అచ్చంగా అమ్మకే తెలుసు

అచ్చంగా అమ్మకే తెలుసు

రచన: నామని సుజనాదేవి

గజిబిజి సంసారాన్ని గాడిలో పెట్టాలన్నా
ఒడిదొడుకుల జీవితాలని ఒడిసిపట్టాలన్నా
సంసార రధాన్ని సాఫీగా లాగాలన్నా
సంసారసాగర మధనంలోని హాలాహల్లాన్నంతా పుక్కిట పట్టాలన్నా
ఎవరికి వారైన బంధాలన్నీ కలిపి ఒక్క తాటిపై తేవాలన్నా
ఇంటిల్లిపాది సకలావసరాలు చెప్పకనే కనిపెట్టి తీర్చాలన్నా
గతుకుల బొంత సంసారాన్ని గర్వించేలా చేయాలన్నా
కన్నవారికి కట్టుకున్నవారికి ఎవ్వరికే ఆపదోచ్చినా
ఆరితేరిన ధన్వంతరిలా ఆత్మస్థైర్యం చెడక ఆత్మవిశ్వాసం నూరిపోయాలన్నా
దిష్టి తీసి ముడుపుకట్టి కిలకిల నవ్వగానే మురిసిపోవాలన్నా

కడుపులో బడబాగ్నులు రగులుతున్నా
పచ్చని సంసారంలో కల్లోలాలే రేగుతున్నా
సంసార సముద్రంలో సుడి గుండా లే తిరుగుతున్నా
అంతరాత్మను మాటల ఈటేల అగ్నికీలలు దహించుతున్నా
కట్టుకున్నవారు, కడుపునా పుట్టినవారు కళ్ళల్లో విస్పులింగాలే కురిపించినా
కన్రెప్పల మాటున కన్నీటి సముద్రాలను దాచేసి
మొక్కవోని ధైర్యంతో చెదరని చిరునవ్వుతో తొణకని బెణకని విశ్వాసంతో
కలకాలం కష్ట సుఖాల్లో ఆదుకునే కల్పతరువై
ఎవ్వరేమడిగినా లేదనక ఇచ్చే కామదేనువైనా అమ్మే కదా!

భూగోళం బద్ధలైనా సూర్యచంద్రులు గతులు తప్పినా
యుగాలుమారినా తరాలు తరలినా
కుల,మత,వర్ణ,వర్గ,ప్రాంత,లింగ ,జాతి భేదాలకతీతంగా
మాయనిది మారనిది అమ్మ ప్రేమ ఒక్కటే
ప్రపంచమంతా ఎదురుతిరిగినా వెన్నుతట్టి వెనకుండేది అమ్మ మాత్రమె.
ఆచంద్రతారార్కం ,
అజరామరమై,అజేయమై,అద్వితీయమై వెలిగేది అమ్మప్రేమే కదా

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!