అర్థంకాని అమ్మ 

అర్థంకాని అమ్మ 

రచయిత :: రాజేష్ ఖన్నా 

పనికిరాని ఓ జీవాణువుకి ఆవాసమై
ఆ అణువు ఆకారానికి  కలల సౌధానివై
ఆ రూపానికి రహస్య గుడారానివై
నా ప్రకంపనలకి తట్టుకొనే సంద్రానివై
ముద్దగా మిగిలిన నాకూ జీవాన్ని పోసి
కదలని నాలో  నీ  ఊపిరిని ఊది
కురూపిగా ఉన్న నాకూ నీ రూపాన్నిచ్చి
అవస్థలకు
ఆటంకాలకి అడ్డుగా నిలిచి
అలసటని
అనారోగ్యాన్ని బెట్టుగా గెలిచి
సవాలు చేసిన లోకం ముందుకు నన్ను తెచ్చి
ఇదిగో నా రూపమని నవ్వినా నీవు
నాకు అర్థం కాలేదెప్పుడు

నా కేకలకు నీ కన్నీళ్లు మడుగులు కట్టే
నా నడకలకి  నీ  తపన అడుగులు పెట్టే
నా ఓటమికి  నీ  గుండె ధడధడలాడబట్టే
నా పరుగులకి  నీ  నవ్వు కేరింతలు కొట్టే
నా నవ్వులతో  నీ మనసు లోకాన్ని చుట్టే

నా చిలిపికి  నీ చీరకొంగు రక్షణవలయమాయే
నా అల్లరికి  నీ  చీర కుచ్చిళ్ళు ఊయలైపోయే
నా ఆకలికి నీ ఎద ఒడి మెత్తటి పూల పాన్పాయే
నా కేరింతలకు  ఎగిసిన నీ  నవ్వులర్థం కాకపాయే
నీ  ముందు అణువుగా మిగిలిన నాకు, నా  చూపులకు
నీ ప్రేమ రూపం అంచనాకి  రాదాయే

నా లక్ష్యంలో  నీ దూరాల్ని కొలిచావు
నా  విజయంలో  నీ  తీరాల్ని గెలిచావు
నా ఓటమిలో కూడా నన్ను వీరుడిగా పిలిచావు
చివరికి నన్ను విజేతగా మలిచావు

నన్ను అలకరించి నీవు అద్దంలో చూసుకొంటావెందుకు
నన్ను ముస్తాబు చేసి నీవు మురిసిపోతావెందుకు
నన్ను  ఆకాశానికెత్తేసి నీవు సంబరపడతావెందుకు
నన్ను నిన్నుగా చూసుకొంటావెందుకు
నీకో రూపముందిగా
నీకంటూ అందం ఉందిగా
అయినా నన్నే చూస్తావా,
నీ రూపం, నీ జీవితం నాకే ఇచ్చాకా
నీకంటూ ఏమిలేదని పరోక్షంగా చెప్తున్నావా
అయినా  ఇప్పటికీ అర్థం కాకపోతివి కదా

ఎప్పటికీ  నేను నీ అణువునే,  నీవు నా అమ్మవే
అయినా అమ్మని అర్థం చేసుకొనే శక్తి ఆ  అణువుకెక్కడిది????

You May Also Like

One thought on “అర్థంకాని అమ్మ 

  1. నిజమే ఎప్పటికి అర్థం కానిది అమ్మ నే…🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!