ఉగాది పండుగ విశిష్టత

ఉగాది పండుగ విశిష్టత

చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన

సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడుతుంది.

 

*చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రధమేహని,*

*శుక్ల పక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి. *

అని పండితులు చెప్తారు.

 

ఉగస్య ఆది ఉగాది  ‘ఉగ’ అనగా నక్షత్రముల నడక అని అర్ధం.

నక్షత్రముల నడక ప్రారంభించిన అనగా

సృష్టి ఆరంభమైన కాలం యొక్క “ఆది ” యుగాది… అదే ఉగాదిగా రూపాంతరం చెందినది.

శిశిర ఋతువు లో రాలిన చెట్ల ఆకులు వసంత ఋతువులో మళ్ళీ చిగురిస్తాయి.

అలాగే మన శరీరం కూడా కొత్త చైతన్యం పొందుతుంది. ఇది ప్రకృతి ధర్మం.

ప్రకృతిలోని మార్పు మూలంగా ఉగాది నూతన సంవత్సరాదిగా పరిగణింపబడుతుంది

కాబట్టి ఇది తెలుగువారి తొలి పండుగ.

 

ఉగాది పచ్చడి:

ఉగాది ప్రత్యేకత వేపపువ్వుపచ్చడి.

అప్పుడే చిగురు వేసిన వేపపువ్వు,

కొత్త మామిడికాయ, కొత్త బెల్లం, మిరియాల కారం, కొత్త చింతపండు, ఉప్పూ

ఈ ఆరు రకాల పదార్థాలు ఉగాది పచ్చడిలో వాడతారు. 

షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. 

వీటిలో తీపి బెల్లం శుభానికి ప్రతీక

వేపపువ్వు చేదు చేదు లేదా చెడుకి ప్రతీక

మామిడికాయ వగరు, చింతపండు పులుపు

ఉప్పు, కారం కోసం మిరియాల పొడిని వాడతారు.

 

జీవితంలో ప్రత్యేకంగా సంవత్సరంలో వచ్చే మంచి చెడులు, లాభనష్టాలను, కష్టసుఖాలను

ఒకేలాగా గ్రహించాలి అన్న సందేశంతో ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి తయారు చేస్తారు. 

ఉగాది రోజున ఉదయాన్నే తలంటు స్నానం చేసి మడిగా పూజ చేసి, పచ్చడి చేసి..

పరగడుపున అల్పాహారంగా తీసుకుంటారు.

ఉగాది పచ్చడి .. ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని,

ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెబుతుంది.  

 

ఇక ఈరోజు మరొక ముఖ్యమైన అంశం పంచాంగ శ్రవణం.

చాంద్రమానం ప్రకారం చంద్రుడు చిత్త నక్షత్రంలో ప్రవేశించినపుడు చైత్ర మాసం వస్తుంది.

చైత్ర మాసం సంవత్సర ఆరంభం కాబట్టి,

ఆ సంవ్సరమంతా ఉండే గ్రహ గతులు, 27 నక్షత్రాల గమనాలు గురించీ,

వాటి యొక్క రాశి ఫలాల గురించీ వినటం జరుగుతుంది. 

కాలుక్యులేటర్లు, కంప్యూటర్లు రాక ముందే మన పూర్వీకులు గ్రహ గతుల్ని,

వాటి గమనాల్ని లెక్కించగలిగారు. వాటిని మన జీవితానికి అనుగుణంగా మలచగలిగారు. 

 

ఈ సంవత్సరం “ప్లవ” అంటే మార్పును తెచ్చేది అని అర్ధం.

శార్వరి నామ సంవత్సరంలో కలిగిన చెడుని,

ఏర్పడిన నష్టాన్ని ప్లవ నామ సంవత్సరం నిర్మూలించి,

కొత్త ఆశలను ఇస్తుంది అని మనమందరం కోరుకుందాం.

 

ఆంధ్ర, కర్ణాటకల్లో “ఉగాది” నూతన సంవత్సరాది అయితే మహారాష్ట్రలో “గుడిపాడ్వా” పేరుతో,

తమిళులు “పుత్తాండు” అనే పేరుతో,

మలయాళీలు “విషు” అనే పేరుతోను,

సిక్కులు “వైశాఖీ” గానూ, బెంగాలీలు “పొయ్‌లా బైశాఖ్” గానూ జరుపుకుంటారు. 

మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు 

రచన: పరిమళ కళ్యాణ్

You May Also Like

One thought on “ఉగాది పండుగ విశిష్టత

  1. చాలా బాగా చెప్పావు చెల్లి👌👌👏👏😊🌹🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!