నమ్మకం

(అంశం. :”ఆ చీకటి వెనకాల”)

నమ్మకం

రచయిత :: శివరంజని

“ఆంజనేయా నన్ను కాపాడు, శివయ్యా నన్ను కాయు” మనస్సులోనే తనకు తెలిసిన దేవుళ్లకు అందరికి దండాలు పెడుతూ చిన్న చిన్న అడుగులు వేస్తూ మసక చీకట్లో చింతచెట్ల వైపు భయంగా చూసాడు పదేళ్ల శివ. చింతచెట్లు భయంకరమైన శబ్దంతో ఊగుతున్నాయి. గుండె దడలాడింది. వెనక్కి వెళ్లిపోదామా అనుకొని మళ్లీ మనసు మార్చుకున్నాడు. అలా వెళ్తే స్నేహితులముందు పిరికివాణ్ణని ఒప్పుకున్నట్టే.

అసలేం జరిగిందంటే శివ, కిట్టు, రాజా, రాము నలుగురు స్నేహితులు. ఆరోజు ఆటలాడుతూ ఎవరు ధైర్యవంతులు అని చర్చించుకోసాగారు. “ఎవరికి దైర్యం ఉంటె వాళ్లు ఈరోజు చీకటి పడ్డాక పోచమ్మ మైదానం పక్కనున్న, చింతచెట్ల తోటలో, చింత చెట్లు ముట్టుకొని రావాలి” అని కిట్టు అన్నాడు. నలుగురు స్నేహితులు చీకటి పడ్డాక పోచమ్మ తోట దగ్గరికి వచ్చారు. నాలుగడుగులు వేసాక పోచమ్మ తోటలో వీస్తున్న గాలి శబ్దానికే రాజా, రాము బయపడి ఆగిపోయారు. “కిట్టు వద్దురా, ఒకవేళ చింతచెట్ల మీద ఉండే దయ్యాలు మనల్ని చంపేస్తే, ఇంటికెళ్లిపోదాం” అన్నారు. “హే, పిరికిపందల్లారా దయ్యాలు లాంటివి ఏమి ఉండవు, ఇలా వెళ్లి అలా వచ్చేద్దాం పదండి” అన్నాడు శివ.

“మేము రాము” అన్నారు రాజా, రాము ఒకేసారి. “వద్దులేరా మానేద్దాం” అన్నాడు కిట్టు కూడా.
“సరే మీరు రాకండి, నేనొక్కణ్ణే వెళ్తా, మీరిక్కడే ఉండండి” అని శివ ఒక్కడే వెళ్లాడు.

స్నేహితులు వెంట ఉన్నంతసేపు తెలియలేదు కానీ, నిజంగానే చీకట్లో చింతతోట చాలా భయంకరంగా ఉంది. తోటనిండా ఉన్న చెట్ల నుండి విపరీతంగా గాలి వీస్తోంది. అసలా గాలికే ఎగిరిపోతానేమో అనిపించసాగింది శివకు. చింతచెట్ల మీద దయ్యాలు ఉంటాయని, చీకటి పడ్డాక అక్కడికి వెళ్తే రక్తం కక్కుకొని చావడమో, పిచ్చి పట్టడమో జరుగుతుందని పెద్దవాళ్లు అంటుంటారు.

పోచమ్మ మైదానం, చింత తోట చాలా విశాలంగా ఉంటాయి. పోచమ్మ మైదానంలో ఒకవైపు పోచమ్మ తల్లి గుడి వేప చెట్లు. ఆ మైదానం పక్కనే ఎవరో విదేశాలలో ఉన్నవాళ్ల ఖాళి స్థలం. ఆ స్థలం నిండా చాలా చింతచెట్లు ఉండటంవల్ల అందరు చింతతోట అని, చింతచెట్ల తోట అని అంటారు. చింతతోట యజమానులు స్థలం చుట్టూ ప్రహరీ గోడ కట్టారు. కొందరు ఆ గోడ మధ్య మధ్య విరగ్గొట్టి, లోపలికి వెళ్లి తాగడం, పేకాట ఆడటం లాంటివి చేస్తుంటారు. చీకటి పడకముందే అక్కడ ఉన్న చింతచెట్ల పైనుండి దయ్యాలు వస్తాయని ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లిపోతారు. అలాంటివారు సైతం భయపడే ఆ చింతచెట్ల దగ్గరికి చీకట్లో వెళ్లడానికి శివ మొండిగా బయల్దేరనైతే బయల్దేరాడు కానీ, చాలా భయమేస్తోంది.

చింతచెట్టుపైనున్న దయ్యం తన పొడుగాటి చేయిని చాచి తనని తినేసినట్టు, తను పిచ్చోడయినట్టు, రక్తం కక్కి చనిపోయినట్టు ఊహలు వస్తున్నాయి. నేను చచ్చిపోతే అమ్మ, నాన్న , బామ్మ ఎంత ఏడుస్తారో. వాళ్లు ఏడవటం ఊహించుకొంటే శివ కాళ్లు ముందుకు కదలటం లేదు.
చింతచెట్ల మైదానం పక్కనున్న పోచమ్మ గుడి వైపు చూసాడు. “అమ్మా నన్ను కాపాడు” అని దండం పెట్టుకున్నాడు.

“ఒరేయ్ కిట్టు, శివగాడికి ఏమైనా అయితే ఎలారా, ఒకవేళ పిచ్చోడయితే ఎలారా” అని రాజా భయపడుతూ అన్నాడు. “ఒరేయ్ వాడికేమైనా అయితే ఈ పందెము నువ్వే పెట్టావని, దీనికి కారణం నువ్వే అని వాళ్ల అమ్మా నాన్నతో చెప్పేస్తాము” అన్నాడు రాము. “నేను వద్దన్నా వాడే కదరా వెళ్లాడు” అన్నాడు ఏడుస్తూ కిట్టు. “మొదలెట్టింది నువ్వే కదరా” అన్నారు రాజా రాము.
“సరే పదండ్రా, ముగ్గురం కలిసి వాణ్ణి తీసుకొద్దాము. వాడే ధైర్యవంతుడు అని ముగ్గురం కలిసి చెప్దాము. అప్పుడు వాడు వచ్చేస్తాడు” అన్నాడు కిట్టు.

భయం భయంగా తడబడుతూ చిన్నగా అడుగు ముందుకు వేస్తున్న శివకు, “శివా ఆగరా” అంటూ స్నేహితులు అరవడం వినిపించింది. వెనక్కి తిరిగిన శివకు పరిగెత్తుతూ వస్తున్న ముగ్గురు స్నేహితులు కనిపించారు. “రేయ్ నువ్వే దైర్యవంతుడివి మేమొప్పుకుంటున్నాము, పదరా” అన్నారు ముగ్గురు స్నేహితులు. “చింతచెట్టును ముట్టుకొనే నేనొచ్చేది” బింకంగా అన్నాడు శివ.
“రేయ్ నీకేమైనా అయితే, మా అమ్మానాన్నలే కాదు మీ అమ్మా నాన్న కూడా మమ్మల్ని కొడతారు, మా కోసం అయినా వద్దురా ప్లీజ్, అయినా మన నలుగురిలో నువ్వే దైర్యవంతుడివి అని ఒప్పుకుంటున్నామురా” అంటూ బ్రతిమాలుతున్న స్నేహితులతో అలా రండి దారికి అన్నట్టుగా చూసి, మనసులోనే పోచమ్మ తల్లికి దండం పెట్టుకొని స్నేహితులతో ఇంటివైపు బయల్దేరాడు శివ.

ఇది జరిగి ఇరవై ఏళ్లు గడిచాయి. అప్పుడు పదేళ్ల వయసున్న నలుగురు స్నేహితులు చదువులు అయి అందరూ మంచి ఉద్యోగాలు, వ్యాపారాలలో స్థిరపడ్డారు. చింతతోట స్థానంలో పెద్ద అపార్ట్ మెంట్ వెలిసింది. ఇప్పటికీ నలుగురు స్నేహితులు ఎప్పుడు కలిసినా చీకటి అవతల చింతతోటలో ఆనాటి బాల్యస్మృతులు నెమరువేసుకుంటూనే ఉంటారు.
పోచమ్మతోటలో అప్పటి చిన్న గుడిని, పెద్ద గుడిగా కట్టారు. గుడిచుట్టూ అందమైన పూల మొక్కలు, వేపచెట్లు ఆహ్లాదంగా ఉంటాయి. అమ్మవారు అభయహస్తంతో, చిద్విలాసంగా నవ్వుతూ దర్శనమిస్తుంది అక్కడికి వచ్చే భక్తులకు.

శివకు మాత్రం ఆరోజు అమ్మవారే స్నేహితులను పంపి, తనను పందెము ఓడిపోకుండా కాపాడిందని గట్టి నమ్మకం. ఆతర్వాత కూడా చాలాసార్లు, పరీక్షలలో మంచి మార్కులు రావాలని, మంచి ఉద్యోగం, ప్రమోషన్, పెళ్లి ఇలా అడిగినవన్నీ అమ్మవారు ఇచ్చిందని స్నేహితులతో అంటుంటాడు. “అమ్మా, ఆరోజు ఆ చీకటి వెనకాల ఏముందో చూడాలని నేను వెళ్లి ఉంటె భయంతోనే చచ్చేవాణ్ణి. నన్ను ఆరోజు కాపాడినట్టే, యావత్ భారతదేశం నుండి కరోనా మహమ్మారి తొలగిపోయి, అందరూ మునుపటిలా ఎవరి పనులు వాళ్లు నిరాటంకంగా చేసుకుంటూ హాయిగా ఉండేట్టుగా దీవించమ్మా, నీకు బంగారు కిరీటం చేయిస్తాను” అని భక్తితో రెండు చేతులూ జోడిస్తూ మొక్కాడు తన బాల్యస్మృతులు జ్ఞాపకం వచ్చిన శివ.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!