గుర్తుకొస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి

ఏప్రిల్ , 2021

సౌదీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారతదేశం నుంచి వచ్చిన ప్రయాణీకులు చెక్ అవుట్ కోసం  గత నాలుగు గంటలుగా వేచి చూస్తున్నారు.  కరోనా ఉదృతి కారణంగా విదేశీయులను దేశంలోకి అనుమతించవద్దని, విమానాలు రద్దు చేయమని విమానాశ్రయ సిబ్బందికి ఆదేశం అందింది.  కానీ అప్పటికే లాండింగ్ అయిన ప్రయాణికులను తిరిగి పంపలేమని, ప్రత్యామ్నాయాల గురించి విమానాశ్రయ ఉన్నతాధికారులు చర్చించి, వారిని 15 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచే ఏర్పాటు చేసారు.  అలా వికాస్ సౌదీ లోని హోటల్ రూమ్ కి చేరుకున్నాడు, అతనితో పాటు మరో బంగ్లా దేశీయునికి కూడా అదే గది కేటాయించబడింది.

 

అప్పటివరకు వచ్చిన ప్రయాణికులను ఎవరిని వారి వారి ఇళ్లకు పంపకుండా, క్వారంటైన్ పేరుతో హోటల్ రూమ్స్ లో ఉంచి, బయటి నుండి తలుపు తాళం వేసారు.  వారంతా ఉన్నత విద్యావంతులు, ఎక్కువ డబ్బు సంపాదన ద్యేయంగా సౌదీ చేరిన వలస పక్షులు ప్రస్తుతం బందీలు.  తలుపులు, కిటికీలు అన్ని లాక్ చేయబడి ఉన్నాయి.  వికాస్ కు ఆ గదుల్లో చాల కష్టంగా ఉంది.  తనతో పాటు ఉన్న బంగ్లా దేశీయుడు మాటలు కలిపాడు.

తన పేరు చెప్పి, తానొక మోడల్ అని సోదరిని చూడటానికి వచ్చానని చెప్పాడు.  మిమ్మల్ని చూస్తుంటే చాలా కాలంగా ఇక్కడ ఉన్నట్టు ఉన్నారు అభ్యoతరం లేకపోతె మీ గురించి చెప్పండి అన్నాడు.  చెప్తాను కానీ, అంతా అయ్యేవరకు నువ్వు మధ్యలో మాట్లాడకూడదు అన్నాడు వికాస్.

 

“నా పేరు వికాస్.  నేనో సాఫ్ట్ వారే ఇంజనీర్ ని.  నువ్వు ఊహించినట్టుగానే నేను పది సంవత్సరాలుగా సౌదీ లోనే ఉంటున్న.   మాది తెలంగాణలో మామిడి పల్లి అనే పల్లెటూరు.  మా అమ్మనాన్నలకు చదువంటే చాలా ఇష్టం.  ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ లో సీట్ రావడంతో, మా పల్లెనొదిలి హైదరాబాద్ చేరాను.  సాధారణంగా క్యాంపస్ విద్యార్థులంతా చదువు పట్ల చాలా సీరియస్ గా ఉంటారు, కానీ అప్పటి వరకు బాగా చదివిన నాకు గర్ల్ ఫ్రెండే లోకమైంది.    మేము తిరగని పబ్ లేదు, వెళ్లని సినిమా లేదు.  ఇంటి నుండి చదువు కోసం పంపే డబ్బంతా నేను గర్ల్ ఫ్రెండ్ మీదే ఖర్చు పెట్టేవాణ్ణి.   ఫలితం నాలుగేళ్ల కు పొందాల్సిన ఇంజనీరింగ్ పట్టా, ఆరేళ్లకు పొందాను.  ఈలోపు గర్ల్ ఫ్రెండ్  గ్రీన్ కార్డు ఉన్న మరో వ్యక్తి భార్య అయ్యింది.  అప్పటివరకు నా గర్ల్ ఫ్రెండ్ దివ్య నే నా ప్రపంచం, ఒక్కసారిగా నన్నొదిలేసేసరికి నిరాశ నిస్పృహలకు లోనయ్యా.  ఆ సమయంలో హైదరాబాద్ కు ఎరువులకు వచ్చిన మా నాన్న నన్ను చూసి, చాలా దుఃఖించి ఊరికి తీసుకెళ్లాడు.

 

ఊళ్లో మామయ్య కూతురు స్వప్న తిరిగి నన్ను మనిషిని చేసింది.  అమ్మ చేతి వంట తింటూ, రోజు నాన్నతో పాటు పొలం వెళ్తూ, స్వప్న చెప్పే కబుర్లు వింటూ దివ్యను మర్చిపోయాను.  స్వప్న అప్పుడు ఇంజనీరింగ్ చదువుతోంది, ఊరికి దగ్గరగా ఉన్న కాలేజీ లో.  నా కోసం నెట్ లో తనే నా రెస్యూమె తయారు చేసి, ఉద్యోగాల కోసం అప్లై చేసేది.  ఓ చిన్న కంపెనీలో ఉద్యోగం దొరికింది, నా ఆరోగ్యం బాగుపడటంతో మళ్లీ హైదరాబాద్ వెళ్లటానికి అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నారు, అయితే ఈ సరి పెళ్లి చేసుకొని వెళ్లమన్నారు.  నేనింకా స్థిరపడని కారణంగా కొంతకాలం ఆగమన్నాను.  తర్వాత అమీర్ పేట్ లో ఉంటూ, చాలా సాఫ్ట్ వారే కోర్సు లు నేర్చుకున్నా.  వేరే పెద్ద కంపెనీ లో మంచి జీతంతో ఉద్యోగం వచ్చింది.

 

ఇక పెళ్లి చేసుకోవచ్చనుకున్నా, స్వప్న ను ప్రపోజ్ చేస్తే తనూ ఒప్పుకుంది.  సంప్రదాయబద్దంగా మా పెళ్లి జరిగింది.  స్వప్న ను ఊళ్లోనే ఉంచి నెలకోసారి వెళ్లేవాణ్ణి.  స్వప్నకు అలా ఇష్టం లేదు, కానీ స్వప్న వస్తే పోర్షన్ అద్దెకు తీసుకోవాలి, ఖర్చు పెరుగుతుంది అని లెక్కలేసుకొని, తనని కాపురానికి తీసుకురాలేదు.  స్వప్న గర్భవతి అయింది, పాప పుట్టింది.  పాప పుట్టాక నా జాతకం మారింది.  ప్రమోషన్ వచ్చింది, కొత్త ప్రాజెక్ట్ ట్రాన్సిషన్ కోసం నన్ను మూడు నెలల కోసం సౌదీ పంపారు.

 

మూడు నెలలు అనుకున్న ప్రాజెక్ట్ సంవత్సరం అయింది.  కంపెనీ వాళ్లు నా వీసా ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు.  తర్వాత క్లయింట్ కు నా పని నచ్చి ఇక్కడే ఉండమన్నారు.  అలా పదేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా.  మధ్య మధ్యలో ఊరు వెళ్లేవాణ్ణి.  రెండేళ్లక్రితం అమ్మ చనిపోయింది.  ఎంత బాధలో ఉన్నా కార్యక్రమాలు పూర్తి చేసి, నాన్నను వృద్ధాశ్రమంలో ఉంచి, స్వప్నను పుట్టింట్లో దిగబెట్టి జాగ్రత్తలు చెప్పి మళ్లీ సౌదీ వచ్చేసా.  నాకు మళ్లీ పాప పుట్టింది, పాపను చూడటానికి వెల్దామనుకున్నా, కానీ అప్పుడు కరోనా లొక్డౌన్ వల్ల వెళ్లలేకపోయా.  ఇక్కడ నా ఫ్లాట్ నుండే పని చేసా.  రోజు నాన్నతో, స్వప్నతో పిల్లలతో వీడియో కాల్ మాట్లాడతా.  నా కూతుర్లు ఇద్దరు అచ్చు గుద్దినట్టు నాలాగే ఉంటారు, స్వప్నకు మా నాన్నకు ఇష్టం లేకపోయినా వాళ్ల భవిష్యత్తు కోసమే నేనిక్కడ పని చేస్తున్నా.  నా రెండో కూతురు పుట్టిన రోజు రాబోతోందనగా ఎప్పుడు నన్ను ఏది అడగని మా నాన్న, చిన్న కూతురు పుట్టినరోజు ఘనంగా చేయమని అడిగారు.  మా ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల నా పెళ్లి సాధారణంగానే అయింది.  నాకు పెద్దపాప పుట్టినప్పుడు, సౌదీ వచ్చే తొందరలో ఉండడం వల్ల ఏ ఫంక్షన్ చేయలేదు, తర్వాత నేనిక్కడ ఉండటం వల్ల డబ్బు ఉన్నా, నేను లేకుండా ఏ ఫంక్షన్ చేయమని మా కుటుంబం లో ఏ ఫంక్షన్ చేయలేదు.  మా నాన్నతో సరే చూద్దాం నాన్న అన్నాను, నిజానికి నాకు కూడా పిల్లల్ని, నాన్నని, స్వప్నని చూడాలని, వాళ్ళతో కాలం గడపాలని ఉంది, కానీ ఇప్పుడు వెళ్తే , ఉద్యోగం ఉంటుంది అన్న గ్యారంటీ లేదు.  అందుకే వెళ్లొద్దనుకున్న, కానీ వెళ్లాల్సొచ్చింది కారణం నా వేలు పట్టుకొని నడిపించిన మా నాన్న చనిపోయారు.

 

ఇంతవరకు చెప్పి బిగ్గరగా ఏడుస్తున్న వికాస్ కు, రూమ్ మేట్ నీళ్లు తాగించాడు.  నన్ను కని పెంచి, విద్యాబుద్ధులు చెప్పించిన మా నాన్న ఆఖరి బాధ్యత నిర్వర్తించడం కోసం భారతదేశం బయల్దేరా.  నేను వెళ్లేవరకు, నాన్నను ఆస్పత్రి మార్చురీ లోనే తగిన ఏర్పాట్లతో ఉంచింది స్వప్న.  నేను వెళ్లి నిర్వర్తించాల్సిన కార్యక్రమాలు నిర్వర్తించాను.  స్వప్న చాలా ముభావంగా ఉంది నాతో, చివరి రోజుల్లో నేను నా తల్లితండ్రులతో లేనని.  పెళ్లయినా పుట్టింట్లోనే ఉందని తనను తనవారే చులకనగా చూస్తున్నారని చాలా ఏడ్చింది.  ఇకనైనా వెళ్లొద్దని ప్రాధేయపడింది.

పెద్ద పాపకు నేను కాస్త అలవాటు, కానీ చిన్న పాప నన్ను అస్సలు దగ్గరికి రానివ్వలేదు, ముట్టుకోనివ్వలేదు, ఫోన్లో రోజు నన్ను చూసిన కొత్త పోలేదు.  నేను రావడానికి రెండు రోజుల ముందు, చిన్ని చిన్ని అడుగులతో వచ్చి నా కాళ్లను చుట్టేసింది, నా బంగారు తల్లిని తనివితీరా ఎత్తుకున్నా.  ఆ రెండు రోజులు నా బంగారు తల్లులతో గడిపి, బరువైన జ్ఞాపకాలతో సౌదీ ఫ్లైట్ ఎక్కా, ఇదిగో ఇలా నేరస్తునిలా క్వారంటైన్ లో బందీలా గడపటానికి, అన్నాడుబరువైన మనస్సుతో  పల్లెను మరచిన వలస బ్రతుకు బ్రతుకుతున్న వికాస్.  రూమ్ మేట్ కు వికాస్ ను ఎలా ఓదార్చాలో తెలియలేదు.

రచయిత :: శివరంజని

 

You May Also Like

4 thoughts on “గుర్తుకొస్తున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!