మనసు భాద

మనసు భాద

రచన:: పి. వి. యన్. కృష్ణవేణి

ఏం చేస్తోంది, పెళ్ళికూతురు అంటూ  హడావిడిగా వచ్చింది మా అత్తయ్య.

ఏంటి అత్తయ్య నువ్వు కూడా,  రావడం ఇప్పుడా?

ఏం చేయను హరిత? ఇంట్లో ఇబ్బందులు నీకు తెలియనివి కాదు కదా!!! మీ మామయ్య తో పెట్టుకుంటే ఇంతే.  ఆఫీస్ పనులు, ఆ పనులు ఈ పనులు అంటారు.

నిన్ననే వద్దామంటేనేమో మీ బావకి ఏదో ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉందట.  అందుకే ఆగిపోవాల్సి వచ్చింది అంటూ సమాధానం ఇచ్చింది అత్తయ్య.

సరేలే అత్తయ్యా,  నీ బాధలన్నీ నాకు తెలుసు కదా!!!! కానీ మనసూరుకోక అడిగాను అంతే అన్నాను.

నువ్వు నాకు కోడలివి కదా!!!! అందుకే నన్ను బాగా అర్థం చేసుకుంటావు. కానీ ఏం చేస్తాం నిజంగా కోడలిని చేసుకునే అదృష్టం నాకు లేకుండా పోయింది.  మీ బావ ఏమో ఇంకా చదువు, జీవితం లో సెటిల్మెంట్ లేదు అంటూ కూర్చున్నాడు. మీ నాన్న ఏమో,  నీ పెళ్లి చేయాలని తొందర పడిపోయాడు. నువ్వు బయట పిల్లవి అయిపోతున్నావు అని బాధపడింది.

నిజంగానే బయటకు వెళ్ళి పోతున్నాను కదా!!!!  ఇంకా బయట పిల్లనే.  అందుకే అంటారేమో ఆడపిల్ల ఎప్పటికైనా ఆడ పిల్లే  కానీ ఈడపిల్ల అవ్వదు అని.

ఎంతో గారాబంగా పెంచుకున్నా,  పెళ్ళి టైం వచ్చేసరికి ఆడపిల్లని ఒక బాధ్యత గానే చూస్తారు ఎప్పుడు పెళ్లి చేసి పంపిచేద్దాం అన్నట్టు.

చక్కగా ముస్తాబై, ఎడతెరిపి లేని ఆలోచనలతో అతి మధురం గా నవ్వుతూ, సున్నితమైన తన పాద స్పర్శతో ఆ పెళ్లి మండపం లోకి పెళ్లి కూతురు గా  అడుగు పెట్టింది హరిత.

కుడి చేతిని అమ్మ,  ఎడమచేతిని అత్తయ్య పట్టుకొని అప్పుడే నడక నేర్పుతున్న చిన్న పాపకు వలె నన్ను నడిపిస్తున్నారు.  నా వైపు చూసే మా అమ్మ చూపులో ఒక నీటి బిందువు… అవి ఆనందభాష్పాలు కావచ్చు.

నన్ను చూసే మా అత్తయ్య కళ్ళలో ఒక నిరాశ.  తన ఇంటి బంగారం,  వేరొక ఇంటికి పయణం అవుతోందని చిన్న బాధ. ఆ బాధ కనిపించనివ్వకుండా చిన్న చిరునవ్వు అత్తయ్య  పెదవుల పైన కదలాడుతోంది.

ఇంకా కొంచెం ముందుకు నడిచి చూడగా,  పెళ్లి మండపం ఎదురుగుండా నుంచుని ఉన్న నాన్నకు అటు పక్కన మావయ్య,  ఇటు పక్కన బావ మేము అండగా ఉంటామంటూ నిలబడ్డారు.

నన్ను చూసిన బావ కన్నుల్లో ఒక లాంటి మెరుపు. ఆ మెరుపు, చిన్నతనం నుంచి కలిసి పెరిగిన అనురాగానికి గుర్తు. చిలిపి తనపు చివరి మజిలీ లో ఉన్న నేను బావ ని చూసి, చిన్న చిరునవ్వుతో పలకరించాను.

తల తిప్పి ఇటు పక్క చూస్తే,  నా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నట్టు, అన్ని బంధాల బదులు ఈ ఒక్క బంధం చాలు. నీకు అన్నీ నేనే అయి ఉంటాను.  అంటూ నాకు హామీ ఇస్తున్నట్టుగా… పెళ్ళికొడుకు నా కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూనే.  … నా  ఆనందం కోసం                వెదుకుతున్నాడు.

మా అమ్మానాన్నలకు నాపై అపురూపమైన మమకారం అయితే,  మా అత్తయ్య మావయ్య కు నాపై ఉండేది  మధురమైన ప్రేమ.  నీకు ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటాను అంటూ మా బావ స్నేహ హస్తం అందిస్తే,  నీ అందమైన రూపం వెనుక ఉన్న  నీ అందమైన మనసు కూడా  నాకు తెలుసులే  అంటూ, జీవితాంతం నీకు అన్నీ నేనే అంటూ నా చెయ్యి అందుకున్నాడు అశ్విన్ ( పెళ్ళికొడుకు).

ఇన్ని బంధాలు నా చుట్టూ ఉండగా నా జీవితంలో ఇంకేం కొరత అనుకుంటూ ఉండగా పెళ్లి తంతు ముగిసింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!