అంచనా

 అంచనా

రచన::మంగు కృష్ణకుమారి

“సాంబం నీ స్నేహితుడే కదూ, నువ్వు ఊళ్ళో లేకపోతేనేం? అతను అన్నీ చూసుకుంటాడు”‌ సారధి‌కి ట్రాన్సఫర్ అయి వెళుతుంటే అందరూ సలహా ఇచ్చేరు. ఊరికి కాస్త దూరంగా సాంబం, సారధి హౌస్ సైట్లు కొనుక్కున్నారు. ఇప్పుడిప్పుడే అక్కడ డెవలప్మెంట్ మొదలవుతోంది. ధీమాగా సాంబంకే జాగ్రత్తగా చూడమని అప్పచెప్పి సారధి భార్యా పిల్లలతో వెళిపోయేడు.

నాలుగేళ్ళు గడిచేయి. సాంబం రెండుసార్లు సారధిని కలిసి తమ హౌస్ సైట్‌లు ఫొటోలు తీసి చూపించేడు. మంచి‌ కంకర రోడ్, ట్రాన్ఫారమర్ చాలా వచ్చేయి. సారధి చాలా సంతోషపడ్డాడు.

ఏడాదికల్లా సాంబం వచ్చి సారధి దగ్గర ఓ ప్రతిపాదన పెట్టేడు.
“ఒరే సారధీ, నీ సైట్ లో నాకో రెండువందల గజాలు అమ్మీరా? ఇప్పుడు ఉన్న మార్కెట్ రేట్ కి కాస్త ఎక్కువే కలిపి మరీ ఇస్తాను” అన్నాడు.

“నీకు దేనికి?” సారధి అడిగేడు. “ఏం చెప్పమంటావ్… మా అబ్బాయి ‘పక్క పక్కనే ఇళ్ళు కట్టించుకుందాం. ఇప్పుడున్న సైట్ కి ఒక నూట యాభై, రెండొందలు కలిస్తే కిరాణా షాప్ కి ఒకటి మనందరికీ ఒకటీ కట్టించవచ్చు. షాప్ కి దగ్గరగా ఇల్లుంటే బిజినెస్ మోపు చేసుకోవచ్చు’అంటున్నాడు.” అన్నాడు.

“ఏమండోయ్” అంటూ సారధి భార్య పిలిచి, “అన్నయ్య గారికి ఇచ్చేద్దురూ! మనం ఆంధ్రా మారిపోదాం అనుకుంటున్నాం కదా, అక్కడ కొనుక్కుందాం” అంది.

సెలవల్లేక సారధి రిజిస్ట్రేషన్ అవంగానే డబ్బు బేంక్ లొ వేసేసి తిరిగి వచ్చేసేడు. విశ్వ ప్రయత్నం మీద ఒరిస్సా నించి ఆంధ్రాకి ఒక ప్రమోషన్ వదులుకొని మరీ ట్రాన్సఫర్ చేయించుకున్నాడు సారధి.

ఏడాది తరవాత చూస్తే జాగాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఏ మూల చూసినా, ఇసకా మట్టీ పనివాళ్ళు బిల్డింగ్ లూ, ఎపార్టమెంట్ నిర్మాణాలు చురుకుగా జరిగిపోతున్నాయి.

సారధి భార్య శారద “ఏమండీ సాంబన్నయ్య గారికి చెప్పి అక్కడ ఉన్న మిగతా జాగా అమ్మేసి లోన్ పెట్టి ఇక్కడ కొనుక్కుందాం అండీ….పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు. ఓ మోస్తరు ఇల్లయినా కట్టించుకోవద్దా?” అంది.

సారధి సాంబం తో మాటాడేడు.
“చూద్దాంలే మంచి బేరం రానీ” అన్నాడు సాంబం. ఎన్ని ఫోన్లు చేసినా సాంబం సరిగ్గా స్పందించటం లేదు. సారధి అయోమయంలో ఉన్నాడు. ఆ ఊరి మిత్రుడు సుధాకరం పని మీద వచ్చి కలిసేడు.

సారధి తన బాధంతా చెప్తే సుధాకరం పకపకా నవ్వేడు. “సారధీ, ఎక్కడో నువ్వు తప్పటడుగు వేసేవు. సాంబం మొత్తం తన జాగా అంతా ఎపార్టమెంట్ లకి ఇచ్చేసేడు. అతనికి సగం ఎపార్టమెంట్ లు ఇస్తారు. చాలా జరిగేయిలే” అన్నాడు.

సారధి నిర్ఘాంతపోయి “మరిప్పుడు ఏం చేయాలి?” అన్నాడు.

“ఒకసారి రా! సాంబంకి ముందు వస్తున్నట్లు చెప్పకు” సలహా ఇచ్చేడు సుధాకరం.

శారద కళవళపడింది. వెంటనే వెళ్ళమంది. సారధి బయలు దేరి వెళ్ళి హొటల్ రూమ్ లో సామాను పడేసి ఫ్రెష్ అయి సుధాకర్ ని కలిసేడు. ఇద్దరూ సైట్ దగ్గరకి వెళ్ళేరు. ఎపార్టమెంట్
జోరుగా కడుతున్నారు. సాంబం ఎక్కడా కనపడలేదు. తేరిపారా చూస్తే, తన సైట్ కి అటుపక్క ఇల్లు లేస్తున్నాది. తన జాగాలోంచి అటూ ఇటూ కూడా కొంచెం కొంచెం లాగేసుకున్నారు. మధ్యలో ఉన్న సారధి మిగిలిన సైట్ కి క్రాస్ వచ్చేసింది.

అక్కడ ఉన్న సూపర్వైజర్ కి విషయం అంతా వివరిస్తే “మీరు ఎప్పుడయినా మొత్తం సైట్ అమ్మాలి గానీ, ఇలా కొంత వదిలిసి అమ్మితే ఇలాగే అవుతుంది. సాంబంగారు ఇప్పుడు ఊళ్ళోనే లేరు. మీ సైట్  కి ఉన్న క్రాస్ వల్ల వాస్తుపరంగా దోషం ఉంది. అమ్మకం చాలా కష్టం.” అన్నాడు. సారధి మాటలు రాక అలా ఉండిపోయేడు.

“మీరు ధర తగ్గితే నేను ఎలాగో బ్రోకరుని పట్టుకొని అమ్మిస్తాను. బ్రోకర్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాలి ” అన్నాడు.

తరవాత చెప్తానని సారధి బయలుదేరేడు.

శారద అంతావిని “అసలు మన జాగా వాళ్ళు ఎలా లాగేసుకున్నారండీ? సుధాకరం అన్నయ్య ని అడిగి లాయర్ నోటీస్ ఇవ్వండి” అంది కోపంగా.

సారధి శారద పట్టుదల మీద లాయర్ తో మాటాడి నోటీస్ ఇచ్చేడు. సాంబం ఉద్రేకపడి, అడిగినవాళ్ళకీ, అడగనివాళ్ళకీ కూడా “సారధి ఇంత మిత్రద్రోహం చేస్తాడని తనకి తెలీదని, అసలు
ఈ జాగా కొనమని సలహా ఇచ్చింది తనేఅని, డబ్బు లేదంటే అప్పు ఇచ్చి మరీ ప్రోత్సాహించి కొనిపించేడని, అసలు ఆ డబ్బుకి వడ్డీ ఇవ్వకపోయినా తను ఏమీ అనలేదని” ….. ఇలా చాలా చాలా చెప్పేడు.

బిల్డింగ్ కడుతున్న సూపర్వైజరు కూడా సాంబంని సమర్థిస్తూ మాట్లాడేడు. కేస్ ఓ పట్టాన తేలక వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. కేస్ జరుగుతున్నంత కాలం సైట్ అమ్మకూడదు. ఆఖరికి లాయర్ సలహా మీద ‘జెంటిల్‌మేన్ అగ్రిమెంట్’ పేరుతో రాజీపడి కేస్ విత్ డ్రా చేసుకున్నాడు.

తరవాత ఇహ విధిలేక, బ్రోకర్ ని నమ్మి అతని ద్వారా, తక్కువ ధరకి అమ్ముకొనేసరికి చుక్కలు చూసేడు. లాయర్ ఖర్చులూ, ప్రయాణాలూ, బ్రోకర్ కీ ఖర్చులన్నీ అయేసరికి లాభం గూబలోకి వచ్చింది.

ఆఖరికి తను ఏదీ సరిగ్గా అంచనా కట్టలేక పోవడమే తన నష్టానికి మూలకారణం అని సారధి తననే తను తిట్టుకున్నాడు.

***

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!