బోధించి తీరవలసిన పాఠం
వయసుడిగిన తల్లిదండ్రులను
వీథుల పాల్జేసి బ్రతికుండగానే
పున్నామ నరకం చూపించే పుత్రులు…
విద్య నేర్పే గురువులను
హేళన చేసే విద్యార్థులు…
ప్రక్కన సౌందర్యదార ఉన్నా
ప్రక్కచూపులు చూసే పతులు…
అంగుళం స్థలం కోసం తలలు
పగులకొట్టుకునే అన్నదమ్ములు…
చిన్నపాటి సమస్యలకే
చిర్రుబుర్రులాడి కోర్టుకెక్కే దంపతులు…
పదవి కోసం అవినీతి దారులు
వెతికే పాలకులు…
ప్రస్తుత సమాజ తీరుతెన్నులు…!
అనుమతి లేనిదే పరస్త్రీని
తాకని ప్రతినాయకుని నీతి…
తండ్రి మాటకై వనవాసానికి
తరలిన కథానాయకుని పితృభక్తి…
స్త్రీ మూర్తుల త్యాగాలు…
ఒకరికొకరుగా నిలిచిన సోదరప్రేమలు…
ప్రభువు సంక్షేమ పాలనలో
ప్రజల వైభోగాలు…!
పలు ఆదర్శ గుణాలు…
పోతపోసిన నైతిక విలువల
కలగలుపు రామాయణం…
నేటి విపరీత ప్రవర్తనల తరానికి
బోధించి తీరవలసిన పాఠం…!!!
రచన ::చంద్రకళ. దీకొండ