ఆలయంలో రహస్య వృక్షం

అంశం: అంతు చిక్కని రహస్య ప్రదేశాలు

ఆలయంలో రహస్య వృక్షం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బాలపద్మం

అది వానపల్లి గ్రామం. ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట మండలం లో ఉంది. కోనసీమలోని అమలాపురంకి సుమారు 16 కిలో మీటర్ల దూరంలోను, రాజమహేంద్రవరం నుంచి రావులపాలెం, కొత్తపేట మీదుగా కాలువ గుండా వెళ్ళే మార్గంలో ఉన్న గ్రామం. ఆ గ్రామ దేవత ఎంతో మహిమాన్విత దేవత. ఆ ఊరు వారందరికీ ఆవిడ ఆరాధ్య దేవత మరియు ఇలవేల్పు. ఆ గ్రామ దేవత శ్రీ పళ్ళాలమ్మగా కొలవబడుతూ ఉంది. శక్తి స్వరూపిణిగా, సీతాదేవి స్వయంగా కొలిచిన దేవతగా కూడా ఈ అమ్మ ప్రసిద్ది. ఎన్నో మహిమలు గల అమ్మ ఈవిడ.
ఈ అమ్మవారి గుడి కూడా ఎన్నో ప్రత్యేకతలతో ఉంటుంది. ధవళేశ్వరం ఆనకట్ట కట్టినపుడు రాజమండ్రి నుంచి ముక్తేశ్వరం వరకూ కాలువ తవ్వడానికి మధ్యలో ఈ అమ్మ వారి గుడి అడ్డువచ్చింది అని, అప్పుడు కాటన్ దొర ఆ గుడి తొలగించ వలసినదే అనగా, ఎన్నో ఆటంకాలు కలగడం, ఆయన జబ్బు పడడం, ఆ తరువాత సాక్షాత్తూ అమ్మవారే కాటన్ దొరకి కాలువ డిజైను మార్చి, కొంచెం అటుగా తవ్వించ మని చెప్తే అలాగే చేసినట్టు ఆ గుడి కొంచెం దూరం లో కాలువ అడ్డంగా దారి మల్లినట్టు ఉంటుంది. ఆ ప్రాంత గ్రామాన్ని అడ్డ కాలువ అని పిలుస్తారు. కాటన్ దొర కూడా కోలుకుని మిగితా పని సులభమైనట్టు కూడా చెప్తారు. ఇలాంటి విశేషాలు, అమ్మ మహిమలు ఎన్నో ఉన్నాయి. అయితే మన అంశం రహస్య విషయం కనుక ఇక్కడ దాగివున్న రహస్యం గురించి చెప్పుకుందాం.
త్రేతాయుగం లో సీతమ్మ వారు వనవాస సమయంలో వన దేవత గా ఈ అమ్మవారికి పూజ చేసి, ఒక పేరు లేని మొక్కని పాతింది అని స్థల పురాణం చెబుతుంది. అది వృక్షమై నేటికీ అక్కడ ఉంది. ఈ వృక్షం పేరు ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ఎప్పుడూ పచ్చని ఆకులతో నడి వయస్సులో ఉండే ఈ వృక్షం సర్వ కాలాల లోనూ పచ్చగా దర్శనం ఇస్తోంది, ఎప్పటికీ ఇస్తూ ఉంటుంది. అలాగే అమ్మ వారి గుడి మంటపం పై భాగాన మూడు దిమ్మలు గా ఉండే ప్రదేశాలు ఉన్నాయి. వాటి లోపల నిధులు ఉంటాయి అనీ, ఈ చెట్టు పేరు చెప్పిన వారికి అందులోని నిధులు ఇస్తారని చెబుతుంటారు. అవి కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు. అయితే వృక్ష శాస్త్ర అధ్యయనం చేసే వారు కూడా ఈ చెట్టు పేరు చెప్పలేక పోయారని అంటారు.
అదండీ వానపల్లి గ్రామ దేవత ఆలయం లోని రహస్యమైన ఆ వృక్షం కథ. ఎప్పటికీ ఆ వృక్షం పేరు మాత్రం రహస్యమే.

ఇది రచయిత స్వయం సేకరణ. రచయిత, బాల్యం, పాఠశాల విద్య ఆ గ్రామంలో అమ్మవారి ఆశీస్సులతో గడపడం జరిగింది.

You May Also Like

10 thoughts on “ఆలయంలో రహస్య వృక్షం

  1. ప్రశాంతముగా ఉండే ఆ అమ్మవారి గుడి, ఆ ప్రదేశం కళ్లకు కట్టినట్టు రాశారు. చాలా బాగుంది🙏

  2. We got to know the unknown and a very important fact about the temple, will notice in my next visit. Beautiful narration.

  3. చాలా బాగా వర్ణించారు మన అమ్మవారు గురించి.. సో నైస్

  4. రహస్యం, పేరు లేని వృక్షం గురించి తెలుసుకోవాలి, వెళ్ళి చూడాలి అన్నంత చక్కగా సాగింది వ్యాసం. Super

    1. Super sir
      పెద్దలకి చిన్న పిల్లల కథ బాగుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!