గురివింద గింజ

గురివింద గింజ

రచయిత ::  గుడిపూడి రాధికారాణి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం దొరకడమే ఒక కల అనుకుంటే ఆ ఉద్యోగానికి సెలక్ట్ అవడం…అదీ వేరే రాష్ట్రమో జిల్లానో కాకుండా ఇంటికి కేవలం 20 మైళ్ళ దూరంలో ఉన్న బ్రాంచ్ లో అని పోస్టింగ్ ఆర్డర్స్ రావడంతో సంబరపడిపోయింది వసుంధర.
బస్సురూటు లేని ఆ గ్రామానికి ఆటోలే గతి.పదిపన్నెండు మందిని కుక్కడం,చెవులు చిల్లులు పడేంత పెద్ద సౌండ్ తో పాటలు పెట్టడం, అతివేగంతో నడపడం ఆ రూట్లో డ్రైవర్లకు మామూలే.
ఉద్యోగం వచ్చిన ఎక్సైట్ మెంట్ లో ఒక నెలరోజులు ఏం అనిపించలేదుకానీ ఆ థ్రిల్ కొంచెం తగ్గాక వసుంధరకి ఆటో ఇబ్బందులు కనిపించడం మొదలైనాయి.
సీటులో నలుగురు, ఎదురు చెక్కపై నలుగురు,వెనకాల సామాను పెట్టే చోట సామాను పెట్టుకుని అవి పడకుండా పట్టుకుని ముగ్గురు,డ్రైవర్ కి అటు ఒకరు,ఇటు ఇద్దరు..వామ్మో అది ఆటోనా? పుష్పక విమానమా? అన్నట్లుండేది.
వసుంధర వెళ్ళేది స్కూళ్ళు,ఆఫీసుల టైము కావడంతో కిటకిటలాడే ఆటోలో ఇరుకు ప్రయాణమే ఆమెకి దిక్కయ్యేది.
దానికి తోడు పచ్చి చేపల బుట్టలు,ఎండురొయ్యల తట్టలు, పీలుస్తున్న బీడీలు,సిగరెట్లు ఆటో కదలగానే పారేసి ఎక్కి కూర్చునే మగాళ్ళు,వాళ్ళ ఊపిరిలో నిండిపోయి కడుపులో తిప్పే వికారపు వాసన,సాయంత్రాలు అయితే వాళ్ళ చెమటకంపులు…బాబోయ్…వసుంధర బెంబేలెత్తిపోసాగింది.
పోనీ బండి నేర్చుకుని వెళ్ళిపోతే ఎంత హాయి..
కానీ తనకి ఎందుకో డ్రైవింగ్ అంటే విపరీతమైన భయం.కాబట్టి మరో దారి లేక దినదినగండంగా ముక్కు మూసుకుని ప్రయాణం చేస్తుంటుంది వసుంధర.
ఆ రోజు శుక్రవారం. వసుంధర చక్కగా తలస్నానం చేసి ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని మ్యాచ్ అయ్యేలా కనకాంబరాలు పెట్టుకుని అమ్మ ఇచ్చిన బాక్స్ బ్యాగ్ లో పెట్టుకుని ఆటో ఎక్కింది.అసలే తెల్లటి మనిషి..దానికి తోడు తలస్నానం,లైట్ మేకప్…చూడగానే కళ్ళు జిగేల్మనేలా ఉంది.
ఆటోలో ఇద్దరే ఉన్నారు. టైమవుతోందని వాళ్ళు తొందరపెడుతుంటే ఇంకా టిక్కెట్లు రావాలంటూ డ్రైవర్ కదలట్లేదు.
ఇంతలో “కొంచెం సర్దుకోండమ్మా ” అన్న డ్రైవర్ మాటతో హమ్మయ్య ఎవరో వచ్చారు.ఇక ఆటో బయల్దేరేస్తుంది అని ఊపిరి పీల్చుకుంటూ లోపలికి జరిగింది వసుంధర.
తారుకంటే నల్లగా తైలసంస్కారం లేకుండా వెలిసిపోయిన చీరతో చేతిలో కాసిని సవరాలు పట్టుకుని అంత పొద్దున్నే కూడా చెమట్లు కారుతూ ఎక్కిందో ఎత్తుపళ్ళ భారీకాయం.
ఆమెని చూసి కడుపులో తిప్పింది వసుకి.ఆ ఇరుకులో ఆమె చేతులు వసుంధరకి తగులుతూ చెమటని అంటిస్తూ ఉన్నాయి.
ఆటో బయల్దేరింది.ఆ కుదుపులకి ఎంత జాగ్రత్తగా కూర్చున్నా ఆ చెమటఒళ్ళూ గిడసబారిన ఎర్రజుట్టూ ఆమెకి తగులుతూనే ఉన్నాయి. సెకను ఒక రోజులాగా మీటర్ ఒక కిలోమీటర్ లాగా ఫీలవుతోంది.
ఏడుపొకటే తక్కువైనా తప్పదు కనక ఓర్చుకుంటూ కూర్చుంది.అనుకోకుండా తలతిప్పి చూసి ఉలిక్కిపడింది.వెనకాల సవరలక్ష్మి మొగుడు కాబోలు దర్జాగా కూర్చున్నాడు.రబ్బర్ బ్యాండ్లు,పిన్నీసులు,దువ్వెనలు ఏవేవో ఉన్న చట్రమొకటి పట్టుక్కూర్చున్నాడు.వీధులెమ్మట తిరుగుతూ వెంట్రుకలు కొనుక్కుని వాటిబదులు అవిస్తాడనుకుంటా.
ఆ మధ్య ఆటోలో తనపక్కన కూర్చున్న స్కూలు టీచర్ చెప్పిన సంగతి గుర్తొచ్చింది వసుంధరకి.
ఆ టీచర్ అత్త కూతురు ఆంధ్రా బ్యాంక్ లో చేస్తుందిట.తనలాగే ఆటోల్లో వెళ్తుందిట.ఒక రోజు జుట్టు కొనుక్కునే వాడొకడు ఆటో ఎక్కి వెనకాల కూర్చున్నాట్ట.
సగందారిలో వాడు దిగిపోయాట్ట.తను ఆటో దిగబోతుంటే వెనకేదో బరువు లేనట్టు వెలితిగా ఉందిట.తీరా చూసుకుంటే మోకాళ్ళు దాటే బారెడు జడలో మూరెడు జడ కత్తిరించుకు పోయాట్ట.
ఆ మధ్య పెళ్ళి చూపుల్లో అబ్బాయి తల్లి ఆ జడను చూసి తెగ మురిసిపోయిందిట కూడాను. ఆ బెంగతో బాధతో పదిరొజులు మెడికల్ లీవ్ పెట్టేసిందిట.ఎంతో ఓదార్చినమీదట కానీ మామూలు మనిషి కాలేకపోయిందిట.
వెనకాల చుట్టవాసనేస్తూ కూర్చున్న హిడింబి మొగుణ్ణి చూడంగానే అదంతా గుర్తొచ్చి గుండె గుభేల్మంది వసుంధరకి.భయంగా తన జడని ముందుకేసుకుంది.హిడింబి వేపు కాకుండా మరోవేపుకి.
బ్యాగ్ జిప్పుల మీదుగా ఒక చేతిని,మెడలో లాకెట్ చెయిన్ తగిలేలా ఒక చేతిని ఉంచి క్షణమో యుగంలా గడుపుతోంది.
అలా కొన్ని వందల యుగాలు గడిచాక బ్యాంక్ సాక్షాత్కరించింది.వసుంధర దిగడం కోసం హిడింబీ దిగింది.
వసుంధర బతుకుజీవుడా అంటూ ఆటో దిగి డబ్బులిచ్చి జడ వెనక్కేసుకుని స్థిమితపడి బ్యాంక్ లోకెళ్ళిపోయింది.
తీరా సంతకం పెడుతూ చూస్తే వేలికి ఉంగరం లేదు.గుండె ఝల్లుమంది వసుంధరకి.తను డ్రైవర్ కి డబ్బులిస్తుంటే తననే నవ్వుతూ చూస్తున్న హిడింబి కళ్ళముందు మెదిలింది.అసహాయతతో ఏడుపొచ్చింది.దొంగెవరో తెలిసింది.కానీ ఇప్పుడు చెయ్యగలిగిందేముంది.కాళ్ళీడ్చుకుంటూ వచ్చి సీట్లో కూర్చుంది.
అయినా ఆ ఉంగరం తన వేలికి కొంచెం వదులుగానే ఉంటుంది.సరిగా సైజ్ చేయించుకోవాల్సింది.అని పశ్చాత్తాపపడింది.పనిపై ఏకాగ్రత పెట్టలేకపోతోంది.యాంత్రికంగా తల వంచుకుని టోకెన్స్ తీసుకుని క్యాష్ ఇవ్వసాగింది.
ఇంతలో మూడుగంటల ప్రాంతంలో ” ఓలమ్మీ! నీ పేరేందో.ఇటు సూడోపాలి.” అనే మొరటుగొంతుకి చిరాగ్గా తలెత్తి చూసిన వసుంధర మనసులోనే కెవ్వుమంది.
ఎదురుగా ఒక చేత్తో కూరల సంచీ,చంకలో పొడవాటి ఆనపకాయ పట్టుకుని రెండో చెయ్యి చాపి నుంచుని ఉంది హిడింబి.ఆమె నల్లటి వేళ్ళమధ్య వజ్రపుటుంగరం మిలమిలలాడుతూ మెరిసిపోతోంది.
అది తనదేనని గుర్తించిన వసుంధర కళ్ళు సంభ్రమాశ్చర్యాలతో పెద్దవైనాయి.గభాల్న లాక్కున్నట్లుగా తీసుకుంది.
” మేము దిగిపోయేటప్పుడు నా కాళ్ళకాడ పడుందమ్మా.నీదే కామోసు జారిపోయుంటుందనుకున్నా.ఖంగారు పడతండావేమో.అప్పుడే వెనక్కొచ్చి బేగీ ఇచ్చేద్దారంటే మాకాడ డబ్బులెక్కువ లేకపాయె.అందుకే పన్లు జూసుకుని తిరుగుదారిలో తెచ్చినా.ఏమమ్మీ? ఖంగారు పడ్డా? ” గడగడా తన ధోరణిలో చెప్పుకుపోతూ కూరలసంచీ చెయ్యి మార్చుకుంది హిడింబి.”ఇంక పదా.పాపం.అమ్మి దిగాలుగా కూర్చుండ్లా.తిందో లేదో..ఇంక తింటదిలే .మనం ఇంకొంచెం బేగి రాయాల్సింది” అని మొగుణ్ణి గదమాయిస్తూ వెళ్ళిపోయింది.
పోతూ తలుపు దగ్గర ఆగి వసుంధరని చూసి నవ్వింది ఇష్టంగా.
వసుంధరకి చెళ్ళుమని కొట్టినట్లయింది.
నిజానికి ఆ ఉంగరం తనకెందుకు లూజో తనకే తెలుసు.డిగ్రీ చదివేటప్పుడు ఒకసారి గుళ్ళో దొరికితే తీసుకుంది.గుడి అంతా తిరిగి ఎవరన్నా వెతుక్కుంటున్నారేమో అని గమనించిందీ లేదు మర్నాడు వెళ్ళి పూజారిగారిని ఆరా తీసిందీ లేదు.సరికదా..నిర్లక్ష్యంగా ఉండడం వాళ్ళ పొరపాటనీ,తన తప్పు లేదనీ మనసుని ఊరుకోబెట్టింది.
ఆ సంగతి గుర్తొస్తూ ఇప్పుడు నవ్వుతున్న ఎత్తుపళ్ళ లావుపాటి తారుడబ్బా హిడింబిని చూస్తుంటే సిగ్గుతో తలవాలిపోసాగింది.
“ఎంత బాగుందో ఆ నవ్వు కల్మషం లేకుండా.తెల్లగా నాజూకుగా బొమ్మలా మెరిసిపోయే నువ్వా అందగత్తె? ఆవిడా? ” ఉంగరంతో పాటు మనసడుగుతున్న ప్రశ్నకు సమాధానమూ దొరికింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!