తెన్నేటి వారి తీయనైన మాట

తెన్నేటి వారి తీయనైన మాట
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

   నలభై ఆరేళ్ళ క్రిందట నేను ఎం.ఎస్.సి పాసై లెక్చరర్ గా కళాశాలలో చేరి దసరా సెలవులకి మా ఊరు అనకాపల్లి వచ్చాను. నాన్నగారు అన్నపూర్ణయ్య పంతులు గారు ప్రముఖ స్వాతంత్ర్య సుమరయోధులు. పట్టణ దివ్యజ్ఞాసమాజ గౌరవ అధ్యక్షులు. అప్పటికే ఆయనికి డెబ్భై ఏళ్ళ వయస్సు. ప్రతి సంవత్సరం అడయారు ప్రపంచ దివ్యజ్ఞా సమాజ సభలకు వెళ్ళేవారు.
ప్రతి ఆదివారం శారదా నది దగ్గర ఉన్న దివ్యజ్ఞాన సమాజంలో సభ్యులు కలసి పూజ, హిందూమత విశిష్టత గురించి భారత రామాయణ, ఉపనిషత్తులు గురించియే గాక సర్వమత సారం ఒకటే అని ముస్లిం, క్రిస్టియన్ లు కూడా వచ్చి మానవత్వమే ముఖ్యం, మతం కాదు అని తెన్నేటి, అయ్యంకి, అంతర్జాతీయ అధ్యక్షుడు జాన్ బి.కోట్స్ రాధా బర్నియర్, మౌలానా షరీఫ్ మున్నగు ఎందరో మహానుభావులు ప్రసంగించేవారు.
వజ్రోత్సవవేళ అనకాపల్లిలో అంతర్జాతీయ అధ్యక్షులు అమెరికా నుంచి జాన్ బి కోట్స్, మద్రాస్ నుంచి రాధాబర్నియర్, దక్షిణప్రాంత కార్యదర్శి అవసరాల రామారావు, వ్యవస్థాపకులు పెంటకోట శ్రీరాములునాయుడు గారు సుమారు వెయ్యిమందికి పైగా దేశ రాష్ట్రలనుంచి సభ్యులు వచ్చారు. మూడు రోజులపాటు 1978 లో జరిగిన వార్షికోత్సవ సభలలో దేశభక్తులు, నిస్వార్ధ రాజకీయ నాయకులు పూర్వ ఆర్ధిక మంత్రి స్వాతంత్ర్య సమరయోధులు తెన్నేటి విశ్వనాథం పంతులు గారు వక్తగా రావటం వారు మా ఇంట్లోనే ఉండటం వారి బాధ్యత నాన్నగారు నాపై పెట్టారు.
మా ఇంటికి సభలకి 20 నిమిషాల నడక. తెన్నేటి వారిని తీసుకెళ్ళడానికి రిక్షాని పిలిచాను. అప్పుడు ఆటోలు లేవు. ప్రయాణ సాధనం రిక్షాయే.. రిక్షా గుమ్మం ముందుకి వచ్చింది. తెన్నేటి విశ్వనాథం పంతులు గారు ఇంట్లోంచి వచ్చి రిక్షాఅతనికి రూపాయి ఇచ్చి ( అప్పట్లో ఏభై పైసలే) వెళ్ళిపో అనడం నాకాశ్చర్యం కలిగించింది. వెంటనే వారు నాతో అన్నమాట ఇప్పటికీ మరువలేని మధుర జ్ఞాపకం. వారన్నది ఒక మనిషి కూర్చుంటే వానిని సాటి మనిషి తీసుకెళ్ళడం ఏమి సబబు అందుకే నేనెప్పుడు రిక్షా ఎక్కను పద కాలాతీతం అవుతున్నది అని మీ నాన్నగారు అందరు ఎదురుచూస్తుంటారు. ఇంకా అరగంట కాలం ఉంది అని డెబ్భై ఆరేళ్ళ వయస్సులో అతను నా భుజం పై చెయ్యివేసి నడుచుకుంటు చెప్పిన విషయాలు మరచిపోలేని మధుర జ్ఞాపకాలే. అటువంటి మహనీయుల సాంగత్యం నా పూర్వజన్మ సుకృతం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!