మలిసంధ్య ప్రేమ

మలిసంధ్య ప్రేమ

రచన: దహగాం రజనీ ప్రియ

పార్వతికి ఒక్కగానొక్క కొడుకు రిషి.ఎస్.టి.ఓ గా ఉద్యోగం చేస్తోంది పార్వతి. పెళ్లయిన 5 ఏళ్లకే భర్తను కోల్పోయింది. గవర్నమెంట్ ఉద్యోగం, ఆస్తి అన్నీ బాగానే ఉన్నాయి. కొడుకును మంచి ప్రయోజకుడిగా తీర్చిదిద్దింది. చదువుతో పాటు సామాజిక విలువలను కూడా నేర్పించింది.

ఎమ్.బి.ఏ పూర్తి చేసిన రిషికి యూ.ఎస్ వెళ్లాలని కోరిక. టీవీ లో క్యాష్ ప్రోగ్రాం చూస్తున్న తల్లి దగ్గరకి వచ్చి,”అమ్మా టీవీ ఆఫ్ చెయ్యి నీతో మాట్లాడాలి. ఏంట్రా ఏంటి సంగతి అని అడిగింది. నేను యూ.ఎస్ వెళ్లాలని అనుకుంటున్నాను. కొన్నాళ్ళు అక్కడ ఉద్యోగం చేద్దామనుకుంటున్నాను. నువ్వేమంటావమ్మా అని అడిగాడు. ఎందుకురా అమెరికా ఇక్కడే ఏదైనా మంచి ఉద్యోగం చూసుకో లేకపోతే పై చదువులు చదువుకోవాలంటే చదువుకో మన దేశంలోనే బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి అమెరికా ఎందుకురా?
నాకు నువ్వు తప్ప ఎవరున్నారు?ఒక్కదాన్నైపోతాను? ఆలోచించు”అని కొడుకుకి నచ్చ చెప్పింది. కానీ రిషి ప్లీజ్ అమ్మ ఒకట్రెండు సంవత్సరాలు అంతే ఎక్కువ కాలం ఉండను. ప్లీజ్ అమ్మా సరే అను, నాకు అక్కడి లైఫ్ చూడాలని ఉంది అని బ్రతిమాలాడు. కొడుకు మాట కాదనలేక సరే నీ ఇష్టం అంది.

అమెరికా ప్రయాణానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అక్కడ ఉద్యోగం, వీసా అన్నీ రావడానికి 6 నెలలు పట్టింది.రిషి అమెరికా బయలుదేరాడు.

పాపం పార్వతి మాత్రం బాధగా వున్నా కొడుకు కోరిక కోసం ఒప్పుకుంది.

న్యూయార్క్ లో దిగగానే తల్లికి ఫోన్ చేశాడు.”నా ప్రయాణం బాగానే జరిగింది.అమ్మా నువ్వు జాగ్రత్త నేను రోజూ ఫోన్ చేస్తాను బాధ పడకు”అని చెప్పాడు.

ప్రతిరోజూ తల్లికి ఫోన్ చేసి మాట్లాడడం ఒకరి విషయాలు ఒకరు పంచుకోవటం చేసుకోవడం అలా రోజు ఓ గంట సేపు మాట్లాడుకునే వాళ్ళు. కొడుకుకి దూరంగా ఉండాల్సి వచ్చినందుకు పార్వతి బాధ పడుతున్నా కొడుకుకి మాత్రం ఆ విషయం తెలియనివ్వలేదు. ఎందుకంటే 2 ఏళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయాడు. అప్పట్నుంచీ కొడుకే లోకంగా బ్రతికింది పార్వతి.
అంత అపురూపంగా పెంచుకుంది.అందుకే కొడుకు అడిగిన ఒకే ఒక్క కోరిక తీర్చటం కోసం తన బాధను దిగమింగుకుంది.

రోజూలాగే ఆరోజు కూడా తల్లికి ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తలేదు పార్వతి. ఫోను ఇంట్లో పెట్టి ఏటైనా వెళ్ళిందేమో, లేకపోతే స్నానం లో ఉందేమో అనుకొని కాసేపాగి మళ్లీ చేద్దాంలే అనుకున్నాడు.15 నిమిషాలకి రిషికి ఒక ఫోన్ వచ్చింది. అది వాళ్ళ పక్కింటి ప్రకాష్ గారిది. బాబు రిషి అమ్మకి ఆక్సిడెంట్ అయ్యింది.ప్రమాద స్థలం లోనే అంతా అయిపోయింది.నువ్వు వెంటనే బయలుదేరి రా బాబు, శవాన్ని కుటుంబ సభ్యులకు మాత్రమే ఇస్తామంటున్నారు, అని చెప్పాడు.రిషికి ఎం చెయ్యాలో తోచలేదు. ఇండియాకి టికెట్ బుక్ చేయమని స్నేహితులకి చెప్పాడు.

ఇండియాకి రావటానికి 2 రోజులు పట్టింది.ఈ 2 రోజులు పార్వతి శవం ఆసుపత్రి మార్చురీ లోనే ఉంది.తల్లి శవాన్ని చూసిన రిషి ఓదార్చడం ఎవరి తరం కాలేదు. తండ్రి లేకున్నా తనని ఎంత గారాబంగా పెంచిందో తలచుకుని ఎంతో విలపించాడు. తన దగ్గరే ఉండమని అడిగినా కూడా నేనే అమెరికా మీద మోజుతో వెళ్లాను. నా మాట కాదనలేక ఒప్పుకుంది. అయ్యో అమ్మను వదిలి వెళ్లి ఎంత తప్పు చేశాను. చివరి నిమిషంలో అమ్మ దగ్గర లేకుండా పోయాను అని భోరున ఏడ్చాడు.

కొంతకాలం గడిచింది…….

అమ్మ లేని ఇల్లును ఊహించుకోలేక పోయాడు. రిషి ఒకరోజు అమ్మకి ఇష్టమైన క్యాష్ ప్రోగ్రామ్ చూస్తూ ఆలోచించసాగాడు; అమ్మకి కావలసినంత డబ్బు ఉంది, తానే ప్రాణంగా బ్రతికే నేనున్నాను. కానీ సమయానికి దగ్గర లేకపోవడంతో అమ్మ ఒక అనాథలా మార్చురీలో 2 రోజులు ఉండాల్సి వచ్చింది.అదే పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు వదిలేసిన వాళ్ళు ఎంతమంది అనాథల్లా బ్రతుకుతున్నారో?ఎందరు ప్రాణాలు కోల్పోతున్నారో? అని కుమిలిపోయాడు. వాళ్ళందరి కోసం ఏదైనా చేయాలనుకున్నాడు.ఏం చేస్తే బాగుంటుందని ఎంతో ఆలోచించాడు.

అమెరికాలో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాడు. తన తల్లి తన కోసం కొన్న స్థలం లో తన తల్లి పేరుతో ఒక వృద్ధాశ్రమం స్థాపించాడు.అనాథలుగా ఉన్న ఎందరో వ్రృద్ధులను చేరదీశాడు. వారందరి ఆరోగ్యం ,ఆహారం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తూ చాలా బాగా చూసుకుంటున్నాడు.

జానకి పెద్దగా చదువుకోలేదు. పెళ్లి అయిన 6 నెలలకే భర్తని పోగొట్టుకుంది. పెళ్ళైన 6 నెలలకే తమ బిడ్డను మింగేసిందనీ,నష్టజాతకురాలనీ అత్తమామలు జానకిని ఇంటి నుంచి గెంటేశారు. అత్తింటి ఆదరణ కరువై పుట్టింటికి చేరింది జానకి.

జానకిని తల్లిదండ్రులు చేరదీశారు.
ఐదోతనం పోగొట్టుకున్న కూతుర్ని అపురూపంగా చూసుకున్నారు.జానకి తమ్ముడు ప్రభాకర్ ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జానకి తండ్రి ఆస్తి లో కొంత భాగాన్ని కూతురు పేరున రాశాడు. ఎందుకంటే తన తర్వాత జానకి ఇబ్బంది పడకూడదని, దానికి ప్రభాకర్ కూడా అభ్యంతరం చెప్పలేదు. కొన్నాళ్ళకి ప్రభాకర్ కు మేనమామ కూతురు అయిన జ్యోతి తో పెళ్లి జరిగింది. జ్యోతి కూడా జానకిని బాగానే చూసుకుంటుంది.ప్రభాకర్ , జ్యోతి లకు ఓ కొడుకు, కూతురు పుట్టారు. కొంత కాలానికి జానకి తల్లిదండ్రులు కాలం చేశారు.

తల్లిదండ్రులు కాలం చేసిన తర్వాత తమ్ముడు మీద భారం వేయడం ఇష్టంలేక వంటలు చేస్తూ జీవనం సాగిస్తూంది.చిన్న ఉద్యోగం ,ఇద్దరు పిల్లల్ని సాదటం ,వారి చదువులు తమ్ముడు ఇబ్బంది చూసి వచ్చిన ఆదాయంలో కొంత తమ్ముడికి సహాయం చేసేది.

తమ్ముడి పిల్లలు పెద్దవాళ్ళైనారు. జానకికి
ఒంట్లో ఓపిక తగ్గి వంటలకు వెళ్ళడం మానేసింది. ప్రభాకర్ కూడా రిటైర్ అయ్యాడు. ఒకరోజు ప్రభాకర్ అక్క దగ్గరికి వచ్చి ,”అక్కా!ఖర్చులు పెరిగాయి, పిల్లలు పెద్దవాళ్ళు అయినారు, పిల్ల పెళ్లికి ఎదిగింది.ఇల్లు తాకట్టు పెట్టి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నువ్వు ఏదైనా వేరే దారి చూసుకో”అని చెప్పాడు. ప్రభాకర్ కూతురికి పెళ్లి కుదిరింది. అనుకున్న ప్రకారం ప్రభాకర్ ఇల్లు తాకట్టు పెట్టి పెళ్లి ఖర్చులు వెళ్లదీసుకున్నాడు. పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి సమయంలో పెళ్లి కొడుక్కి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.తమ్ముడి కష్టం చూడలేక జానకి తన తల్లిదండ్రులు తనకు రాసి ఇచ్చిన స్థలాన్ని మేనకోడలి కోసం రాసి ఇచ్చింది. ఆనందంగా పెళ్లి జరిగింది.

పెళ్లి తర్వాత జానకి పార్వతి వృద్ధాశ్రమంలో చేరింది. అక్కడి వాతావరణానికీ ,రిషి చూపించే వాత్సల్యానికీ తొందర్లోనే జానకి రిషికి దగ్గరయింది. జానకి చూపించే ప్రేమ రిషికి తన తల్లి ప్రేమను గుర్తు చేసింది.

అదే ఆశ్రమంలో రమణారావు కూడా ఉంటున్నాడు. రమణారావు వయసు 70 సంవత్సరాలు. ఒక సంవత్సరం క్రితం భార్యను కోల్పోయాడు. భార్య పోయినతర్వాత ఆస్తినంతా కూతురికీ, కొడుకుకీ పంచి ఇచ్చేశాడు. ఆస్తి చేతికి రాగానే ఆయన్ని పిల్లలు ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుందామని కార్ కి అడ్డంగా పోయాడు. అనుకోకుండా అది రిషి కారు. కారు నుంచి దిగి ఆయన్ని కాపాడి నిజం తెలుసుకొని రిషి ఆయనను ఆశ్రమానికి తీసుకు వచ్చాడు.

ఓసారి రమణారావు ఆరోగ్యం చెడిపోయింది. మానవత్వంతో జానకి ఆయనకు ఎన్నో సపర్యలు చేసింది.వారం రోజుల్లో రమణారావు ఆరోగ్యం కుదుటపడింది. వారిద్దరి మధ్య తెలియని ఒక బంధం ఏర్పడింది.

జానకి లో తన తల్లిని చూసుకున్న రిషికి జానకిని చూసి, నాన్న చనిపోతే అమ్మ ఒంటరిగా తనని ఒంటరిగా ఎలా పెంచిందో మగ తోడు లేకుండా ఈ సమాజంలో నిలదొక్కుకొని తనని ఇంత వాడిని చేసింది. నా గురించి ఆలోచించి అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. జానకి గారు కూడా పెళ్ళైన 6 నెలలకే భర్తను కోల్పోయి ఒంటరిగా ఎంత బాధ అనుభవించిందో అని తనలో తానే అంతర్మథనం చెందాడు. అప్పుడు రిషికి ఒక ఆలోచన వచ్చింది. తన తల్లి అనుభవించిన ఒంటరితనం జానకి ఇక మీదైయినా అనుభవించ కూడదని ఇప్పటికైనా ఆమెకు ఒక తోడు ఉంటే బాగుండునని అనుకున్నాడు.

తనకు వచ్చిన ఆలోచనను రమణారావు, జానకి గార్ల ముందు ప్రస్తావించాడు. దానికి జానకి 65 ఏళ్ల వయసులో పెళ్లేంటి? లోకం ఏమనుకుంటుంది? అని, 70 ఏళ్ళ వయసులో మళ్లీ పెళ్లా? మా పిల్లలు ఊరుకుంటారా? అని రమణారావు అన్నారు. దానికి రిషి మిమ్మల్ని రోడ్డుమీద వదిలేసిన మీ పిల్లలను గురించిన ఆలోచన మీకెందుకు? మీరు ఒంటరిగా జీవితం గడిపినప్పుడు మిమ్మల్ని పట్టించుకోని లోకానికి మీ గురించి మాట్లాడే హక్కు లేదు అని వారిద్దరిని ఒప్పించి వారికి వివాహం జరిపించాడు.

రమణారావు జానకిల మధ్య ఉన్నది యవ్వనంలో చిగురించిన ప్రేమ కాదు. వార్ధక్యంలో ఏర్పడ్డ అభిమానం. ఇది మనిషికీ
మనిషికీ మధ్య ఉన్న ఆకర్షణ కాదు, మనసుకీ, మనసుకీ మధ్య ఏర్పడ్డ అనుబంధం. కల్మషం లేని సంబంధం. ఈ ప్రేమ ని ఏమంటారు అని ఆలోచిస్తే…..

ఇది….మలిసంధ్య ప్రేమ.

వీరిద్దరూ రిషికి తల్లిదండ్రులగా మారి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు.ఆశ్రమంలో వృద్ధులు అందరినీ ఏలోటు లేకుండా చూసుకో సాగారు.

రమణారావు గారి పిల్లల్లాంటి పిల్లలున్న ఈ సమాజంలో రిషి లాంటి ఋషుల అవసరం ఎంతో ఉంది.

మీరేమంటారు?

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!