మా పిన్నిగారి అయోమయం

మా పిన్నిగారి అయోమయం

రచన:: సావిత్రి కోవూరు

“స్వాతి ఏం చేస్తున్నావే, ఒకసారి ఇంటికి రా” అన్నది మా పిన్ని. మధ్య మధ్యన తనకు తోచకపోతే నన్ను రమ్మనడం, నేను వెళ్లడం మాకు అలవాటే.

“ఏంటి విషయం అర్జెంటా?” అన్నాను.

“అర్జంట్ ఏం లేదు కానీ నువ్వు ఏం చేస్తున్నావ్”

“ఏముంది పిన్నీ పండుగ కదా! పూజ దగ్గర అన్ని ఏర్పాట్లు చేశాను. వంట కూడా అయిపోవచ్చింది. భక్ష్యాలు చేస్తే, పూజ చేసి తినేయడమే.”

 “అందరి స్నానాలు అయినవా”?

” తెల్లార గట్లనే అయిపోయినాయి పిన్ని.  పనమ్మాయి వచ్చే లోపల చేసేస్తే బట్టలు కూడా ఉతికి వెళ్ళిపోతుందని తొందరగా చేసేశాం.”

“అవునులే ఈ రోజు పండుగ కదా!
సరేలే ఒకసారి రాజుకి చెప్పి తొందరగా వచ్చి వెళ్ళు” అన్నది. అదేంటి పిన్ని జమ్మి ఆకు ఇచ్చి రమ్మని మీ ఇంటికే పంపిచాను రాజుని రాలేదా?” అన్నాను కంగారుగా.

“ఆ ఆ వచ్చాడు, వచ్చాడు ఇదిగో ఇక్కడే ఉన్నాడు”  అన్నది అయోమయంగా.

“ఇల్లంతా గందరగోళంగా ఉంది. ప్రసన్న, అల్లుడు రాత్రికి వస్తారట. ఏమి చేయాలో నాకేం తోచటంలేదు. అంత అయోమయంగా ఉంది. కొంచెం హెల్ప్ అవసరముంది.” అన్నది మా పిన్ని.

“సరేలే పిన్ని అరగంటలో వస్తాను. నీవేమి కంగారు పడకు” అన్నాను.

నా పని తొందరగా ముగించుకుని మూడిళ్ల అవతల ఉన్న మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్లే సరికి, వాకిట్లో ముగ్గు కూడా వేసి లేదు. వాకిట్లో పాలు పోసే అతను బిల్లు కొరకు వచ్చి నిలబడ్డాడు. ప్లంబర్ని పిలిచారేమొ అతను వచ్చి ఉన్నాడు. ఇంటి కడప దగ్గర, చేగోడీలు, పల్లీల పట్టి లాంటి చిరుతిళ్ళు ఇంట్లో చేసి తెచ్చి అమ్మే ఆవిడ బ్యాగ్ పెట్టుకుని నిలుచుంది, వరండాలో పోచంపల్లి చీరలు ఇన్స్టాల్మెంట్ లో ఇచ్చే అతను, దుప్పట్లు అమ్మే అతను వచ్చి కూర్చున్నారు.వాళ్ళందరిని అలా చూసేసరికి నాకు చికాకు అన్పించింది.

“పిన్నీ వాళ్ళందరేంటి ఇంటి ముందరా” అంటే

“ఇంటి ముందరెవరున్నారు ఓ వాళ్ళా నేనె ఉండమ్మన్నానులే పండగ కదా బోంచేసి వెళతారని”అంటూ లోపలి కెళ్ళింది.

నేను వెళ్లి చీరలు అమ్మే అతనితో “ఈ రోజు పండగ తర్వాత రావచ్చు కదా” అన్నాను.

అతను “మేడం ఈరోజే రమ్మన్నారమ్మా” అన్నాడు.

“అయినా సరే మీరు తర్వాత రండి” అని చెప్పాను.

“మీ పిన్ని మూడు చీరలు లోపలికి తీసుకెళ్ళారు అవి ఇస్తే తీసుకెళ్ళి ఎక్కడన్నా అమ్ముకుంటాను” అన్నాడు.

“సరే” అని లోపలికెళ్లి ఆ చీరలు తెచ్చి అతనికి ఇచ్చేశాను. చెగోడీలు అమ్మె ఆమెని కూడా తర్వాత రమ్మని చెప్పి పంపించేశాను.తన రూం లో కూర్చుని ఏవో పేపర్లు చూస్తున్న మా బాబాయి దగ్గరకెళ్ళి బాబాయ్, పాల అబ్బాయి బిల్లు కొరకు వచ్చినట్టున్నాడు, ప్లంబర్ కూడ వచ్చాడు. వాళ్ళ సంగతేదో చూసి పంపించి వేయండి.” అన్నాను.

“అదేంటి ఎప్పుడు వచ్చారు వాళ్ళు? నేను చూడలేదు” అని మా బాబాయ్ పాల అబ్బాయికి డబ్బులు ఇచ్చి పంపిచేసి, ప్లంబర్ తో నువ్వు రేపు రా బాబు” అని చెప్పి పంపించి వేశాడు.

నేను వెళ్లి చిరుతిళ్ళు అమ్మే ఆవిడతో ఈ రోజు పండగ కదా రేపు రండి” అని, చెప్పేసి పంపించేశాను.

ఇంటి ముందర అందరిని పంపిచేసి ఊపిరి పీల్చుకున్నాను. పెరట్లో ఉన్న పనిమనిషి పుష్ప దగ్గరికెళ్ళి “వాకిట్లో ముగ్గు వేయలేదు,ఇల్లు శుభ్రం చేయ లేదు, మాపింగ్ చేయలేదు, సోఫా లో అన్ని బట్టలు ఎందుకున్నాయి, అసలు నీవేం చేస్తున్నావు? అన్నాను.

“అమ్మగారు మొదట గిన్నెలు కడిగేయ మన్నారమ్మా.”అన్నది. మా పిన్ని అయోమయంలో ఎప్పుడేపని చేయించాలో తెలియదు.

“సరే నేను మా పిన్నికి  చెప్తాను గానీ, మొదట ఇంటిముందర శుభ్రం చేసి, ముగ్గు వేసి, తర్వాత వంటింట్లో చూడు, సింక్ నిండా గిన్నెలు సింకు కింద బియ్యం కడిగిన నీళ్లుతో గిన్నెలు ఎన్నో ఉన్నాయి. మొత్తం గిన్నెలను బయట వేసుకుని  వంటిల్లు శుభ్రం చేసి, వంట ఆరుగు కూడ శుభ్రం చేసెయ్. తర్వాత  నాలుగు టబ్బుల్లో, కడిగిన గిన్నెలు ఉన్నాయి చూడు, సెల్ఫ్ లో సర్దేసెయ్ అన్నాను.

“అమ్మ గిన్నెలన్ని తనే సర్దుకుంటానంటారమ్మా. వంటరుగు కూడా తనే శుభ్రం చేసుకుంటానంటారు. అమ్మగారు బియ్యం కడిగిన నీళ్లు చెట్లకు పోస్తారట. నన్ను ముట్టుకో వద్దన్నారు.” అన్నది.

“మా పిన్ని స్నానం చేసి వచ్చే లోపల మొత్తం నీట్ గా చేసేసెయ్యి. నేను చెప్తాగానిలే మా పిన్నికి” అని, అన్ని పనులు చేయించాను.

మా పిన్ని స్నానానికి వెళ్ళిందంటే అరగంటకు గాని రాదు. నేను చెప్పిన పనులన్నీ చేసిన పుష్పతో,

“డైనింగ్ టేబుల్  రోజు తుడవట్లేదా? అంత దుమ్ము పేరుకు పోయి ఉంది. దాని పైన ఉన్న పచ్చళ్ళు చూడు మూతలు లేకుండా దోమలు వాలుతున్నాయి. దానిపైన సగం తిన్న ఆ దోశముక్క లేంటి? సగం తాగిన నీళ్ల గ్లాసులు ఎన్ని ఉన్నాయో చూడు? ఆ బ్రడ్ ఎప్పటిదో పడేసెయ్. ఆ నల్లబడ్డ అరటి పళ్ళు బయట పడేసెయ్ , టేబుల్ పైనున్న పెరుగు తప్పా, మిగతావన్ని తీసి పడేసెయి.నిన్ను మాట్లాడుకున్నప్పుడు ,మొత్తం పనులు నీవే చూసుకోవాలనే కదా జీతం అంత ఎక్కువ ఇప్పిస్తానన్నాను.”అన్నాను.

“అమ్మ ఆ టేబుల్ ముట్ట వద్దు అన్నారమ్మ మీ పిన్నిగారు. తానే శుభ్రం చేసుకుంటానన్నారు.” అన్నది పుష్ప.

“పిన్ని వచ్చేలోపలే టేబుల్ అంతా శుభ్రం చేసేసెయ్యి” అన్నాను.

“మీ పిన్ని నన్ను కోప్పడతారమ్మా.” అన్నది భయంగా పుష్ప.

మా ఇంట్లో కూడా పుష్పనే చేస్తుంది.  నేనే మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఏమేం పనులు చేయాలో చెప్పి మాట్లాడి పెట్టాను. అందుకే స్వతంత్రంగా అన్ని చెప్పగలుగుతున్నాను.

“సోఫాలో బట్టలన్ని తీసేయ్” అన్నాను

“అవి కొన్ని మడత పెట్టాలమ్మ. కొన్ని అమ్మగారు తనే ఉతుక్కుంటారట.”అన్నది.

“సరేలే ఉతికిన బట్టలు అన్నీ ఒక కుర్చీలో వేసి బయట పెట్టుకో, పనంత అయిపోయింతర్వాత మడతలు పెట్టేసి సర్దేసెయ్. మిగతావి వాషింగ్ మిషన్ లో వేసేయ్. ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి, మాపింగ్ చేసేయ్” అన్నాను,

అక్కడ పడి ఉన్నా న్యూస్ పేపర్స్ అన్ని తీసి సెల్ఫ్ లో సర్దేశాను. ఫ్రిజ్ లో ఎప్పటివో కూరగాయలు, కుళ్ళిపోయిన ఆకు కూరలు, నాలుగైదు గిన్నెలో పెరుగు, కొబ్బరి ముక్కలు ఇంకా ఏంటేంటో గందరగోళంగా ఉంది. ఇద్దరే అయినా, మా పిన్ని పది మందికి సరిపడా కూరలు, పప్పులు వండేస్తుంది. మిగిలినవన్నీ ఫ్రిజ్లో పెడుతుంది. పనిమనిషికని.

ఈ కాలంలో పనిమనుషులు కూడా వేడివేడిగా వండుకుని తింటున్నారు. వాళ్లకు ఇచ్చినా చెత్త బుట్టలో వేసి వెళ్ళిపోతారు. అందుకే ఏ రోజువి ఆ రోజే పడేసేయ్యమంటాను నేను. కానీ మా పిన్ని పనమ్మాయికి ఇస్తాను, కుక్కకు పెడతాను అని ఫ్రిడ్జ్ లో పెడుతుంది. అవి ఎన్ని రోజులైన అలాగే ఉండి పోతాయి.

అసలు తను వంట మొదలు పెట్టడమే పన్నెండున్నరకు.అప్పుడు మా బాబాయ్  వరకే అన్నము, పప్పు, కూరలు చేసి ఒకటిన్నరకు ఆయనకు పెట్టి, మళ్లీ రెండు గంటలకు తన కొరకు అన్నము వండుకుంటుంది. మూడున్నరకు టీవీ చూస్తూ గంట సేపు తింటుంది. ఎందుకు ఇద్దరే కదా చక్కగా తొందరగా వండుకుని ఇద్దరు కలిసి తినొచ్చు కదా! అంటే,

“ఏమో మీ బాబాయ్ కి ఒంటిగంటకే తినడమలవాటు కదా. నేను అంత తొందరగా తినలేను, నేను మూడున్నరకు తింటాను. ఒకేసారి వండితే తినేవరకు చల్లబడతాయి అంటుంది నవ్వుతూ. రాత్రి భోజనం మానేసి చాలా రోజులైంది కనుక పదేళ్ల నుండి బయట నుండి రొట్టెలు కూర తెచ్చుకొని ముగించేస్తారు. వాళ్ల పెళ్లి అయినప్పటి నుండి మా పిన్ని ఇంట్లో ఎంత మంది ఉంటే అన్నిసార్లు వంట చేస్తుండేది. మొదట వాళ్ళ అమ్మాయి ఎనమిదింటికే స్కూల్ కు వెళుతుందని ఆ అమ్మాయికి మాత్రం కొంచెం అన్నం వండి పెరుగో, పచ్చడో వేసి పంపించేది. తర్వాత వాళ్ళ అబ్బాయికి తొమ్మిదింటికి, తర్వాత మా బాబాయి పదిన్నరకు, ఇలా నలుగురు ఉంటే నాలుగుసార్లు కుక్కర్ పెట్టేది. మేము వెళ్ళినప్పుడు ఎందుకు అలాగా. ఒకేసారి వండొచ్చు కదా! అంటే అందరు వేడివేడిగా తినాలి కదా అనేది. ఒక్కరికీ పచ్చడి,కూర, పప్పు, చారు పూర్తి బోజనముండేది కాదు.ఏదో ఒక దానితో సరిపుచ్చుకోవల్సిందే అందరెళ్ళింతర్వాత అన్నీ చేసేది. అవే రాత్రికి తినాల్సి వచ్చేది..

ఎవరి ఇష్టం వాళ్ళది అనుకునేవాళ్లం. వాళ్ళింట్లో నీళ్లు తెల్లార గట్ల నాలుగున్నరకి వస్తాయి. బోరు ఉన్నా ఆ నీళ్ళు అసలు వాడరు. నీళ్ళు వచ్చేరోజు నాలుగింటికే లేస్తారు మా బాబాయ్. వంటిల్లంత నీళ్ళ బిందెలు, స్టీల్ డ్రమ్ములతో నింపేస్తారు నేలంత తడి తడిగ ఉండి జారిపడేల.ఉంటుంది. బాత్రూమ్స్ లో డ్రమ్స్ అన్నిట్లో నీళ్ళు నింపేస్తారు. ఇప్పుడు పిల్లలు దగ్గర లేకపోయినా ఇద్దరికి కూడా అదే పద్ధతిలో వంట ఇంటి నిండా నీళ్ల బిందెలు, డ్రమ్ములే.

“ఇద్దరికే అన్ని నీళ్ళెందుకు?” అంటే
“మేము బోర్ వాటర్ అసలు వాడము మిగిలితే చెట్లకు పోసేస్తాం”అంటుంది మా పిన్ని.

మా పిన్ని దగ్గర నాకు చనువు ఎక్కువే. నేను ఏది చెప్పినా కొంచెం గొణుగుతుంది, కానీ ఏమనదు. అందుకే నేను ఎప్పుడెళ్ళినా  ధైర్యంగా ఇల్లంతా నీట్ చేస్తాను.

మా పిన్ని వచ్చి “అదేంటి సింక్ దగ్గర బియ్యం కడిగిన నీళ్లు మొక్కలకు పోద్దాం అనుకున్నాను పారబోసావా? మిగిలిన చింతపండు పిప్పి ఉండాలి. బిందెల తోమడానికి పెట్టాను పారవేసావా? అన్నది.

“వాసనేస్తున్నాయ్ పిన్ని ఆ నీళ్ళు,ఆ చింతపండు అందుకే పారవేసాను ” అన్నాను.

“పూజగదిని శుభ్రం చేసినవా? నేను చేసే దాన్ని కదా.” అన్నది

“మీరిద్దరూ పూజ చేసుకొని మా ఇంటికి తొందరగా  వచ్చేయండి. మనందరికి సరిపడా చేశాను వంట. అందరం కలిసి తిందాం. ఆలస్యం చేయకండి. మేము ఆకలి ఆపుకోలేము” అన్నాను.

“మీరు తినేయండి. మేము వచ్చినాక తింటాం గానీ” అన్నది మా పిన్ని.

“అదేం కుదరదు అరగంటలో వచ్చేయండి” అని గట్టిగా చెప్పి వచ్చేస్తుంటే,

“అయ్యో పోచంపల్లి చీరల తను వచ్చినుండే మరిచేపోయాను. ఎప్పుడు వెళ్ళిపోయిండు. దుప్పట్లు ఆమ్మే అతను, చేగోడీలు అమ్మే ఆవిడ వచ్చినుండిరి. పండగ పూట భోజనం పెడదాం అనుకున్నాను వెళ్ళిపోయినారా?”అన్నది మా పిన్ని.

“నీవేం బాధపడకు వాళ్ళని మళ్లీ తర్వాత రమ్మని చెప్పి పంపించాను. తర్వాత వండి పెడుదువు గాని, ఈరోజు మీరు ఇద్దరు మా ఇంటికి వచ్చేయండి.” అని చెప్పి మా ఇంటికి వచ్చేసాను.

ఈ విధంగా మా పిన్ని నాకు తెలిసినప్పటి నుండి ఆవిడ పద్ధతుల్లో ఏమి మార్పు లేదు మా బాబాయ్ ఆమెను ఒక్క రోజు కూడా విసుక్కోకుండా, ఆమె ఎలా చేసినా ఏమనే వాడు కాదు.

అందుకే వాళ్ళు నిశ్చింతగా, సంతోషంగా,  ఆరోగ్యంగా టీవీ చూస్తూ గడిపేస్తున్నారు ఆ ఆదర్శ దంపతులు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!