శివార్పణం

రచన – సత్య కామ ఋషి

పలురకాల ఫలోదకముల పంచామృతాల
అభిషేకములు నిక్కముగ నీకు కావాలా…?
ఆర్తి తోడ నిను వేడుచుండ..
మది తన్మయత్వమున ఉద్భవించి.,
కంటి వాలుగ జాలువారి నీ పదములు ముద్దాడు
కన్నీటి బిందువొక్కటి చాలదా…!!

నిద్ర మాని రేయంతా..
జాగారము సేయాలా.?
“శివా, శంకరా”అనుచు
నిండు మనసార
ఒకమారు నిన్ను తలచిన చాలుగా…
నీ మనసు కరిగి నాపైన కరుణను జూపగా..!!

నీ ప్రతిరూపమగు నా ఆత్మారాముని క్షోభ పెడుతూ
కఠిక ఉపవాసము నీకై చేయాలా..?
నీ పద సన్నిధి జేరి నీ మధుర నామ జపము జేయుచు
నన్ను నీకు అర్పించుకొనుచూ,
ఆత్మనివేదన చేయుట కాదా,
నీవు కోరేటి నిజమగు ఉపవాసపు ఆంతర్యము..!!

నీ నిండైన రూపమును
వీక్షింపగా పరితపించు
నా నయనద్వయములే
నేను భక్తి తోడ సమర్పించు
నీకు ప్రియమగు
మారేడు దళములు

హర హర మహాదేవయనుచు
భక్తి భావమున ఘోషించుచూ
నీకు వశమైన నా మనసు…
నిండుగా నేనర్పించగలుగు..
ఏ ఎంగిలంటని మహా నివేదన
స్వీకరించి నను తరింపజేయరా..!

“నమః శివాయ” అని భక్తితోడ వల్లించుచూ,
నా పెదవంచుల పూయించిన పరమపావనమగు
నీ పంచాక్షర నామజపములే…
నీ దివ్య పాద పద్మములను
అలంకరించి పూజింపగ పోగేసుకున్న
ఏ కొమ్మకు పూయని మందార సుమగంధాలు…!

You May Also Like

One thought on “శివార్పణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!