వీరయ్య బడ్డీ

వీరయ్య బడ్డీ

రచయిత:: పి. వి యన్. కృష్ణవేణి

అమ్మగారూ బడ్డీ కొట్టు ఈరయ్యకు కరోనా పాజిటివ్ వచ్చిందంట అమ్మ, ఆ యాన్లో డాట్టర్ బాబులు వచ్చి, ఆడ్ని ఎక్కించుకుని పోనారు. ఎప్పటికి తిరిగి వస్తాడో తెన్వదు అని చెప్పుకొచ్చింది రత్తాలు.

వామ్మో, రోజూ మీ అయ్యగారు ఆడనే కదే పాల ప్యాకెట్ తెచ్చేది అన్నాను.

రత్తాలు: ప్యాకెట్ నీటిలో కడిగేత్తారుగా అమ్మ.

నేను: ప్యాకెట్ అయితే నీళ్ళతో కడిగాను. కానీ, చిల్లర డబ్బులు ఎన్ని చేతులు మారాయో, ఎన్ని శానిటైజ్ర్లు పూసారో అయినా ఈ రొగాలేంటో, ఎప్పటిలాగా ఎప్పుడు బతుకుతామో!!!

శ్రావ్యా, కొంచెం టీ పెట్టి ఇవ్వు, ఆఫీసుకు టైం అవుతోంది. ఇంట్లోంచి శ్రీవారి పిలుపు.

నేను: హా వస్తున్నాను. అరెరే టీ పొడి కొంచెమే ఉంది. వీరయ్య కూడా లేడు. వచ్చేటపుడు గుర్తుంచుకుని టీ పొడి తీసుకు రండి. ఇంకా సరుకులు ఎమైనా కావాలంటే ఫోన్ చేసి చెప్తాను.

శ్రీకర్: సరే, ఫోన్ చెయ్యి అంటూ టిఫెన్ తినేసి వెళ్లిపోయాడు.

రత్తాలు: జాగరత్తగా ఉండండి అమ్మా, నేను ఎల్తున్నానూ అని పక్కన జ్యోతి వాళ్ళ ఇంటికి పనికి వెళ్ళింది.

అమ్మగారు వీధి చివర చిల్లర కొట్టు ఈరయ్యకు కరోనా అంట. మీరైతే ఆ కొట్టు కాడికి పోరు గానీ శ్రావ్యమ్మ గారు కంగారడిపోతున్నారు అని చెప్పడం నాకు వినబడుతుంది.

చేతల్లో తప్పులు కంటే, మాటల్లో మాయలు నన్ను కలవరపెట్టాయి. ఆవిరి పెడుతూ, వేడి నీళ్ళు తాగుతూ, మల్టీ విటమిను ట్యాబ్లెట్లు వేస్తూ, శరీరానికి తగిన వ్యాయామం చేయడం తప్ప మనం చెయ్యగలిగింది ఏమి లేదు అనుకుంటూ నా పనిలో నేను పడ్డాను.

మరునాడు ఉదయం ఆరు గంటలు. రత్తాలు ఎంట్రీతో రోజు మొదలైంది.

రత్తాలు : అమ్మ గారూ, ఈరిగాడి దగ్గర సరుకులు కొన్నవాళ్ళలో సగానికి పైగా కరోనా వచ్చేసిందంట.

నాకు గుండెల్లో రాయి పడింది.

రత్తాలు: అవును అమ్మ గారు. తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకుండా డబ్బులు కోసం పని చేస్తే ఇలానే ఉంటది సరుకులు కూడా నాణ్యమైనవి కావంట. చేసిన పాపం ఊరికే పోతుందా చివరకు ప్రాణానికి ముప్పు అంటింది.

నేను : ఊరుకో రత్తాలు వీరయ్య ఏమైనా ఈనాటి మనిషా!!! ఎప్పటి నుంచో పెట్టుకున్నాడు కొట్టు. టైం బాలేదని ఏదో మాట్లాడడం సబబు కాదు అంటూ కసిరాను.

ముఖం ముడుచుకుని వెళ్లి పోయింది. మళ్లీ గోడకు కొట్టిన బంతిలా వెనక్కు వచ్చింది.

ఏమిటి అని అడిగితే, జ్యోతి గారు వాళ్ళ ఆయన, రమేష్ గారికి వారం నుంచీ కరోనా అంట అమ్మ. మాములు జొరమే అని మాట దాటేస్తున్నారు. అంటూ చెప్పుకుంటూ పోతుంది.

నేను : మెరుపులాంటి ఆలోచనతో ఉరుకులంటి పరుగు ఇంట్లోకి పెట్టి, బీరువాలో నుంచి డబ్బు తెచ్చాను.

ఇదిగో రత్తాలు, నీ జీతం. రేపటి నుంచి రావద్దులే రత్తాలు. మళ్లీ నేనే ఫోన్ చేసి చెప్తాను. అప్పుడు వద్దువుగాని. నువ్వు కూడా ఇంటి పట్టున జాగ్రత్తగా ఉండు.శరీర ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం అని నాకు బాగా అర్థం అయ్యింది.అసలు విషయం ఏమిటంటే, వీరయ్యకు వాంతులు అవుతుంటే గ్యాస్ట్రో సర్జిన్ దగ్గర చూపించాటానికి తీసుకు వెళ్ళాము. ఈ రోజుకి పాలు దొరకవు అంటూ ఫోన్ చేసి చెప్పింది వీరయ్య భార్య సుమతి. రేపటినుంచీ షాప్ యధాతథంగా కొనసాగిస్తారుట. ఇంక రమేష్ కి అయితే తను ముందుగానే జాగ్రత్తలు తీసుకుని, హోమ్ క్వారెంటైన్లొ ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదురుగా ఉంది. అందుకే నిజాలు తెలుసుకోవాలి, అపోహల్లో ఉండద్దు అంటారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!