శునకాయణం

శునకాయణం

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: మహాలక్ష్మి రావిరేల (కొప్పరపు )

కనకపు సింహాసనమున
శునకముకూర్చుండబెట్ట
శుభలగ్నమునన్
దొనరగ బట్టము కట్టిన
వెనకటి గుణమేల మాను
వినురా సుమతీ..!
అని సుమతి శతకంలో బద్దెన గారు చెప్పినట్టు. నేను ఈ సునకాయణం అనే వ్యాసం రాస్తున్నాను. ఇప్పుడు నిజంగానే శునకాలకు మహర్జాతకం పట్టింది. వాటికి జరుగుతున్న రాజభోగం, మనుషులకు కూడా జరగడం లేదు. కానీ వాటి గుణాన్ని మనుకున్నయో లేదో మాత్రం తెలియదు. ఎందుకంటె నేను కుక్కను పెంచుకోలేదు కాబట్టి. అన్నట్లు శునకము అంటే గుర్తుకు వచ్చింది. ఈ సునకరాజులకు చాలా చరిత్రే ఉంది. మచ్చుకు ఒకటి తెలుసుకుందాం. శ్రీరామచంద్రుడు పరిపాలన చేసే కాలంలో ధర్మo సక్రమంగా నిర్వర్తించడానికి వీలుగా ధర్మగంట ఏర్పాటు చేశారు. ఏ సమయంలోనైనా ధర్మగంట మ్రోగిస్తే శ్రీరామచంద్రులవారు ఎవరికి అన్యాయం జరిగినా సత్వరమే న్యాయ పరిపాలన చేస్తారు. ఒక రోజున ఒక కుక్క ధర్మగంట తాడును నోటితో పట్టుకొని లాగడం వలన ధర్మ గంట మ్రోగింది. ధర్మ పరిపాలన దక్షుడు అయిన శ్రీ రామచంద్ర ప్రభువు. “నీకు జరిగిన అన్యాయం ఏమిటి?” అని కుక్కను అడిగారు. అప్పుడు కుక్క ఈ విధంగా చెప్పింది.
“ప్రభూ నేను నిద్రపోతున్న సమయములో మా ఇంటి యజమాని ఎక్కువగా దగ్గుతూ ఉండటం వలన నాకు నిద్ర పట్టడం లేదు మీరే న్యాయం చేయాలి” అంటుంది. వెంటనే యజమానిని పిలిపించారు. యజమాని, తనకు దగ్గు వస్తుందన్నమాట నిజమేనని ఒప్పుకుంటాడు. కుక్కకు నిద్రా భంగం కలిగించినందుకు యజమానికి ఏ విధమైన శిక్ష వేయమంటావు? అని కుక్కను రాములవారు   అడుగగా..దేవాలయానికి ధర్మకర్తగా నియమించండి అంటుంది.
“ఏమిటి..? ఎంతో పుణ్యం చేసుకుంటే కదా! దేవాలయానికి ధర్మకర్తగా అవకాశం దొరుకుతుంది. అది శిక్ష ఎలా అవుతుంది!” అని అడుగుతారు. అందుకు కుక్క  ఈవిధంగా చెబుతుంది. “పూర్వ జన్మలో నేను దేవాలయం ధర్మకర్తగా ఉండి. ధర్మకార్యాలు చేయకపోగా స్వామివారి కైంకర్యానికి వాడవలసిన డబ్బును, విలాసాలకు విచ్చలవిడిగా వాడుకుని గుడి అభివృద్ధి చేయకపోగా అర్చకులకు జీత భత్యాలు కూడా ఇవ్వకుండా. గుడి మాన్యాలకు సంబంధించిన లెక్కలన్నింటిని తారుమారు చేసి, ఆ డబ్బులను వడ్డీ వ్యాపారంలో వినియోగించి. ఇంకా ఇంకా ధనాన్ని సంపాదించి. చివరికి ఏ ప్రయోజనం లేకుండా తనువు చాలించిన పాపాల ఫలితంగానే! ఈ జన్మలో కుక్కగా పుట్టాను. ఎండకు చలికి బాధలు అనుభవిస్తూ, ఈయన ఇంటి ముందు కాపలా కాస్తూ ఉన్నాను. కుక్క కంటె హీనమైన జన్మ లేదు (అని ఆ రోజుల్లో అనుకునేవారు) నేను పొందిన ఈ శిక్ష ఇతను కూడా పొందాలి. అని తన పూర్వ జన్మ వృత్తాంతం చెపుతుంది కుక్క. “గుడి సొమ్ము తింటే కుక్క అయిపుడతారు” కాబట్టీ ధర్మ నిరతి తప్పిన వాళ్ళకు కుక్క జన్మ తప్పదు. అని కదా నీతి. శ్రీ రాముని కాలంలో కుక్కలు కూడా ధర్మం చెప్పగలవు. అందుకే అది రామరాజ్యం.
మరి ఈ కలి కాలంలో గుడినే పడ గొట్టేస్తున్నరు వాళ్లకేం శిక్షలు పడ్డాయి? రోడ్డుపై తిరిగే ఊరకుక్కలు ఈ కోవకు చెందినవే అనుకుంటా! త్రేతాయుగం లో కుక్క జన్మ హీనం. కానీ కలికాలంలో కుక్క బ్రతుకే బ్రతుకు. దాని దర్జానే వేరు, కాని గుడిని, గుడిలో లింగాన్ని మింగిన వాళ్ళు మాత్రం ఈ కుక్కలు కారండి. వారికి వేరే శిక్ష అపరిచితుడు వేస్తాడు. పెడిగ్రీ తినే కుక్క కూడా మంచి పుణ్యం చేసుకునే పుట్టి వుంటుంది. అదండీ మన శునకాయణం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!