంది కదా! నీకు ఏమి ఇబ్బంది లేదు కదా” అన్నారు జగన్నాథం గారు.

పక్కనే కూర్చున్న తల్లి, తమ్ముడు, చెల్లెలు నేనేం చెప్తుందా అని చూస్తున్నారు.

“మీరేం భయపడకండి నాన్న. అక్కడ అంతా బానే ఉంది. కానీ  ఏదో వెలితి నాన్న” అన్నది.

సుజాతమ్మ “అంటే వాళ్ళు నీతో సరిగ్గా ఉండరా?” అన్నది.

“లేదమ్మా వాళ్ళింట్లో పద్ధతులు సరిగ్గా లేవు.” అన్నది.

“అంటే” అన్నది సుజాతమ్మ.

“వాళ్ళ ఇల్లు చాలా పెద్దది. వాళ్లకు అందరికీ పెద్ద పెద్ద గదులు విడివిడిగా ఉన్నాయి. అందరి గదులలో టీవీ లు ఉంటాయి. అందుకని వాళ్ళు ఎప్పుడు లేస్తున్నారు, ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు తింటారు, ఎవరికీ తెలియదు. వాళ్లు ఒక్క ఇంట్లో వున్నా విడి విడిగా ఉన్నట్టు అనిపిస్తది. వాళ్ళు గదులు దాటి బయటకు రావడమే చాలా తక్కువ. ఇంట్లో వంటకి, ఇంటి పనులకు, తోట పనికి, చిన్నచిన్న పనులు చేయడానికి నలుగురు పని వాళ్ళు ఉంటారు. కనుక ఎవరికి ఏ పని ఉండదు. ఎవరికి ఏమి వండాలో వంటమనిషికి ఫోన్ చేసి చెప్పుకుంటారు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మనలాగా సరదాగా మాట్లాడుకుంటు తినరు. అందరు వాళ్ళ వాళ్ళ రూములోనే తినేస్తారు. ఎవరికైనా ఇంట్లో ఫుడ్ ఇష్టం లేకపోతే ఆర్డర్ చేసి తెప్పించుకొని తింటారు. అసలు వాళ్లు అందరూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకోవడం చూడలేదు. మా ఆయన కూడా ఎప్పుడు టీవీ చూస్తునో, లాప్టాపో లేకపోతే సెల్లులో ఎవరితో మాట్లాడుతూనో గడిపేస్తారు. ‘ఎవరికి వారె యమునా తీరె’ లాగుంటారు. నేనేమైనా మాట్లాడిన పొడిపొడిగా జవాబిస్తారు. అదొక ఇల్లులా కాకుండ ఒక హాస్టల్ లా ఉంటది. కరోనా పుణ్యమా అని బయటకి ఎలాగూ వెళ్ళము. ఇంట్లో నన్న అందరం కలిసి మెలిసి ఉండాలని ఉంటుంది నాకు. వాళ్ళ ఇంటి పద్ధతి ఏంటో నాకు అర్థం కాదు. అందరుహోమ్ క్వారెన్టైన్ లో ఉన్నట్టు ఉంటారు. అసలు లైఫ్ అంతా డల్ గా అనిపిస్తుంది నాన్న” అన్నది శ్రావ్య.

“వాళ్ళు ఎలా ఉంటే నీకేంటే నిన్ను ఎవరు ఏం అనరు కదా.”అన్నది తల్లి.

“నన్నేమి అనరు. కాని భార్య భర్తలు ,అన్నా చెల్లెలు సరదాగా మాట్లాడుకోరు.  ఒక్కొక్కసారి వారాల కొలది ఒకరి ముఖం ఒకరు చూసుకోరు. ఏమైనా మాట్లాడాల్సి వచ్చిన ఫోన్ లోనే మాట్లాడుకుంటారు.”  అన్నది శ్రావ్య.

“అవునా ఇదేదో వింతగా ఉంది. దానికి ఏదైనా గట్టి కారణమే ఉండి ఉంటది. మీ మామగారికి దూరపు బంధువు ఒకాయన నాకు బాగా తెలుసు. అతనిని అడుగుదాం. వాళ్ళు అలా ఉండటానికి కారణమేంటో” అన్నారు జగన్నాథం గారు.

“నాన్న అది వదిలేయండి. ఇంకేంటి విశేషాలు” అన్నది శ్రావ్య ఆ టాపిక్ ఇష్టం లేనట్టు.

సుజాతమ్మ  “ఏమి విశేషాలు ఉన్నవి తల్లీ. అసలు ఈ కరోనా వల్ల ఎవరు ఎవరి ఇళ్లల్లోకి వెళ్ళటం లేదు. మనకు బంధువులు ఎక్కువ కదా, మూడు నాలుగు నెలలకు ఒక్కసారైనా ఎవరింట్లోనో ఒకరింట్ల ఏదో ఒక ఫంక్షన్ జరిగేది. అందరం కలుసుకునేవాళ్ళం.  సంవత్సరం నుండి ఒక్క ఫంక్షను లేదు, ఒక్క గెట్ టుగెదర్ లేదు. చాలా డల్ గా ఉన్నది లైఫ్. ఫోన్ లో మాట్లాడాలి అంటే ఎంతసేపు మాట్లాడతాము. అయినా ఎవరి ఇంట్లో వాళ్ళు కదలకుండా ఉంటే, మాట్లాడడానికి మాటలు కూడా కరువై, ఏంటి విశేషాలు అంటే, ఏంటి విశేషాలు అని అడగడమే సరిపోతుంది. ఏవన్నా కొన్నా, ఎక్కడికైనా వెళ్ళినా, సినిమాలు చూసిన వాని గురించి ఎంతోసేపు మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడేమీ లేవు. క్షేమ సమాచారాలు తప్ప.

అంతెందుకు మొన్న మా వదిన గారి అన్నయ్య, మా అక్క తోటి కోడలు, మా పిన్ని, ఆమె కొడుకులిద్దరూ ఇలాగా ఒక ఇరవై మంది దాకా ఈ కరోనా వల్ల చనిపోతే కనీసం మేము చివరి చూపు కూడ చూడలేకపోయాము. కొందరివైతే దిక్కులేని వాళ్ళలాగ అంత్యక్రియలు కూడ బంధువులెవరూ వెళ్ళకుండ హాస్పటల్ వాళ్ళే చేసినారు. కనీసం వాళ్ల వాళ్ళని పరామర్శించే వీలు కూడ లేకపోయే. ఏం పాడు కాలం వచ్చిందో చూడు. సొంత పిన్ని పోతే, అక్క కూతురు పోతే చూడడానికి వెళ్లలేదంటే ఎంత దురదృష్టకరం. ముందైతే ఎవరికైనా నా జ్వరం వచ్చిందన్నా కూడా వెళ్ళి ధైర్యం చెప్పి వచ్చేవాళ్ళం.

మన ఇంట్లో కూడా  పిల్లలకి కొంచెం బాగా లేదన్నా, నా తోడబుట్టిన వాళ్ళు, మీ నాన్న తోడ పుట్టిన వాళ్ళు చూడడానికి వచ్చే వాళ్ళు. ఇప్పుడేమో ఎంత పెద్ద ఆపద వచ్చినా ఒక  ఫోన్ కాల్ తో సరి. దేవుడి దయవల్ల ఈ ఫోన్లు అన్నా ఉన్నాయి. లేకపోతే ఒకరి  విషయాలు ఒకరికి తెలిసేవి కూడ కావు.

ఇక చుట్టుపక్కల వాళ్ళు ఇదివరకు కనబడితే చాలు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే తలుపులు కూడా తీయడం లేదు. తీసిన ఎక్కడ పలకరించాల్సి వస్తుందేమోనని గబుక్కున తలుపులు మూసుకుంటున్నారు.

ఇక కరోనా వచ్చిన వాళ్ళ సంగతి అయితే, అసలు చెప్పనలవి కాదు. హోమ్ క్వారంటైన్ లో ఉన్నవాళ్లు వంట చేసుకునే ఓపిక లేక, తిండిలేక నీరసపడి నానా అవస్థలు పడుతున్నారు. ఎవరన్నా తెలిసిన వాళ్ళు దయతలిచి భోజనం తీసుకెళ్ళి గడప ముందర పెడితే అదే మహాభాగ్యం. లేకపోతే ఎవరికి వారె యమునా తీరే. ఎంత దురదృష్ట కాలం వచ్చింది చూడు ఎన్నడు కని విని ఎరుగని కలికాలం.” అన్నది సుజాతమ్మ.

“ఇంకా ఆపవే దానికి తెలియవా ఇవన్నీ. దానితో సరదాగా మాట్లాడండి ఇక్కడున్నన్ని రోజులు. అది మాటలకు కరువు పడి వచ్చింది. ఒట్టి మనిషి కూడా కాదు. అది సంతోషపడే నాలుగు మాటలు చెప్పండి” అన్నారు జగన్నాథం గారు.

శ్రీయ “అక్కా, పుట్టబోయేది పాపైతె ఏం పేరు పెడతారు, బాబు అయితే ఏం  పేరు పెడతారో సెలెక్ట్ చేసి పెట్టుకున్నారా?” అన్నది.

 శ్రేయస్ “ఆ చాన్స్ బావగారు అక్కకి ఇస్తారో లేదో” అన్నాడు. అన్నింటికీ ఒక నవ్వు నవ్వి,

“చూద్దాం లెండి ఇంకా చాలా టైం ఉంది కదా” అన్నది శ్రావ్య. నెల రోజులు చాలా వేగంగా గడిచిపోయాయి

“నాన్న ఆషాడం అయిపోయింది కదా. ఇక నేను వెళ్లాలి” అన్నది శ్రావ్య.

“అదేంటమ్మా అందరు వచ్చి శ్రావణ పట్టి పెట్టి, నోములు పట్టించి తీసుకెళ్లడం పద్ధతి. కాని నీవు గర్భిణివి అవన్ని చేయరు. కనీసం మీ ఆయన వచ్చి తీసుకెళ్ళడం లక్షణం. కనుక  నేను అల్లుడు గారికి ఫోన్ చేయనా” అన్నారు.

“మీ ఇష్టం నాన్న”అన్నది శ్రావ్య.

జగన్నాధం గారు ఫోన్ చేసి  “బాబు, శ్రావ్య మీపై బెంగ పట్టుకుంది వస్తారా”  అన్నారు.

“లేదు మామయ్యా మీరే తీసుకుని రండి” అన్నాడు దీపక్.

“అది కాదు బాబు, మీరు వచ్చి తీసుకెళ్లడమే పద్ధతి. ఏమనుకోకండి” అన్నాడు.

“సరే ఈరోజు సాయంత్రం వస్తున్నాను రెడీగా ఉండమనండి” అన్నాడు.

ఆ సాయంత్రమే వచ్చాడు దీపక్. ఆ రోజే పోవడానికి సిద్ధమవుతున్న బావ గారితో  “బావగారు ఈ ఒక్కరోజు ఉండండి రేపు వెళుదురు గాని ప్లీజ్” అన్న శ్రీయ తో ఏమీ అనలేక మౌనంగా ఉన్నాడు. ఇక శ్రీయ, శ్రేయస్ ల ఆనందానికి అంతే లేదు. ఎన్నో రోజుల తర్వాత అక్కా బావల తో సరదాగా గడపొచ్చని ఎంతో ఆనందించారు. ఇద్దరు కలిసి, మౌనంగా ఉన్నా దీపక్ ని మళ్లీ మళ్లీ మాటల్లోకి దించి సరదాగా మాట్లాడించారు. భోజనం చేసేటప్పుడు అందరు టేబుల్ దగ్గర కూర్చుని సంతోషంగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ, కొసరి కొసరి వడ్డించు కుంటూ, తింటుంటే దీపక్ కు అంతా వింతగా అనిపించింది. అందరు కలిసి  భోజనం చేస్తే ఇంత సంతోషంగా ఉంటుందని మొదటిసారి తెలుసుకున్నాడు. దీపక్ అదే రోజు వెళ్దామనుకున్న మనిషి ఆ వాతావరణం ఆ పద్ధతులు నచ్చి మూడు రోజులు ఉండి వెళ్ళారు.

తమ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తినేటప్పుడు తల్లిని, తండ్రిని, చెల్లెలు, తమ్ముణ్ణి పిలిచి, “అందరం ఇక్కడే తిందాము ఈరోజు నుండి” అన్నాడు.

మొదట్లో వాళ్ళ నాన్న తప్ప, ఎవరు  ఒప్పుకోకపోయినా వీళ్ళు ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ తినడం, శ్రావ్య వాళ్ళిద్దరికి వడ్డించడం చూసి, కొన్నాళ్ళకు ఆడపడుచు రోశిణి, మరిది రోహిత్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేయడం మొదలు పెట్టారు. శ్రావ్య సినిమాల జోక్స్, ఫ్రెండ్స్ గురించి, చదివిన పుస్తకాల గురించి ఏదో ఒకటి మాట్లాడేది. అదంతా దీపక్ ఇంట్లో వాళ్లకి కొత్తకొత్తగా అనిపించేది. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి వాతావరణం ఎరుగరు. మెల్లగా మాటల నుండి నవ్వుల వరకు ఎదిగిపోయారు. మూడు నెలలు గడిచేసరికి అందరూ హాయిగా హాల్లో కూర్చుని టీవీ  చూడడము, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తినడం అలవాటు చేసుకున్నారు.

శ్రావ్యను వాళ్ల పుట్టింటి వాళ్ళు ఎలా అపురూపంగా చూసుకున్నారో చూసిన దీపక్ తను కూడా  ఆమెనలాగే చూడడం మొదలు పెట్టాడు. ఈ మార్పులను చూస్తున్న శ్రావ్య ఆనందానికి అంతే లేదు. నెలలు నిండిన శ్రావ్యను వాళ్ళ నాన్న వచ్చి డెలివరీకి తీసుకెళ్ళాడు.

ఒక రోజు శ్రావ్యతో వాళ్ల నాన్న “అమ్మ మీ అత్తగారింట్లో అందరు ఇలా మారడానికి కారణం మీ అత్తగారు, వాళ్ళ అత్తగారు రోజు పోట్లాడుకుని ఇంట్లో ప్రశాంతత అన్నది లేకుండా చేసే వారట. అందువల్ల మీ వారి తాతగారు ఆ పోట్లాటలు భరించలేక  స్ట్రిక్ట్గా ఎవరు ఎవరితో మాట్లాడకుండా ఎవరి గదిల్లో వాళ్ళు ఉంటే ఏ గొడవలు ఉండవని, ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని అలా రూల్ పెట్టారట. అందువల్ల ఎన్నో ఏళ్ళనుండి వాళ్ళింట్లో అందరికీ అదే అలవాటై పోయింది. ఇప్పుడు ఆయన లేరు.  నీవు మీ అత్తగారు కలిసిమెలిసి మంచిగా ఉండండి. నీకు పుట్టింటి సంతోషమంతా ఇక్కడ కూడా లభిస్తుంది” అని చెప్పారు జగన్నాధం గారు.

కొన్నాళ్ళకు చిన్నారి పాపకు జన్మనిచ్చింది శ్రావ్య. ఆ వార్త తెలియగానె పాపను చూడడానికి దీపక్ వెళ్తుంటే అత్త తప్ప, అందరు రెడీ ఐపోయారు. దీపక్ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నీవు కూడ రా. పాపను చూద్దువు” అన్నాడు.

“నాకీ ఫార్మాలిటీస్ ఇష్టముండవు” అన్నది వెంటనే. కాని ఏమనుకుందో చివరి నిమిషంలో ఆమె కూడ వచ్చి కార్లో కూర్చుంది.

ఆ రోజు మనవరాలిని చూడడానికి హాస్పిటల్ కి వచ్చిన అత్తగారు, పాపను చూసినాక దూరంగా ఉండలేక పోయింది. పాపనెత్తుకొని ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంది.

హాస్పిటల్ నుండి అందరిని అత్తగారింటికి తీసుకెళ్ళాడు దీపక్. వాళ్ళ అథితి సత్కారాలు, మర్యాదలు, మాటల తీరుచూసి చాల సంతోషించారు అందరు. దీపక్ చెల్లెలు, తమ్ముడు, కొద్ది సేపట్లోనే శ్రీయ, శ్రేయస్స్తో కలసి పోయి నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇద్దరు వియ్యంకులు కూడ పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నారు. ఇక తప్పదన్నట్టు శ్రావ్య అత్తగారు కూడ వియ్యపురాలితో మాట కలిపింది. సుజాతమ్మ వదినగారు, వదినగారు అని సంబోధిస్తు మాట్లాడుతుంటే, ఇన్ని రోజుల్నుండి ఈ చుట్టరికాలను, ఈ ఆప్యాయతలను ఎందుకు దూరం చేసుకున్నామా అని మొదటి సారిగ బాధపడింది.

మూడవ నెలలో పాపను ఎత్తుకొని వచ్చిన శ్రావ్యకు అందరు నవ్వుతు స్వాగతం పలుకుతుంటే, తమ ఇంటికి ఆనందాల హరివిల్లు వచ్చిందని సంతోషించింది శ్రావ్య. పాప వచ్చిన క్షణం నుండి ఇంట్లో వాళ్ళంతా పాప చుట్టు చేరి ఆడించడం మొదలు పట్టారు. ఆ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు శ్రావ్యకి పుట్టింట్లో ఉండే సరదాలు, ఆనందాలు అన్నీ అత్తింట్లో కూడా విరబూయడంతో మనసు తేలిక అయ్యింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!