స్వేచ్ఛ

స్వేచ్ఛ

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శారద కెంచం

స్వేచ్ఛగా జీవించాలని అనుకోవడంలో తప్పులేదు. కానీ పుట్టిన ప్రతివ్యక్తి తనకు తానుగా నడవడం, పరిగెత్తడం, తినడం, మాట్లాడడం ఏమీ నేర్చుకోలేడు. అన్ని విషయాల్లో అమ్మపైనో, నాన్నపైనో, తోబుట్టువులపైనో ఆధారపడతాడు. అంత మాత్రం చేత, ఆ పిల్లవాడు సంకెళ్ళలో ఉన్నట్టు కాదుకదా.!
పెరిగి పెద్దయ్యాక మాత్రం వారి సలహా ఎందుకు భారామనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా వారికి నచ్చినట్లే నడుచుకోవాలి అని నేను చెప్పడం లేదు. అలాంటి పరిస్థతి ఎదురైనప్పుడు, మీ పెద్దవారికి మీ అభిప్రాయాన్ని స్పష్టంగా అర్థమయ్యేలా వివరించి చెప్పండి అనేదే నా ఉద్దేశ్యం. వారిని ఒప్పించే ప్రయత్నం చేయండి. అలాగే వారి నిర్ణయాన్ని కూడా ఒక్కసారి బేరీజు వేసుకుని ఆ తర్వాత ఒక మంచి నిర్ణయానికి రండి.  అంతేగానీ ఇది నా జీవితం. నచ్చినట్లు జీవించే హక్కు నాకుంది అననడం ఏమాత్రం సబబు కాదు. ఒకటి చెబుతాను గుర్తుంచుకోండి. అమ్మా, నాన్నలు ఎప్పటికీ మీ మేలునే కోరుకుంటారు. మీ భవిష్యత్ పై వారికి ఎన్నో అంచనాలుంటాయి. వాటిని నెరవేర్చుకునే ప్రయత్నంలో వారు కొన్నిసార్లు మీపై అజమాయిషీ చూపించి ఉండవచ్చు. అందులో వారి ఉద్దేశ్యం మాత్రం మీకు మంచి భవిష్యత్ ఇవ్వటమే అయుంటుంది తప్ప మీకు స్వేచ్ఛని దూరం చేసే ఆలోచన మాత్రం కాదు.
ఉదాహరణకు:
మీకు బాగా నచ్చిన ఒక ఆటనే తీసుకోండి. అందులో కూడా మీరు నియమ, నిబంధనలకు కట్టుబడే కదా ఆడాలి. అప్పుడే ఆ ఆట కూడా రసవత్తరంగా సాగుతుంది. అంతేగానీ ఇది నా ఆట, నా ఇష్టం వచ్చినట్లు ఆడతానని అనలేము కదా! అలాగే మన జీవితం కూడా సరైన కట్టుబాటు ఉన్నప్పుడే సఫలం అవుతుంది. పూర్వం మనం బ్రిటీష్ వారి పాలనలో ఎన్నో హింసలకు గురి అయ్యాము, ఎన్నో అవమానాలను సహించాము. అందుకే స్వాతంత్య్రాన్ని కోరుకున్నాం. కానీ ఇదే ఫార్ములాని ప్రతిచోటా అనుసరించాలి అని అనుకుంటే ఎలా? ఆడది అర్ధరాత్రి కూడా స్వతంత్రంగా వీధుల్లో తిరగ గలిగే స్వేచ్ఛ కోరుకుంటున్నాం కరెక్టే. కానీ దానికంటే ముందు అటువంటి సమాజాన్ని నిర్మించుకోవాలి.  అటువంటి సమాజం నిర్మించ బడాలంటే కుటుంబ వ్యవస్థ బాగుండాలి. కుటుంబాలు బాగుండాలంటే ఖచ్చితంగా యాజమాన్యం బాగుండాలి. అందుకే ఆ యాజమాన్య హోదాలో ఉన్న మీ తల్లిదండ్రులు మీకు ఖచ్చతంగా క్రమశిక్షణను అలవరచుకునేలా చేయాలి. మరి అదే కదా వాళ్ళు చేస్తున్నది. ఇంకో విషయం కూడా నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. అది ఏమిటంటే మితిమీరిన స్వేచ్ఛ ఎవ్వరూ హర్షించరు. అది ఎప్పటికైనా మనకు, మన సమాజానికి చాలా నష్టాన్ని కలిగిస్తుంది.
“ఎందరో సంఘసంస్కర్తలు సతీ సహగమనం, బాల్యవివాహాలు లాంటి మూఢాచారాల నుండి మనకు ఎంతో స్వేచ్ఛను కల్పించారు. బాలురతో పాటుగా బాలికలు కూడా బాగా చదువుకునేలాగా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అందుకే ఫ్రెండ్స్ మీరు స్వేచ్ఛ అనే పదానికి సరైన అర్థం తెలుసుకుని నడుచుకోండి. అమ్మా, నాన్నలతో స్వేచ్చగా మీ అభిప్రాయాలను వ్యక్తం చేయండి. వారిని కూడా అంతే స్వేచ్చగా వారి అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం కల్పించండి. ఎందుకంటే తల్లిదండ్రులే మీ తొలి గురువులు. మీ శ్రేయోభిలాషులు. ఇది ఎప్పటికీ మరచి పోకండి.  సరైన మార్గాన్ని ఎంచుకుని మీ జీవితాలని స్వేచ్ఛగా జీవించండి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!