అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్(o.c.d)

అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్(o.c.d)

రచన  :: సావిత్రి కోవూరు

“హలో అమ్మ,  ఏం చేస్తున్నావ్” అన్నది మానస.

“ఏం లేదు ‘బ్రేక్ ఫాస్ట్’ కి టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్న” అన్నది విశాలాక్షి.

“అవునా,  అయితే అరగంటలో నీ ముందు ఉంటాను. వెన్నపూసతో మంచి మసాలా దోశ చెయ్యమ్మా. నీ చేతి దోశ తిని చాలా రోజులు అయింది.” అన్నది.

“అదేంటి? ఆఫీస్ పని లేదా ఈరోజు” అన్నది తల్లి.

“ఉన్నదమ్మా రోజు పని చేసి చేసి విసుగనిపిస్తుంది. అందుకే ఈరోజు లీవ్ పెట్టాను. మీ అల్లుడు ఏదో పని ఉందని ఆఫీస్ కి వెళ్ళారు. మీ దగ్గరికి వెళ్ళోస్తానని అత్తయ్యకు చెబితే ‘వెళ్లి రా. మా వంట సంగతి నేను చూసుకుంటాను కానీ’ అన్నారు.
అందుకే వెంటనే బయలుదేరా. మళ్ళీ సాయంత్రం ఆయన ఇంటికి వచ్చేసరికి వెళ్ళిపోతాను.” అన్నది.

“సరేలే, నీవు వచ్చేసరికి దోశ చేస్తాను రా” అన్నది తల్లి.

నల్లకుంట నుండి క్యాబ్ తీసుకుని గచ్చిబౌలికి వచ్చేసరికి గంట ఎలాగ పడుతుంది అని విశాలాక్షికి తెలుసు. మానసకి బోర్ కొట్టినప్పుడల్లా అలా వచ్చేస్తుంది. వాళ్ళ అత్తగారు కూడా కోడలు వారమంతా పనిచేసి అలిసిపోతుందని పుట్టింటికి వెడతానంటే ఎప్పుడూ అభ్యంతరం చెప్పదు.

విశాలాక్షి కొడుకుతో భర్తతో “మానస బ్రేక్ఫాస్ట్ కు వస్తుందట, మీరు చేస్తారా, అది వచ్చిన తర్వాత చేస్తారా? రమ్య మానస వచ్చిన తర్వాత తింటుందట.” అన్నది.

“సూర్యారావు సరేలే, మానస వచ్చిన తర్వాత అందరం కలిసి తిందాం.” అన్న గంటకే మానస వచ్చేసింది. అందరూ కలిసి టిఫిన్ చేసి, కాఫీ తాగి కూర్చున్నారు.

శ్రీహర్ష “అక్కా, నాకు కొంచెం ఆఫీస్ పని ఉంది నేను కంప్లీట్ చేసి వచ్చి మీతో జాయిన్ అవుతాను.” అని గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.

“రమ్య కూరలు తీసుకురా, నేను కట్ చేసి ఇస్తాను”అన్నది విశాలాక్షి.

“అక్కర్లేదు అత్తయ్య మీరు వదినతో మాట్లాడుతుండండి. అరగంటలో వంట చేసేస్తా” అని వంటింట్లోకి వెళ్ళిపోయింది రమ్య.

మానస తల్లి, తండ్రితో హాల్ లో కూర్చుంది. “ఏంటమ్మా విశేషాలు అన్నారు సూర్యారావు కూతురుతో”

“ఏముంటాయి నాన్న. ఇంకా వర్క్ ఫ్రం హోం చేస్తున్నాను. శ్రీకాంత్ మాత్రం అప్పుడప్పుడు ఆఫీస్ కి వెళ్లి వస్తుంటాడు” అన్నది.

“అమ్మా ఫిబ్రవరిలో మనీష్  పెళ్లి వరకు కరోనా కేసులు ఎక్కువ  లేవు కదమ్మా. అది సతీష్ బావ, మనీష్, మాలతి అక్క అదృష్టం అనుకోవాలి. లేకపోతే వాళ్ళు కష్టపడి అమెరికా నుండి ఇండియాకు వచ్చి, అన్ని సిద్దం చేసుకున్నాక పెండ్లి పోస్ట్ పోన్ అయితే ఎంత కష్టమయ్యేది. అన్నీ రెడీ చేసుకున్నాక పోస్ట్ పోన్ అన్ని రోజులు ఇక్కడ ఉండలేరు. వెళ్ళి మళ్ళీ రావాలంటే లీవ్స్ ఉండాలి ఇద్దరికి, టికెట్స్ దొరకాలి, ముఖ్యంగా ఈ కరోనా తో గొడవ ఎన్ని సమస్యలు.ఎంత ఇబ్బంది.

అయినా కూడ వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వచ్చిన వాళ్ళకి మాస్కులు, శానిటైజర్లు రెడీగా పెట్టారు. హాలు రోజుకు మూడు సార్లు శానిటైజ్ చేయించారు.  కొద్దిమంది ముఖ్యమైన అతిథులను మాత్రమే పిలిచి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ఎన్నో రోజుల తర్వాత అందరు ఎంజాయ్ చేశారు. పెళ్లి అవ్వగానే వింతగా పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది” అన్నది మానస.

 “అవునే మేము కూడా అదే అనుకుంటుంటాం. ఫిబ్రవరి మాత్రము, కరోన కేసులు చాలా తక్కువ ఉన్నాయి. మార్చి నుండి కేసులు ఎక్కువై పోయాయి. అది మనీష్ అదృష్టం అనుకోవాలి” అన్నది విశాలాక్షి.

“అమ్మ మీ కజిన్ అదే సరళ పిన్ని కూతురు సౌజన్యని  అత్తగారు వాళ్ళు తీసుకెళ్ళడం లేదట. సమస్య ఏంటి, బాబాయ్ గారు మా మామగారు క్లోజ్  ఫ్రెండ్స్ కదా. మొన్న బాబయ్ గారు వచ్చి మా మామ గారితో బాధపడుతూ చెబుతుంటే విన్నాను” అన్నది మానస.

“అదో పెద్ద కథ ఈ అమ్మాయి పుట్టక ముందు వాళ్లకి ఇద్దరు అమ్మాయిలు పుట్టి పోయారు. అందుకే ఈ అమ్మాయిని అపురూపంగా, అతి జాగ్రత్తగా, అతి గారాబంగా పెంచుకున్నారు. అంటే నడిస్తే కాళ్లకు మట్టి అంటుతుందన్నంత జాగ్రత్తగ అనేకంటే చాదస్తంగా పెంచారు అంటే బాగుంటుందేమో. అంటే ఇంట్లో కూడా చెప్పుల్లేకుండా నడవనిచ్చెవాళ్ళు కాదు. ఏది ముట్టుకున్నా బ్యాక్టీరియా ఉంటది, వైరస్ ఉంటది, డస్ట్ ఉంటది అనే వారు. ఎవరన్నా ముద్దుగా ఎత్తుకుందామనుకున్నా ఇచ్చేవారు కాదు. ఏది ముట్టుకున్నా, ఎవరు ముట్టుకున్నా చేతులను నాలుగైదు సార్లు కడిగేవారు. దానికి కూడ అదే అలవాటు చేశారు.

ఏ కాలమైనా వర్షం పడుతున్నా చలి విపరీతంగా ఉన్నా, తప్పనిసరిగా రెండు సార్లు స్నానం చేయించడం, రెండుసార్లు కాళ్ళు ముఖము కడగడం, పనిమనిషి ఉతికిన బట్టలను మళ్ళీ ఉతికి వేయడం చేసేవారు. అంతేకాకుండా ఆ అమ్మాయి పాలు, పెరుగు వద్దన్నా వాని ఉపయోగాలు తెలుపకుండ ఆమె ఇష్టమొచ్చినట్టు ఉండనిచ్చే వారు. అన్నం తినే పళ్ళాన్ని కూడా మళ్లీ మళ్లీ కడిగి పెట్టేవారు.

ఆ అమ్మాయికి ఇంటి దగ్గర కానీ స్కూల్లో కానీ  ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇంట్లో  నాన్నమ్మ, నాన్న, అమ్మ వీళ్లే ఆమె లోకం. వాళ్లకు ఉన్న చాదస్తాలు అన్ని ఆ అమ్మాయికి అబ్బినాయి. ఆ అమ్మాయికి తన వయసు వాళ్లు ఎలా ఉంటారో కూడా తెలిసేది కాదు. అలాగే అపురూపంగా పెంచారు. చదువు బాగానే చదువుకునేది.

డిగ్రీ కంప్లీట్ కాగానే చుట్టాలు అందరికీ చెప్పి వెతికి వెతికి మంచి ఉద్యోగం, కుటుంబము, రూపము, గుణము ఉన్న అబ్బాయిని చూసి, ఎంతో వైభవంగా పెళ్లి చేశారు. ఆ అబ్బాయి కూడా చాలా సౌమ్యుడు. పెళ్లి కాగానే హనీమూన్ వెళితే అక్కడ ఈ అమ్మాయి హోటల్ భోజనం సహించదు అని, ఉపవాసాలు చేసేసరికి, ఆ అబ్బాయికి విసుగు పుట్టిందట. అక్కడంతా పండ్లు, పండ్ల రసాలతో గడిపిందట. అక్కడ కూడా  మళ్లీ మళ్లీ చేతులు కాళ్లు కడిగిందే కడిగడం చేసిందట.

ఇంటికి వచ్చిన తర్వాత కూడా చేతులు కడగడం కాళ్ళు కడగడం చేసేదట. కడిగిన పాత్రలను మళ్ళీ మళ్ళీ కడగడం, ఉతికిన బట్టలు మళ్ళీమళ్ళీ ఉతికి వేసుకునేదట. ఎక్కడికైనా బయటకి వెళదామా అంటే ఒప్పుకునేది కాదట. సినిమాకెళ్తే సీట్స్ శుభ్రంగా లేవని, ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్తే వాళ్లు శుభ్రంగా ఉండరని, శుభ్రంగా వండరని ప్రతిదానికి ఏదో వంక పెట్టేదట.

ఆ అబ్బాయికి విసుగు పుట్టి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, ఇలాగ కొందరికి ఉంటుంది. దానిని ఓసిడి అంటారు. అంటే ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’ అంటారు. ప్రవర్తనలో మార్పు తెచ్చేలాగ కౌన్సెలింగ్ తోనే దానిని పోగొట్టాలి అని చెప్పాడట. అతని ఫ్రెండ్స్ కి, చుట్టాలకి అందరికీ ఈ అమ్మాయి విషయం తెలిసి, అతని పై జాలి చూపించేవారట.  అబ్బాయి అది తట్టుకోలేక  ఈ విధంగా చేస్తుందని దాని తల్లిదండ్రులకు చెపితే “అదంతా మా తప్పే బాబు. మేమే చిన్నప్పటి నుండి దానిని అలా పెంచాము. అదే ఇప్పుడు అలవాటు అయిపోయింది. అది ఇంత ముప్పు తెస్తుందని అనుకోలేదు. ఈ అమ్మాయి కంటె ముందు మాకు ఇద్దరు పిల్లలు పోవడం వల్ల, మేము దాని ఆరోగ్యం బాగుండాలని, అతి జాగ్రత్తగా పెంచాం. ఆ జాగ్రత్తే దానిని సంసార జీవితానికి దూరం చేస్తుందని అనుకోలేదు
మేము. మా అమ్మాయిని కొన్ని రోజులు మా ఇంట్లో ఉంచుకొని మార్చడానికి ప్రయత్నిస్తాము.”అన్నారట.

కానీ పుట్టినప్పటినుండి అలవాటయిన పద్ధతులు ఆ అమ్మాయి మార్చుకోలేక పోతుంది. ఆ అమ్మాయిని చూసి తల్లి తండ్రి ఎంతో బాధ పడుతున్నారు. చూసి చూసి ఆ అబ్బాయి విసిగిపోయి ‘మీ అమ్మాయిని డాక్టర్ కు చూపెట్టండి. మామూలు మనిషి అయ్యే వరకు నేను తీసుకెళ్ళను’ అని వెళ్ళిపోయాడట” అన్నది విశాలాక్షి.

“ఇలాంటివి కూడా సంసార జీవితానికి దూరం చేస్తాయా అమ్మా?” అన్నది మానస బాధగ.

“మరి ఏమనుకున్నావ్ మితిమీరిన అలవాట్లు ఏవైన అనర్ధదాయకమే. ఇప్పుడు  మా ‘కజిన్’ వాళ్లు ఎంత బాధ పడుతున్నారో ఆ దేవుడికే తెలుసు. కానీ ఎలాగైనా ఆ అమ్మాయిని మామూలుగా చేయడానికి శత విధాల ప్రయత్నిస్తున్నారు. అలా మామూలు మనిషయితే ఆ అబ్బాయి తీసుకెళ్తాడు అని ఆశ.”  అని ముగించింది విశాలాక్షి.

“అలా ప్రత్యేకంగా పెంచడం వల్ల, నలుగురితో కలవక పోవడం వల్ల మనుషులు చాల నష్టపోతారమ్మా. నలుగురితో కలసి మెలసి ఉండడం వల్ల సమాజమంటె ఏంటి, సమాజంలో మన పాత్ర ఏంటి, బాహ్యప్రపంచంలో మనమెలా మెలగాలి అన్నది తెలుస్తుంది. మనిషి అనుకరణ వల్ల ఎన్నో నేర్చుకుంటాడు.

అంతెందుకు ఇంట్లో పెరిగిన పిల్లలకి, హాస్టల్స్ లో పెరిగిన పిల్లలకి మెటాలిటీలో చాల తేడా ఉంటది. హాస్టల్ లో పెరిగిన పిల్లలు స్వతంత్ర్యంగా ఆలోచించ గలుగుతారు. స్వతంత్ర్యంగా నిర్ణయాలు తీసుకొని బ్రతుక గలుగుతారు. అందుకే పిల్లలు నలుగురితో   కలువడం అవసరం.” అన్నారు సూర్యారావు.

ఈ లోపల వంట ముగించి వచ్చిన రమ్య “అత్తయ్య వంట అయింది. అందరూ రండి” అని పిలిచింది.

అందరూ భోజనాలు చేస్తుంటే “అమ్మా మా స్నేహితురాలు ఒక అమ్మాయి సైకాలజీ లో మాస్టర్స్ చేసిందమ్మా. ఆ అమ్మాయి ఇలాంటి కేసులు కూడ చూస్తుంది. ఒక సారి సౌజన్యను ఆ అమ్మాయి దగ్గరకు తీసుకెళ్ళమని పిన్నికి చెప్తాను” అని ఫోన్ చేసి చెప్పింది మానస.

 ఆ సైకాలజిస్టు నంబర్ ఇచ్చి “పిన్ని, నేను ఆమెకి చెప్తాను. మీరు తప్పకుండ వెళ్ళి కలవండి. ఆమె తప్పకుండ బాగు చేస్తుంది. సౌజన్యకు అదేం పెద్ద జబ్బుకాదు. ఇంకా కొందరు ఇతరులకు హాని చేయడం, తనకు తాను హాని చేసుకోవడం, తెల్లవార్లు తలుపులు సరిగ్గా వేసామా అని చూడడం
ఇలా రక రకాల అలవాట్లు ఉంటాయి..సౌజన్యది చాల చిన్న సమస్య పిన్నీ. ‘బిహేవిర్ థెరపి’ అనె ట్రీట్మెంట్ తో మామూలుగా ఐపోతుంది.అంటే తన మైండ్ నుండి ఆ ఆలవాటును మాటలతో తుడిచేయాలి దానినే ‘కౌన్సెలింగ్’ అంటారు.అంతే.” అని చెప్పింది.

“రేపే వెళ్తాము మానస, చాల థాంక్స్.వెళ్ళోచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను” అని అన్నది సరళ.

రమ్య మానసతో “వదిన మొన్న మీ తమ్ముడు ఆన్లైన్లో రెండు చీరలు తెప్పించారు. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. మిగతాది నేను తీసుకుంటాను” అన్నది.

“నాకిప్పుడేమి వద్దు రమ్య, నా దగ్గర కొత్తవి చాలనే వున్నవి. అయినా ఇప్పుడు కొత్త చీరలు తీసుకోవడమే దండుగ.  ఈ కరోన పుణ్యమా అని ఎక్కడికి వెళ్ళటం లేదు కదా మనం.” అన్నది.

“మనిద్దరికనే తెప్పించారు వదిన. ఒకటి మీరు తీసుకోండి.” అన్నది రమ్య.

“నాకు ఏదైనా ఓకే రమ్య” అన్నది మానస.

“వదిన రేపు శనివారం కదా. ఆఫీస్  లు ఎలాగు ఉండవు. అన్నయ్య గారిని ఇంటికి వెళ్లి, వాళ్ళ అమ్మ నాన్నను తీసుకుని  రమ్మని చెప్పండి. అందరము కలసి ఫామ్ హౌస్ కి వెళ్దాం” అన్నది

“నేను మీ అన్నయ్యతో చెప్పానంటే ‘నీవు అక్కడికి వెళ్తే ఏదో ప్రోగ్రాం పెడతావ్’ అని నన్ను కోప్పడతారు. నీవే మీ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పు. సరదాగా వెళ్లొద్దామని, చాలా రోజులైంది బయటకు వెళ్ళక ఫామ్ హౌస్ అంటే ఎవరు ఉండరు. వెళ్లి రావచ్చు” అన్నది మానస.

“అవునక్కా అందరమూ మామిడి తోటలో కూర్చుని భోజనాలు చేసుకుని కొంచెం ఫ్రెష్  గాలి పీల్చుకుని, సాయంత్రం వరకు గడిపి మెల్లగా వద్దాం. ఎన్ని రోజలైందో సరదాగా బయటకెళ్ళి” అన్నాడు శ్రీహర్ష.

“సరేరా, అలాగే వెళదాం, మీ బావగారు ఒప్పుకుంటే.”అన్నది మానస.

అందరు ‘ఫామ్ హౌస్ ప్రోగ్రాం’ గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నారు.

ఒక నెల రోజుల తర్వాత సరళ పిన్ని ఫోన్ చేసి “మానస మీ ఫ్రెండ్ ని కలిశాము. ప్రతి రోజు సౌజన్యని కౌన్సెలింగ్ కొరకు తీసుకు రమ్మని చెప్తే వెళ్తున్నాము.సౌజన్య పూర్తిగా మారిపోయింది. అల్లుడుగారు కూడ చాల సంతోషించారు. వారం తర్వాత వచ్చి తీసుకెళ్తానన్నారు. ఇంకా రెండు సిట్టింగ్స్ అయితే నార్మల్ అవుతుందన్నది ఆ అమ్మాయి. ఇదంతా నీ చలవేనే మానస. నీ రుణం ఎలా తీర్చుకోను” అన్నది.

“అదేంటి  పిన్ని అలా మాట్లాడుతారు. మీరేం పరాయివాళ్ళా? నాకు తెలిసిన విశయం మీకు చెప్పాను. మనందరం అది మనలాగ మామూలుగ ఉండాలనే కోరుకుంటాము. అందరిలా చక్కగా కాపురం చేసుకోవాలనే అనుకుంటాము.” అన్నది ఒక కాపురం నిలబెట్టానన్న సంతోషంతో మానస.

( పై కథ నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. )

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!