ఆ మౌనం వెనకాల

(అంశం. :”ఆ చీకటి వెనకాల”)

ఆ మౌనం వెనకాల

రచయిత :: గుడిపూడి రాధికారాణి

ఎప్పటిలాగే నిశ్శబ్దంగా ఉంది లైబ్రరీ హాల్. పెద్ద పెద్ద బల్లల ముందు నారింజపండు రంగు కుర్చీల్లో కూర్చుని మౌనంగా చదువుతున్నారంతా.కొందరు ఆ బుక్స్ లో కొన్ని పాయింట్స్ తాము తెచ్చుకున్న నోట్స్ లో వ్రాసుకుంటున్నారు. రోజూలాగే ప్రభాకర్ కూర్చుని వీక్లీలు,మంత్లీలు చదువుతున్నాడు. ఎందుకో తలతిప్పి చూస్తే అందరిలోనూ ప్రత్యేకంగా కనబడ్డాడతను. యాభయ్యేళ్ళుండొచ్చు. ఎందుకు స్పెషల్ గా కనబడ్డాడా అనే ప్రశ్నకు వెంటనే జవాబు దొరికేసింది. అతనందర్లా పుస్తకాలు చదవట్లేదు. ఎటో చూస్తూ కూర్చుని ఉన్నాడంతే.
మరెందుకు లైబ్రరీకొచ్చినట్లు?చదువుతున్న కథ కంటే ఈ ప్రశ్న ఆసక్తికరంగా అనిపించడంతో ప్రభాకర్ ఆ వ్యక్తిని ఒక కంట పరిశీలించసాగాడు. గంట సమయం గడిచింది.అతను అలాగే భయపెట్టే శూన్యంలా,గడ్డకట్టిన మౌనంలా కదలకుండా కూర్చున్నాడు. చూపు ఎటో ఉన్నప్పటికీ దృష్టి చూస్తున్న దానిపై లేదనేది నిర్వివాదాంశం. గంట తర్వాత ఆయన లేచి వెళ్ళిపోయాడు.

రోజూ ఇదే తంతు. ఎందుకు చదవడో తెలీదు.మరెందుకొస్తాడో తెలీదు. ప్రభాకర్ కి ఇంట్రెస్ట్ పెరగసాగింది. రకరకాల ఆలోచనలు,ఊహలు,అంచనాలు.. ఒకవేళ గయ్యాళి పెళ్ళామేమో..ఓ గంటన్నా ఊపిరి పీల్చుకుందామనొస్తున్నట్లున్నాడు..ఈ ఊహకి నవ్వు.. ఒకవేళ ఇల్లంతా మోతగా ఉంటుందేమో..పిల్లల అల్లరో చెవిటి తండ్రి పెంచే టీవీ వాల్యూమో ..కాస్త ఊపిరి పీల్చుకుందామని సాయంత్రమో గంట ఇలా..ఈ ఊహకి జాలి.. ఒకవేళ అప్పులు తీర్చలేక..దిగులుతో రిలీఫ్ కోసం.. ఇలా రోజుకో అనుమానం..అగ్గిరవ్వలా కాల్చేస్తుంటే ఇక లాభం లేదు.. పరిచయం చేస్కుని వివరాలు తెలుసుకుందాం. అని నిశ్చయించుకున్నాక తేలికపడ్డాడు ప్రభాకర్.
ఆరోజు ఆయన లేవగానే తనూ లేచి బయటకు నడిచాడు.బైక్ స్టార్ట్ చేస్తున్న అతడిని చూసి పలకరింపుగా నవ్వాడు.
బదులుగా తనను చేరింది చిరునవ్వేనా? అసలు ఆ పెదవులు విచ్చుకున్నాయా? కళ్ళు పలకరింపుని స్వీకరించాయా? తేల్చుకోలేని ప్రభాకర్ మాట్లాడేంత ముందుకు వెళ్ళలేకపోయాడు.
మరోరోజు బైక్ స్టార్ట్ చేస్తున్న ఆయన పక్కగా తన బండిని నిలిపి ” హలో సర్! ” అన్నాడు స్నేహంగా.
ఇప్పుడు కూడా మౌనమే సమాధానం.
అయినా తగ్గకుండా ” నా పేరు ప్రభాకర్ అండి” అన్నాడు చేతిని చాపుతూ.
ఆయన ప్రభాకర్ చేతినందుకుని మృదువుగా కరచాలనం చేశాడు.
మరింత ముందుకు వెళ్ళే చొరవ తీసుకోలేకపోయాడు ప్రభాకర్.
ఇక అడిగేద్దామనుకుంటూ ఉండగా ప్రభాకర్ ఫోన్ మోగింది. చూస్తే ఫ్రెండ్ మధూగాడు. వీడిప్పుడే చెయ్యాలా? అని తిట్టుకుంటూ ఫోనెత్తిన ప్రభాకర్ అవతలి మాటలకు ఆందోళనగా గట్టిగా అరిచాడు.. అతని గొంతులో ఖంగారుకి హడావిడికి వెళ్ళబోయే ఆయన ఆగాడు.
” అదేమిటిరా! చిన్నపిల్లరా..అప్పుడే..ఇలా..అయ్యో..ఏమైందీ? వేనా? కాలేజినుండొస్తుంటేనా? అయ్యో..నేనొస్తున్నానుండు.” ప్రభాకర్ మాటలకు ఆయన భృకుటి ముడిపడింది.
ఫోన్ పెట్టేయగానే సానుభూతిగా చేతినందుకుని ” ఏమైంది?” అనడిగాడు.
ప్రభాకర్ ఏడుపు గొంతుతో ” నా ఫ్రెండ్ మధు వాళ్ళ పాప హేమంతిక యాక్సిడెంట్ అయి చనిపోయిందట సార్!” అన్నాడు.
” ఒక్కగానొక్క కూతురు.ఇంటర్ చదువుతోంది.నేనర్జంటుగా వెళ్ళాలి.” అన్నాడు బాధగా.
” ఒక్క కూతురా! ఇంటరా! ” గొణిగాడాయన.
“వేన్ గుద్దేసి చనిపోయిందా..” అన్నాడు బలహీనంగా.
ఇంతలోనే ఆయన కళ్ళు వెలిగాయి. స్వరంలో స్థాయి పెరిగింది.
“పోన్లే..హమ్మయ్య..చనిపోయింది..నీ ఫ్రెండ్ అదృష్టవంతుడు. కూతురు చచ్చిపోయింది ” అన్నాడు తేటబడిన గొంతుతో.
అంత బాధలోనూ ప్రభాకర్ విస్తుపోయాడు. ఇతనికి పిచ్చేమోననే అనుమానం కలిగింది మొదటిసారిగా. తన తొందరలో తనుండడం వల్ల తర్కించకుండా మధు కోసం వెళ్ళిపోయాడు.
అలా వెళ్ళిన వాడు పదిరోజులు వాడితోనే ఉండిపోవల్సి వచ్చింది. ఆ పనుల్లోనూ అప్పుడప్పుడు ఆ మౌన మహర్షి మాటలు గుర్తొచ్చి వింతగా తోచేది.
‌‌‌‌‌ ఒకవేళ ఆయన కూతురికి యాక్సిడెంట్ అయి జీవచ్చవంలా మంచాన పడి ఉందేమో.అందుకే చనిపోవడమే మంచిదని ఉంటాడు. వచ్చిన అన్ని ఊహల్లోకీ ఇదే సమంజసంగా ఉందని తోచింది ప్రభాకర్ కి.లేదా ఖచ్చితంగా పిచ్చి అయ్యుండాలి.వీడి జోలికి పోకూడదు బాబోయ్.అని కాసేపు,విషయమేమిటో తేల్చుకోవాల్సిందేనని కాసేపు..మీమాంస.

పదిరోజుల తర్వాత ఆ సాయంత్రం యథా ప్రకారంగా లైబ్రరీకి వెళ్ళాడు ప్రభాకర్. వద్దనుకుంటూనే తలతిప్పి చూడకుండా ఉండలేకపోయాడు. తీరా ఆ కుర్చీలో ఎవరో అమ్మాయి.
హాలంతా చూసినా‌ తన జాడ లేదు. నిరాశ కలిగిన మాట నిజం. వరుసగా మూడ్రోజులపాటు ఆయన ఆబ్సెంట్. ఏమై ఉంటుందో! ఉత్సుకత ఆపుకోలేక లైబ్రేరియన్ ని కదిపాడు ప్రభాకర్.
“ఇక్కడ రోజూ కూర్చునే ఆయన?? ” సందేహంగా ఆపేశాడు.

లైబ్రేరియన్ మురళి ” ఎవరు శాంతారాం గారా సార్? వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారండీ” అన్నాడు.

ప్రభాకర్ మొహంలో వెలుగొచ్చింది. ” మీకాయన తెలుసా? ఎందుకలా ఉంటారో అర్థం కాదు నాకు” అన్నాడు.

మురళి నిట్టూర్చాడు. ” ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ సార్.చాలా సరదాగా ఉండేవారు.మా ఎదురిల్లే.భార్య ఆంధ్రా బ్యాంక్ లో మేనేజర్.” ఒక క్షణమాగాడు.
” ఆయన సరదాగా ఉండడమేంటనుకుంటున్నారా? పాపం ఒక్కగానొక్క కూతురు సార్.ఇంటర్ చదివేది.బంగారు తల్లి . బుద్దిమంతురాలు.చిదిమి దీపం పెట్టొచ్చు.
ఒకరోజు ఫ్రెండ్ తో కాలేజీ నుంచొస్తుంటే…ఒక వేన్ సర్రున పక్కన ఆగిందట. ఫ్రెండ్ యాక్సిడెంట్ అవబోయింది కాబోలు.ప్రమాదం తప్పిందనుకునేలోపే ఈ పిల్లని వేన్ లోకి లాగేశారట.
ఈయన ఎన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా జాడ తెలియలేదు. ఏడ్చి ఏడ్చి భార్య పోయింది. ఈయన కళ్ళలో నీళ్ళు ఇంకిపోయాయి.పెదవులపై నవ్వు ఆరిపోయింది.ఉద్యోగం మానేశారు.
ఎవరు ఓదార్చడానికెళ్ళినా ” నా బంగారుతల్లిని ఎన్ని హింసలు పెడుతున్నారో..ఏం చేశారో..చచ్చిపోతే హాయిగా మట్టిలో సుఖంగా ఉండేది.” అని అంతులేని వేదన.
కాస్త మనసు మళ్ళుతుందని లైబ్రరీ కో గంట రమ్మన్నా నేనే.”

వింటున్న ప్రభాకర్ కి కాళ్ళకింద నేల కదిలినట్లయింది. కడుపులో తిప్పేసింది. అయ్యో..అందుకా మధు కూతురు చనిపోతే అలాగన్నారు.అయ్యో..ప్రభాకర్ కళ్ళనిండుగా నీళ్లు.
ఆయన కనబడితే ఒక్కసారి మనసారా కౌగలించుకుని ఓదార్పునివ్వాలనిపిస్తోంది. కానీ ఎలా? అని పరితపించాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!