మనసుకు వేసుకున్న శిక్ష

(అంశం :: మది దాటని ప్రేమ)

 మనసుకు వేసుకున్న శిక్ష

రచయిత::సావిత్రి కోవూరు 

మా ఇంట్లో మా అన్నయ్య వాళ్లకు చదువుకోడానికి ఒక గది ఉండేది. దానిలో తన ఫ్రెండ్స్ ఎంతోమంది ఆదివారం ఉదయం వచ్చి సాయంత్రం వరకు గడిపే వాళ్లు. సినిమాల గురించి, నావల్స్ గురించి, పరీక్షల గురించి, ఒక టాపిక్ అని కాకుండా ఎన్నో విషయాల గురించి గట్టిగట్టిగా మాట్లాడుకునే వాళ్ళు.

నవ్వులు, కేకలు, జోక్స్, పాటలు  ఒక సబ్జెక్ట్ అని కాకుండా అన్ని విధాల ఆ గదిలో అల్లరి చేస్తు చిన్న పిల్లల్లాగ గడిపేవాళ్ళు. మళ్లీ తలుపులు తీసినారంటే  నిశ్శబ్దంగా ఉండే వాళ్ళు. వారిలో ఒక ఐదుగురు మాత్రం పర్మినెంట్ గా ప్రతివారం వచ్చేవాళ్ళు.వారిలో రాజేంద్రర్ ఒకడు.

అతడు మా ఇంటికి దగ్గరలోనే తల్లి, తండ్రి, చెల్లెలు తో కలిసి ఉండేవాడు.. ఈ మధ్యనే మా ఇంటికి రెండిళ్ళవతల ఉన్న ఇంట్లోకి అద్దెకు దిగారు. అప్పటి నుండి మా అన్నయ్య దగ్గరకు వచ్చేవాడు.  కానీ ఎక్కువ మాట్లాడే వాడు కాదు. నవ్వడం కూడా చాలా తక్కువ, కానీ హిందీ పాటలు మాత్రం చాలా బాగా పాడేవాడు. నేను హాల్లో కూర్చుని, వెళ్తుంటే, వస్తుంటే చూసేదాన్ని. నాకు ఎందుకో అతను చాల స్పెషల్గా కనిపించేవాడు.

మా అన్నయ్య ఫ్రెండ్స్ అంతా నాతో, చెల్లి తో అప్పుడప్పుడు మాట్లాడేవారు. మేము మా అన్నయ్య ఫ్రెండ్స్ అందర్నీ ‘అన్నయ్య’ అని పిలిచేవాళ్ళం. మా అన్నయ్యతో బాటు వాళ్ళకి కూడా రాఖీ కట్టేవాళ్ళం. ఈ రాజేందర్  రాఖీ పౌర్ణమి రోజు అసలు వచ్చే వాడు కాదు.
కొన్ని రోజుల తర్వాత నాకు తెలియకుండానే అతని కొరకు ఎదురు చూసేదాన్ని, అతన్ని పరికించి చూసేదాన్ని, అతను వస్తున్నాడు అంటేనే మనసు ఆనందంతో నాట్యం చేసేది.
అతని ఇంజనీరింగ్ అయిపోయి బెంగళూరులో మంచి జాబ్ దొరకడంతో వెళ్లిపోయాడని అన్నయ్య అమ్మ తో చెప్తుంటే విన్నాను. ఎందుకో ఆ వార్త వినగానె చాలా ఏడుపొచ్చింది. అప్పుడే తెలిసింది అతన్ని నేను చాల ఇష్టపడుతున్నానని, ప్రేమిస్తున్నానని.

వాళ్ళు కూడ మా వీధిలోనె ఉంటారు కనుక, వాళ్ళ అమ్మ, చెల్లి కూడా బాగానే పరిచయం నాకు. అందుకనే వాళ్ళ ఇంటికి మధ్య మధ్య వెళ్ళేదాన్ని. ముఖ్యంగా రాజేందర్ ఎప్పుడు వస్తాడో లాంటి విశయాలేమైనా తెలుస్తాయని వెళ్ళేదాన్ని.

నా డిగ్రీ అయిపోయిన తర్వాత అతనితో మాట్లాడి, అన్నయ్య, అమ్మా, నాన్నలకు చెప్పి ఎలాగైనా అతనిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. అతన్ని చూడకుండా నేను ఉండలేనని తెలుసు కున్నాను. అతడు దూరంగా వెళ్లి పోతే ఆ ఎడబాటు చాల బాధగా ఉంది నా మనసుకి. ఇదంత చాల వింతగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు నా మనసులోని మాట అతనికి చెప్పనే లేదు. కాని ఇరవై నాలుగు గంటలు  అతని ఆలోచనలతోనె గడిచిపోతుంది. అన్నం కూడ సరిగ్గా తినాలనిపించటం లేదు.ఎవరితో మాట్లాడనిపించటం లేదు. మనస్సంత గందరగోళంగ ఉంటుంది.

అమ్మ ఎన్నోసార్లు అడిగేది “ఎందుకే అలా ఉంటున్నావు ఒంట్లో బాలేదా?పుస్తకాలు ముట్టటం లేదు ,టీవీ చూడటం లేదు, చెల్లితో పోట్లాడటం లేదు, నాన్నతో కబుర్లు చెప్పట్లేదు. బోర్ గ ఉంటే చెల్లిని తీసుకొని సినిమా కెళ్ళు. పోని  టీవీ చూడు”అనేది
“ఏం లేదమ్మా బానే ఉన్నాను” అని ఏదో చెప్పేదాన్ని. ఇట్లుండగ, ఒక రోజు రాజేంద్ర చెల్లి ‘రాధిక’ పెళ్లి అని అమ్మ చెప్పింది. ఈమధ్య ఆ అమ్మాయి తో ఫ్రెండ్షిప్ ఎక్కువ అయింది. వాళ్ళ అమ్మ కూడా నాతో బాగా మాట్లాడేది.
రాధిక పెండ్లి షాపింగ్ లో నేను కూడా చురుకుగా పాల్గొని ఎంజాయ్ చేశాను.

“రాధిక నీ పెండ్లి షాపింగ్ కి మా అమ్మాయి వస్తుంది కదా! నీవు కూడా మా అమ్మాయి పెళ్లి షాపింగ్ కి రావాలి” అన్నది అమ్మ.

“వాళ్ళు రాకుండ ఎలా అవుతుందమ్మ”  అనుకున్న  మనసులో  ఏవేవో ఊహించుకొని.

“పెండ్లి నీదా మీ ఫ్రెండ్ దా అంత హడావుడి చేస్తున్నవు” అనేది అమ్మ.

పెళ్ళి రెండు రోజులు ఉన్నప్పుడు రాజేందర్ వచ్చాడు. అతనికి బెంగళూరు నుండి  హైదరాబాద్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ కూడ అయిందని అన్నయ్య చెప్పాడు. నా ఆనందానికి అంతే లేకుండా పోయింది. రాజేందర్, పెండ్లి రోజు ఒకటి రెండు మాటలు పొడిపొడిగా మాట్లాడితే నా మనస్సెంత పొంగిపోయిందో చెప్పలేను.
ఇక ఆలస్యం చేయకుండ, పెళ్లి హడావుడి తగ్గగానే నా మనసులో మాట అమ్మ వాళ్లకు చెప్పి రాజేందర్ కి ఇల్లాలిని కావాలని కలలు కనసాగాను.

పెళ్లి అయిన రోజు సాయంత్రం రాధిక ఫోన్ చేసి “సృజన ఒక సారి ఇంటికి రా ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను” అన్నది.

“అంత ముఖ్యమైన వ్యక్తి నీ పెళ్లికి రాలేదేంటి” అన్నాను.
“ఎగ్జామ్స్ ఉండడంవల్ల రాలేదు. అందుకే ఇప్పుడు చివరి ఎగ్జామ్ రాసి డైరెక్ట్  గ వచ్చింది. తొందరగా రా” అన్నది.

సరే రాజేందర్ తో వీలైతే ఒక్కసారన్న మాట్లాడొచ్చని ఉత్సాహంతో తొందరగ రెడీ అయిపోయి

“అమ్మా నేను రాధిక వాళ్ళ ఇంటికి వెళ్లి ఇప్పుడే వస్తాను” అన్నాను.

“ఇప్పుడు ఎందుకే వాళ్ళింటికి రాధిక అత్తారింటికి వెళ్లే హడావుడిలో ఉంటుంది” అన్నది.

“ఇప్పుడే వస్తానమ్మా” అంటూ వెళ్లిపోయాను.
నేను వెళ్ళేసరికి రాధిక గదిలో  రాధికా, రాజేందర్, ఒక కొత్త అమ్మాయి నవ్వుతూ  మాట్లాడుకుంటున్నారు. రాజేందర్ ఆ అమ్మాయితో ఏవో జోక్స్ వేసి నవ్వుతున్నాడు. రాజేందర్ అంతగా నవ్వడం ఎప్పుడు చూడలేదు నేను.

రాధిక నన్ను చూసి “నీ కొరకే ఎదురు చూస్తున్నాను ఇదిగో ఈ అమ్మాయి మా మామయ్య కూతురు ‘మల్లిక’. నా కాబోయే వదిన, నీకు పరిచయం చేస్తానన్న ఫ్రెండ్. ఆరునెలలు అయితే తన చదువు ఆయిపోతుంది. వెంటనే మా అన్నయ్య రాజేందర్ వైఫ్  గా,  మా వదిన గా మా ఇంటికి వస్తుంది”అని ఎంతో సంతోషంగా చెప్పింది.

రాధిక ఇంకా ఏమేమో మాట్లాడుతుంటే నా చెవులకేమి విన్పించట్లేదు. నా కాళ్ళకింద భూమి కదులుతున్నట్టు, నేను పాతాళంలోకి కూరుకు పోతున్నట్లు అనిపించింది. ఎలాగో రాధికతో కంగ్రాట్స్ అని చెప్పి, “అమ్మ ఎందుకో తొందరగా రమ్మని ఫోన్ చేస్తుంది నేను మళ్ళీ వస్తాను” అని చెప్పి బయట పడ్డాను.ఎలా ఇంటికి వచ్చానో, ఎలా నా రూమ్ లో పడుకున్నానో తెలియలేదు. అలసిపోయేలా ఏడ్చేశాను. ఎంత సేపు ఏడ్చానో ఏడ్చి ఏడ్చి అలాగే పడుకున్నా.
అమ్మ వచ్చి “ఎప్పుడు వచ్చి పడుకున్నవే. నేను చూడనే లేదు. కళ్ళేంటి అంత ఉబ్బి పోయినై. పెళ్ళిలో తిరిగి తిరిగి బాగ అలిసిపోయినట్టున్నవ్. లే, లేచి మొహం కడుక్కో” అని చెప్పి వెళ్ళిపోయింది.
లేచి మొహం కడుక్కుని అలాగే కూర్చుని ఆలోచించడం మొదలు పెట్టాను. ఒక్క రోజు కూడా రాజేందర్ నాతో మాట్లాడలేదు, నవ్వలేదు, నావైపు ఎంకరేజ్ గ చూడలేదు, అసలు నాకు కల్లబొల్లి మాటలు చెప్పి మభ్య పెట్టి ఆశలు కల్పించలేదు.

మరి నేనెందుకు పిచ్చిదానిలా ఏమేమొ ఊహించుకొని, కలలు కన్నాను. మొదట్లోనే అతనితో ఒక్కసారి మాట్లాడితే ఇంత బాధుండేది కాదు కదా! ఇంత తెలివిలేకుండ ఎలా అనుబంధం పెంచుకున్నాను. ఇంకా నయం నా మనసులోని విషయం ఎవ్వరికీ చేప్పలేదు. చెప్తే అందరిలో చులకన అయ్యెదాన్ని.

అతని గురించి, అతని ఫ్యామిలీ గురించి, అతని ఆలోచనల గురించి, చుట్టాల గురించి అస్సలు తెలీదు. తెలియకుండా నా అంతట నేనే కలలుగని, ఊహల్లో తేలియాడడం నా అవివేకం.
కనీసం ఒక్కసారైనా అన్నయ్యతో అతని గురించి చెప్తే, అన్నయ్య అతని గురించి తెలుసు కునేవాడు.  ఇప్పుడు అనుకుని ఏం లాభం. నా తెలివి తక్కువ తనం తో నా మనసుకు నేనే శిక్ష వేసుకున్నాను.అది ఎప్పుడు కోలుకుంటదో కాలమే చెప్పాలి.

“నా మది దాటని ప్రేమతో ”  నన్ను నేనే నష్టపరుచుకున్నాను. అనుభవించక తప్పదు.అనుకున్నాను.

You May Also Like

One thought on “మనసుకు వేసుకున్న శిక్ష

  1. బాగుంది సావిత్రి గారూ… వయసు చేసే మాయ…
    👌👌💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!