చేరువైనా... దూరమైనా…
రచన:పిల్లి.హజరత్తయ్య
ఆప్యాయత ,అనురాగాలు లేనిచోట
బంధాలు వెతకడమంటే
ఎండమావుల్లో నీటి చెమ్మకై
అన్వేషించడం లాంటిది
‘ఎవరికి వారే యమునాతీరే’
అన్నట్లు ఉండే బంధువులు
చేరువైనా ఫలితం గుండు సున్నేగా!
‘నొప్పింపక తానొవ్వక’
నడిచే బంధాలకు
దూరమైనా హృదయానికి చేరువేగా!
ఆత్మీయ పలకరింపు అనేది
దప్పిక తీర్చే చల్లని మంచినీరు వంటిది
మనుషులు దూరంగా ఉన్నా
మనసులు దగ్గరగానే ఉంటవి
‘యూజ్ అండ్ త్రో’, ‘టేకిట్ ఈజీ పాలసీ’
వంటి సంబంధాలు ఉన్నచోట
మానవ బంధాలు ఎలా మెరుస్తాయి?
ఒకరినొకరు అర్థం చేసుకున్న చోట
దూరమైనా, చేరువైనా
మానవత్వం వెల్లివిరుస్తుంది
పరస్పర విశ్వాసమే పునాదిగా
విలువల గుడి నిర్మిస్తే దూరమైనా చల్లని ఆత్మీయతను కురిపిస్తుంది..
***