చిన్న మనసులు

చిన్న మనసులు

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: అద్దంకి లక్ష్మీ

సుజాత, రత్న ఎదురు, ఎదురు ప్లాట్లో ఉంటారు, భర్తలిద్దరూ ఒకే కంపెనీలో పని చేస్తారు, ఇద్దరికీ ఒక్కొక్క పిల్లవాడు ఒకే వయసు వాళ్ళు, సుజాత కొడుకు పేరు అరుణ్, రత్న కొడుకు పేరు తరుణ్, ఇద్దరికీ ఆరేళ్ల వయసు, ఒకే స్కూల్లో చదువుతారు. ఉదయమే గేటు దగ్గరికి స్కూల్ బస్సు వస్తుంది. సుజాత, రత్న వెళ్లి పిల్లలిద్దర్నీ బస్సులో ఎక్కిస్తారు. కనీసం ఆ గేటు దగ్గర అరగంట కబుర్లు చెప్పుకుంటారు. సాయంత్రం మళ్ళా స్కూలు బస్సు వచ్చేసరికి వెళ్లి, వాళ్ళని ఇంటికి తెచ్చుకుంటారు. సాయంత్రం కాలనీలో ఉన్న గార్డెన్ లోకి వెళ్లి కూర్చుంటారు. ఇద్దరూ అనేక విషయాలు కబుర్లు చెప్పుకుంటూ మంచి స్నేహంగా కలసిమెలసి ఉంటారు. భర్తలిద్దరూ కూడా మంచి స్నేహంగా ఉంటారు. ఒకరోజు స్కూల్లో ఇంటర్వల్ లో పిల్లలు ఇద్దరు దెబ్బలాడుకున్నారు ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకున్నారు, పుస్తకాలు చింపుకున్నారు, టీచర్ వాళ్ళని సముదాయించి పంపింది. ఇంటికి వచ్చి ఇద్దరూ వాళ్ళ అమ్మలతో కంప్లైంట్ చేశారు.
అంతే.. అమ్మలకు కూడా కోపం వచ్చింది. ఎవరైనా ఎదుటి పిల్లవాడు తప్పు చేశాడు అనుకుంటారు. తన పిల్లాడు చాలా బుద్ధిమంతుడు అనుకుంటారు. ఎందుకంటే పుస్తకాలు చింపేసుకున్నారు. తన పుస్తకం ముందు అరుణ్ చింపాడని తరుణ్, చెప్పాడు. తన పుస్తకం ముందర అరుణ చింపాడని తరుణ్ చెప్పాడు. దాంతో తల్లులిద్దరికీ మనసులో కొంచెం ద్వేషం పుట్టింది ఒకరి మీద ఒకరికి. మర్నాడు స్కూల్ కెళ్లేటప్పుడు ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. పిల్లల ఇద్దరినీ స్కూలు బస్సుకి దింపేసి గబగబా వచ్చేసారు. ఎడ ముఖం పెడ ముఖం పెట్టుకుని. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే తరుణ్, అరుణ్ ని కొట్టి ఏడిపించాడని. ఈమె అనుకుంటుంది. ఆమె అరుణ్ తన కొడుకుని కొట్టాడని ఈమె అనుకుంటుంది. ఇద్దరికీ మనసులో కోపం. పిల్లలిద్దరూ కూడా మాట్లాడుకోవటం లేదు ఒకళ్ళను చూసి ఒకళ్ళు కోపంగా మండి పడుతున్నారు. సుజాత భర్త దగ్గర వాపోయింది “చూడండి తరుణ్ మన పిల్లవాడి చొక్కా చింపాడు, పుస్తకాలు చింపేశాడు చాలా అల్లరి వాడండి అంటూ కంప్లైంట్ చేసింది భర్త మూర్తితో. “ఏదో పిల్లలు కొట్లాడుకుంటారు మధ్యలో పెద్దవాళ్ళం మనం కలగ జేసుకోకూడదు, రేపొద్దున మళ్లీ వాళ్ళు మాట్లాడుకుంటారు” అంటూ ఆమెను ఓదార్చాడు. అక్కడ రత్న కూడా భర్తకి కంప్లైంట్ చేస్తే ఆమె భర్త కూడా ఆమెకి చిన్నపిల్లల విషయంలో మనం కలగజేసుకోకూడదు.
ఈరోజు కొట్లాడుకుంటారు రేపు ఆడుకుంటారు అని చెప్పాడు. అయితే తల్లులు ఇద్దరి మనసుల్లో ఆ ద్వేషం పోలేదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు మొహాలు తిప్పుకుంటున్నారు. ఎందుకంటే ఎవరి పిల్లలు అంటే వాళ్లకి ముద్దు, గారం కదా! తమ పిల్లలదేం తప్పు లేదని అనుకుంటారు. ఒక వారం రోజులు గడిచింది ఇప్పుడు మళ్ళీ పిల్లలిద్దరూ కలిసిపోయారు. ఒకరోజు స్కూల్ బస్సులోంచి ఇద్దరు నవ్వుకుంటూ దిగారు. తల్లులిద్దరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని నవ్వుకున్నారు. అప్పటికే వాళ్ళ మనసుల్లో కొంచెం పాశ్చాత్తాపం మొదలైంది. “సారీ సుజాత! పిల్లల గురించి మనం మాట్లాడుకోవడం మానేశాము” అంది రత్న. “సారీ రత్న! నేను కూడా పిల్లల విషయంలో అనవసరంగా కలుగజేసుకుని నీతో మాట్లాడడం మానేశాను నన్ను క్షమించు” అంది సుజాత ఆమె చేతులు పట్టుకొని ఇద్దరూ నిర్ణయించుకున్నారు పిల్లల విషయంలో తాము ఎప్పుడూ కలగ జేసుకోరాదని, దానివల్ల అనవసరంగా పెద్దవాళ్ల స్నేహాలు కూడా దెబ్బతింటాయని తెలుసుకున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!