అమ్మ అంటే అమ్మే

అమ్మ అంటే అమ్మే

రచయిత :: మీసాల చినగౌరినాయుడు

అక్షర మదింపుతో నా మస్తిష్కం
శిఖలా మంటెక్కింది
శీర్షికాబొట్టు పెట్టడానికి….

కవనతోటలన్నీ పుష్పమాతలతో నిండి వికసిస్తున్నా, పదబంధాలన్నీ
పరుగెత్తుతున్నాయి
మరో మధుర కవితాతావికై…..

గీతామాలికలన్నీ సప్తస్వరాలతో అభిషేకించినా
మరొక రాగమేదో
సాధనచేస్తోంది
కొంగొత్త శృతితో
మాతాస్తుతికై….

సతులతోడ,
సృష్టిస్థితిలయల
క్రియలన్నీ మోసుకొని
ఇడుముల నావను ఇంపుగా
తీరానికి చేర్చిన చుక్కానికి
భక్తిగా కరములు ఎగబడ్డాయి
నమస్సులకై….

ప్రకృతికి పచ్చని చీరకట్టి
రేరాజును బొట్టుగపెట్టి
గంగమ్మను జడగచుట్టి
గిరిశిఖరాలను గజ్జెగ గట్టి
నడుస్తున్న నా అంతరాత్మకు
నా పెదవులు నుడివాయి
ప్రార్ధనకై…..

ఆ దేవతామూర్తిని
ఏమని ఆరాధింపను..?
ఎంతని కవిత్వీకరించను…??
గుండెను గుడిగా చేసి
ప్రతిష్టించడం తప్ప!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!