సెల్ఫ్ డిఫెన్స్”

సెల్ఫ్ డిఫెన్స్

రచయిత :: కమల’శ్రీ’

“మాధవీ… మాధవీ…మాధవీ…” ఇంట్లో కి వస్తూనే అరుస్తూ వచ్చాడు గోవింద్.

“ఏంటండీ. ఏం జరిగిందీ?.”అంటూ గోవింద్ చేతిలోని క్యారేజ్ బ్యాగ్ అందుకుంది మాధవి.

“ఏం జరిగిందా?. ఏదీ నీ ముద్దుల కూతురు?. ఎక్కడుంది?.” అన్నాడు కోపంగా.

“ప్రీతీ నా ఏం చేసింది. స్కూల్ నుంచి వచ్చి హోం వర్క్ చేసుకుంటుంది.” అంది మాధవి ఏం జరిగిందో అర్థం కాక. వడివడిగా ప్రీతీ గదిలోకి వెళ్లాడు గోవింద్.

“హేయ్ ప్రీతీ ఏం చేశావు స్కూల్లో?. మీ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి గంట సేపు క్లాస్ పీకింది.” అన్నాడు గోవింద్.

ప్రీతీ ఏమీ సమాధానం చెప్పకుండా వర్క్ చేసుకుంటుంది.

“ఏంటీ అడుగుతుంటే సమాధానం ఇవ్వకుండా నీ పని నువ్వు చేసుకుంటున్నావు?.” అన్నాడు గోవింద్ ప్రీతీ చేతిలోని బుక్ లాక్కుంటూ. తలపైకెత్తి చూసింది ప్రీతి. ఆమె కళ్లనుండా కన్నీరు.

“అయ్యో ! పిల్ల భయపడిపోయింది. చిన్నపిల్లలతో మాట్లాడే పద్ధతి ఇదేనా!.” అంటూ ప్రీతీ కన్నీరు తుడిచింది మాధవి కంగారుగా.

“ఏం జరిగిందో ఏంటో చెప్పకుండా ఏడిస్తే చేసిన తప్పు ఒప్పైపోతుందా ఏంటి?. అయినా దాన్ని కాదు అనాల్సింది. ఒక్కగానొక్క కూతురని గారాబం చేశావు. అదేమో మగరాయుడిలా మారి స్కూల్లో మగపిల్లలను కొడుతోందటా. తొమ్మిదో తరగతి కి వచ్చింది ఇలాంటి పనులు చేస్తుందేంటి. అయినా ఇదేనా మీ పెంపకం. ఇంకోసారి ఇది రిపీట్ అయితే మీ పాప కి టీ.సీ. ఇచ్చి పంపేస్తాము అంటూ తన ప్రిన్సిపాల్ ఫోన్. లేదు మేడమ్ ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఈ ఒక్కసారికి ఎక్స్ క్యూజ్ చేయండి. ప్లీజ్ మేడమ్. సారీ అని ఆవిడని బ్రతిమలాడే సరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది.” అన్నాడు గోవింద్.

“నేనేం తప్పు చేయలేదు. మీరేందుకు సారీ చెప్పారు?!.” అంటూ సూటిగా ప్రశ్నించింది ప్రీతి.

“చూశావా చూశావా ఎలా పొగరుగా మాట్లాడుతుందో. మన ముందే ఇలా ఉందంటే స్కూల్లో ఎలా ఉంటుందో ఏంటో?!.” అన్నాడు గోవింద్.

“దీన్ని పొగరు అనరు నాన్నా. నేను చేయని తప్పుకి మీరు క్షమాపణ ఎందుకు చెప్పారని అడుగుతున్నా.” అంది ప్రీతి.

“ఎంత పొగరుగా మాట్లాడుందో చూడు.” అంటూ ప్రీతి మీదకి రాబోయాడు గోవింద్.

“ఏమండీ ఏంటండీ మీరూ. ఆడపిల్లకి మీదికి వస్తున్నారు.” అంటూ కూతుర్ని పట్టుకుంది.‌

“రాక ఏం చేయాలి. ఆడపిల్ల మగవాళ్లపై చెయ్యెత్తితే ఊరుకోవాలా?!.” అన్నాడు గోవింద్ కళ్లెర్రగిస్తూ ప్రీతి వైపు చూస్తూ.

“ఎంతసేపూ కొట్టడానికే వస్తారు కానీ నేనెందుకు వాడిని కొట్టానో అడిగారా మీరూ. స్కూల్లో ప్రిన్సిపాల్ మేడమ్ కూడా వాడు తనని నేను కొట్టానని కంప్లైంట్ చేయగానే నన్ను తిట్టారు కానీ విషయం కనుక్కోలేదు. ఆడపిల్ల మగపిల్లాడిని కొట్టడం తప్పే. కానీ కొట్టిందంటే ఏదో పెద్ద కారణం ఉంటుంది కదా.” అంది ప్రీతి బాధగా.

“ఆ మాటలకి కాస్త మెత్త బడి “ఏం జరిగిందో చెప్తేగా తెలిసేది?!.” అన్నాడు గోవింద్.

“దానికి చెప్పే అవకాశం ఎక్కడ ఇచ్చారు మీరు?. వచ్చినప్పటి నుంచీ ఓ అరుస్తున్నారు కానీ. ప్రీతీ ఏం జరిగింది తల్లీ. ఎందుకు ఆ అబ్బాయి ని కొట్టావు?!.” అంది మాధవి.

“అదీ అమ్మా వాడూ… ఆ రోషన్ గాడూ…” అంటూ ఏడుస్తూ తల్లి ని చుట్టేసింది ప్రీతి.

‘ఏదో జరగరానిది జరిగింది’అని ఆ తల్లి మనసుకి అనిపించి, “ప్రీతీ ఏమయ్యింది రా. ఎందుకు ఏడుస్తున్నావు?.”అంది కంగారుగా మాధవి.

వాడు రోజూ క్లాస్ రూంలో నాపై పేపర్ వేసి డిస్టర్బ్ చేస్తున్నాడు.నేను నడుస్తుంటే వెనుక నుంచి కామెంట్ చేస్తున్నాడు. మొన్నో సారీ నా బుక్ లో ఓ చీటీ పెట్టాడు
తెరిచి చూస్తే ఐ లవ్యూ ప్రీతి అని ఉంది. దాన్ని చించి డస్ట్ బిన్ లో పడేశా. క్లాస్ టీచర్ కి కంప్లైంట్ చేస్తే ఆ పిల్లాడు స్కూల్ ఛైర్మన్ కొడుకు తనని ఏమన్నా అంటే నన్ను జాబ్ లోంచి తీసేస్తారు. అంటూ వాడిని ఏం అనలేదు.

రోజురోజుకీ వాడి టార్చర్ ఎక్కువైపోయింది. ఆఖరికి ఈ రోజు నేను వాష్ రూం కెళ్లి వస్తుంటే నన్ను వాడూ…” అని వస్తున్న కన్నీటిని అదుపుచేసుకుంటూ నా చేయి పట్టుకుని లాగి నన్ను హగ్ చేసుకోడానికి చూశాడు. విడిపించుకోవడానికి ఎంతలా ప్రయత్నించినా పట్టు బిగించాడే కానీ వదలలేదు. ఆఖరికి వేరే దారి లేక నా కాలితో వాడి రెండు కాళ్ల మధ్యలో తన్ని వాడిని వెనక్కి నెట్టి పరుగెత్తుకుని వచ్చేశా క్లాస్ రూం కి. కాసేపటికి ప్యూన్ వచ్చి ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారంటే వెళ్లా. అక్కడ ఆమె నన్నేమీ అడగకుండానే తిట్టి పంపించేశారు. తర్వాత మీకు కంప్లైంట్ ఇచ్చారు.

అయినా ఎవరిచ్చారు వాడికా అధికారం నా ఒంటిపై చేయి వేయడానికి. ఆడపిల్ల అంటే అంత అలుసా. ఏం తోస్తే అది చేసేస్తారా. ఆ క్షణం నన్ను నేను రక్షించుకోవడానికి నాకేమీ తోచక వాడిని కొట్టాను. ఇన్ కేస్ నేనీ మీ చేయకపోయుంటే ఈ రోజు మీ ముందు నేనిలా ఉండేదాన్ని కాదు. చెప్పండి నాన్నా నేను చేసింది తప్పా.” అంటూ చెప్పడం ముగించింది ప్రీతీ.

కూతురు చెప్పింది వింటుంటే కళ్లముందు కదలాడింది గోవింద్ కి ఆమె అపోజ్ చేయుండకపోతే ఏం జరిగేదో. నిజమే ప్రీతీ కానీ వాడిని కొట్టకపోయుంటే ఈ రోజు నా చిట్టి తల్లి…” అనుకుంటూ,

“నువ్వు చేసిందానిలో ఏం తప్పూ లేదూ. ఆడపిల్లకి సెల్ఫ్ డిఫెన్స్ అవసరం అని నేనే చెప్పాను చాలా సార్లు నీకు. అత్యవసర పరిస్థితుల్లో నిన్ను నీవు కాపాడుకోవడానికి ఎదుటివాడి ని కొట్టినా తప్పు లేదు. నువ్వు చేసింది మంచి పనే. నా పెంపకంలో ఏ లోపమూ లేదు. నీతో ఆ రోషన్ గాడికి సారీ చెప్పిస్తా అని చెప్పా ఆ ప్రిన్సిపాల్ కి. సారీ కాదు వాడిని ఆమె ముందే చెంపదెబ్బ కొట్టిస్తా. టీ.సీ. ఇచ్చేస్తారా ఇచ్చేయనీ. అలాంటి స్కూల్లో నా కూతుర్ని చదివించనింకా.

పిల్లలు ఏం చేస్తున్నారో, తోటి విద్యార్థులతో ఎలా మెలుగుతున్నారో తెలుసుకోవడం వారి బాధ్యత. కానీ వారు దాన్ని సక్రమంగా నిర్వర్తించలేదు. చైర్మన్ కొడుకైతే తప్పు చేస్తే శిక్షించరా. ఈ రోజు ఇలా జరిగింది. మా అమ్మాయి కానీ ఎదిరించకపోతే రేప్పొద్దున ఎంత ఘోరం జరిగేదో.” అని తన ఫోన్ తీసి ప్రిన్స్ పాల్ కి ఫోన్ చేశాడు.

“మేడం నా పెంపకం మంచిదే. మీ అడ్మినిస్ట్రేషన్ లోనే లోపం ఉంది. తప్పెవరు చేశారో తెలుసుకోకుండా నా కూతుర్ని తిట్టారు.నాకు ఫోన్ చేసి టీ.సీ ఇచ్చేస్తానని అన్నారు. మీరేమీ ఇవ్వక్కర్లేదు మేమే తీసుకుంటాం. మీలాంటి భద్రత లేని స్కూల్ లో మా పాప ని చదివించడం మాకు ఇష్టం లేదు.” అని ఫోన్ పెట్టేసి కూతుర్ని అక్కున చేర్చుకున్నాడు గోవింద్.

‌…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!