“తెలంగాణ ఉత్తమ కథా రచయిత్రి” నెల్లుట్ల సునీత

“తెలంగాణ ఉత్తమ కథా రచయిత్రి” నెల్లుట్ల సునీత

-బూర్గు గోపికృష్ణ

తెలంగాణ ప్రజల ఆచార వ్యవహారాలను సంస్కృతి సాంప్రదాయాలను తమ కథలలో విశిష్టంగా చూపుతూ.. విలక్షణంగా మలిచారు నెల్లుట్ల సునీత గారు.

వాడుకభాషలో నిత్యం మనం వాడే పదాల చేరికతో తెలుగు భాష తన సొగసును కోల్పోతుందని ఆవేదన చెందుతుంది, అందుకే గ్రామీణ జీవిత అంశాలను కథలుగా మలిచి కొత్త కోణంలో ఆలోచింపజేసే విధంగా కథలను రచించారు రచయిత.
తెలంగాణ జనజీవిత పరిస్థితులు ఆమె కథ, కావ్యాల్లో ప్రతిఫలిస్తాయి. కథలలోని పాత చిత్రాలు వర్ణచిత్రాలేస్తుంది. రచయిత భావాలకు అనుగుణంగా రచనలో తీసుకున్న కథా వస్తువు, కథలో దాగి ఉన్న అంశాలు, పాత్ర చిత్రీకరణ అన్ని అద్భుతంగా తీర్చి దిద్దారు రచయిత్రి నెల్లుట్ల సునీత గారు.
మాతృత్వం కథలో ప్రధాన పాత్రకు.. బాల్య స్మృతులు తలచుకోవడం గురించి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. కథ ఘాడత, అర్థవంతమైన పదజాలం పాఠకలోకానికి ప్రేరణ ఇచ్చే విధంగా మలిచారు.
ఆధునిక కథా సాహిత్యంలో శీర్షికకు ప్రముఖ ప్రాధాన్యం ఉంది. శీర్షిక చదవగానే కథల పట్ల అవగాహన, కొంత అభిప్రాయం ఏర్పడుతుంది. కథలో శీర్షికకు ఇంత ప్రాధాన్యం ఉంది కాబట్టి రచయితలు ‘కథంతా రాయటం ఒకెత్తు.. కథకు శీర్షిక పెట్టడం ఒక ఎత్తు’ అని అంటుంటారు.

సింహం గర్వభంగం:
ఈ చందమామ నీతికథలో, ఒకఅడవిలో రాజు సింహం. సాటి జంతువుల గురించి వాటి బాధను వివరిస్తూ చిత్రాలతో ఈ కథ కనిపిస్తుంది.
ప్రాణం విలువ తెలుపుతూ మృగరాజుకి బుద్ది చెప్పే ఈ కథలో, కథా పరిధి చిన్నది సంఘటన యొక్క బలం చాలా ప్రభావితం చేసేలా ఉంది.

వికసించిన కుసుమం:
కథలో ప్రస్తుత విద్య విధానం, అక్షరాస్యత సమాజ బాధ్యత గుర్తు చేస్తూ
సాగినటువంటి ఈ వికసించిన కుసుమం కథ పూర్తిగా తెలంగాణ యాస భాషతో సాగింది.
ప్రభుత్వ పథకాలు తెలుసుకోలేని పేదవారు ఏమి కోల్పోతారు, తెలుసుకున్న
తర్వాత ఎలా బాగు పడతారు, వారికి తెలియ చెప్పాల్సిన అవసరం సమాజం మీద ఎంతో ఉంది అని.. అది అందరి బాధ్యత అని గుర్తు చేశారు. అందుకే కథ ఎత్తుగడ ముగింపులో వైవిద్యాలు కనిపిస్తాయి.

వలస బతుకు:
కథలో వ్యవసాయమే జీవనాధారంగా బ్రతుకుతున్న ప్రాంతంలో కరువు ఏర్పడినప్పుడు, ఉపాధి లేక వలస వెళ్లి ఎదుర్కొంటున్న సమస్యలు.. కుటుంబ నేపథ్యం, పేదరికం గురించి ప్రస్తావిస్తూ, ఈ కథ ద్వారా పల్లెలో నివసించేవారి జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఈ కథ పల్లె జీవితాలకు భరోసా కల్పించే విధంగా ఉంటుంది.

మానవీయ విలువలు:
ఈ కథలో నేటి ఆధునిక యుగంలో స్వార్థం పెరిగిపోయి, సమాజంలో ఒకరికొకరు అవసరాలు తీర్చుకునే.. మానవత్వం కరువైన మనుషుల పాత్రలను చిత్రీకరిస్తూ నాగరికతకు దూరంగా ఉన్నా.. గిరిజనులలో సమైక్యతా భావాన్ని స్వార్థం లేని మనుషులగా వారు ఒకరికొకరు సహాయం చేసుకునే కల్మషం లేని మానవీయ విలువల్ని మంచి పాత్ర పోషణతో పలికిస్తూ సాగినటువంటి సమాజ తీరు తెన్నులను వివరిస్తూ.. కథ ఎంతో ప్రేరణతో సాగింది.

ఆత్మీయ బహుమతి:
కథలో పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమాజంలో సమస్యలను వివరిస్తూ నైతిక విలువలను నేర్పిస్తూ, జీవన నైపుణ్యాలను పిల్లలకు ప్రతి తల్లిదండ్రులు పుట్టినరోజు ఆత్మీయ బహుమతిగా అందించడమే లక్ష్యంగా సాగాలని మంచి సందేశం ఇచ్చారు.

పుడమి పుత్రుడు:
కథలో రైతన్నలు ఎదుర్కొనే సమస్యలు, రైతు కుటుంబ జీవన నేపథ్యం, పేదరికం, కరవు రక్కసి కాటేసినప్పుడు పంటలు పండక.. పాల వ్యాపారం చేసినా కష్టాలు తీరక, అప్పులు చేసి తీర్చలేక గుప్పెడు మెతుకులు కరువై.. పిల్లల పోషణ చేయలేక, ఆడపిల్లల పెళ్లి చేయలేని నిస్సహాయ తండ్రిగా.., పురుగుల మందులు తాగి ఆత్మహత్య చేసుకుందామనుకున్న నేపథ్యంలో అనుకోకుండా వర్షాలు పడి…
పంటలు పండి రుణమాఫీలు చేతికి అంది, రైతుబంధు పథకాలతో, రాష్ట్ర ప్రభుత్వము అందించిన ఆర్థిక సహాయంతో ఒక ఇల్లు నిర్మించుకుని, అమ్మాయి పెళ్లి చేసుకుని అప్పులన్నీ తీర్చి, ఉన్నత చదువులకు పంపించిన ముగింపు ఈ కథలో బావుంది. భూమిని నమ్మిన వారు ఎవరు కూడా దురదృష్టవంతులు కారు అని నిగూఢమైన సందేశం అందించిన కథ ఇది.

మాతృత్వం:
కథలో కన్నతల్లి అయినా, పెంపుడు తల్లి అయినా అమ్మ ప్రేమ సాటిలేనిది అని అనాథాశ్రయంలో తల్లిదండ్రులను వదిలేస్తున్న తనయులున్న నేటి సమాజానికి కనువిప్పు కలిగించిన కథ ఇది. ఆశ్రమం నుంచి ఒక అనాధను దత్తత తీసుకొని అల్లారుముద్దుగా పెంచుకుని పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మని అదే అనాథాశ్రమానికి పంపించి మలుపు తిప్పి పాఠకులు.. తర్వాత ఏం జరుగుతుందో అని ఊహకందని విధంగా మలిచారు రచయిత. కథ అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుంది.

ముందుచూపు:
కథలో.. సగటు కుటుంబంలో పెరిగిన ఒక అమ్మాయి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి తన కాళ్ళపై తాను నిలబడుతూ, సామాజిక సమస్యలకు ఎదురొడ్డి, తన సమస్యలను తానే పరిష్కరించుకునే విధంగా ఈనాటి ఆడపిల్లలకు ఒక సెల్ఫ్ డిఫెన్స్ కోర్సు ఎంత అవసరమో
తెలియజేసినటువంటి కథ. ఇది మొత్తం కూడా స్త్రీవాద కథగా సమకాలీన సమస్యలను పొందు పరుస్తూ పాత్రలను తీర్చి దిద్దారు. ఇది ఓల్గా కథలను పోలి ఉంది.

ఇలా కొన్ని కథలు తీసుకొని హైదరాబాదులో కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు చెప్పడం జరిగింది.
సండే వార్త మ్యాగజైన్లో ప్రచురితమైనటువంటి కథ పాఠకలోక
ఆదరాభిమానాలు పొందింది. మునుముందు మీ సాహిత్య ప్రస్థానంలో మరెన్నో కవిత కథలు వెలువడాలని కోరుకుంటూ… అభినందనలతో…

బూర్గు గోపికృష్ణ
-7995892410

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!