మనసు గీసిన గీత

(అంశం :: మది దాటని ప్రేమ)

మనసు గీసిన గీత

రచయిత్రి: మంగు కృష్ణకుమారి

ప్రేంచంద్. అతని పేరు విన్నా, మనిషిని చూసినా, గీతాలక్ష్మి కి ఒళ్ళు పులకరించిపోతుంది. పక్క పక్క ఇళ్ళే. మూల్ చంద్ కి మంచి బిజినెస్ ఉంది. ప్రేంచంద్ కి ముందు ఇద్దరు కొడుకులు. ఇద్దరు కోడళ్ళు వచ్చేరు. అందరూ మూల్ చంద్ భార్య మీరాభాయ్ మాట జవదాటరు.

గీత అంటే మీరాకి చాలా గారం. స్వీట్స్, రోటీలు పనీర్ కర్రీలు ఏది చేసినా గీతకి ఇవ్వక మానదు. గీత మీరా అంటే చాలా గౌరవంగా ఉంటుంది.

ప్రేంచంద్ ఎమ్ బిఎ పూర్తి చేసి, తండ్రి బిజినెస్ లో హెల్ప్ చేస్తున్నాడు.

గీత అక్కడకి వెళితే ఆమె ప్రాణం అంతా అతనిమీదే ఉంటుందని, అతని చిన్న నవ్వుకీ ఆశగా చూస్తుందని ఎవరికీ తెలీదు. గీత తల్లి రామలక్ష్మి చాలా సంప్రదాయం పాటించే ఉత్తమఇల్లాలు. మీరాతో ఆమెకీ మాట స్నేహం కలిసేయి. వాళ్ళు కలిసి భజనలు చేసేవారు. షాపింగ్ లు చేసేవారు.

రామలక్ష్మి చేసిచ్చిన పులిహార మీరాకే కాదు ఆమె కొడుకులు, కోడళ్ళుఆఖరికి మూల్ చంద్ కూడా ఇష్టంగా తినేవాడు. వాళ్ళకోసం అని తక్కువకారం వేసి, నిమ్మరసం తో ఘుమఘుమలాడుతూ చేసేది రామలక్ష్మి.

ఆరోజు. భజన పూర్తయింది‌. మీరా పాలకోవాలు తెచ్చింది. తింటూ కబుర్లు చెప్తున్నారు. ‌చటక్కున మీరా అడిగింది.
“భాభీ, మన గీత కి షాదీ ఎప్పుడు?” గీతాలక్ష్మి ఉలిక్కిపడింది.
రామలక్ష్మి కూడా ఉత్సాహంగా
” మా దగ్గర బంధువుల అబ్బాయి ఇంజనీర్ చేసేడు. మన గీత అంటే ఇష్టం చూపిస్తున్నాడు. మాటలాడుకుంటేసంబంధం కుదిరినట్టే”. మీరా ఆనందానికిహద్దులేదు. ఆ రోజంతా గీత పెళ్ళి ఎలా ధూమ్ ధామ్ లా చేయాలో, తనుఎంత ఇష్టంగా ఉందో చెప్తూనే ఉంది.

ఆ వారంలోనే వరుడు శేఖర్ తల్లిదండ్రులు పెళ్ళి చూపులకి వచ్చేరు. శేఖర్ చాలా హుషారుగా అందరికీ కనిపించేడు.
మీరా స్వయంగా రసగుల్లా చేసి తెచ్చి తనని తను పరిచయం చేసుకుంది. శేఖర్ తల్లి మీరాని తన చెల్లిలాగే చూసింది.

గీతాలక్ష్మి ఆలోచిస్తూనే ఉంది.

నిశ్శబ్దంగా మీరా ఇంట్లోకి అడుగు పెట్టింది. వెళుతూనే ప్రేంచంద్ కనిపించేడు.
“ఓహ్ కంగ్రాట్స్. ‌మేరేజ్ ఫిక్స్ అయిందిట” నవ్వుతూ అన్నాడు. గీత గుండె లయతప్పింది. ఏదోఅనబొయి ఏమీ అనలేక మాటాడకుండా ఊరుకుంది.

ప్రేంచంద్ వివరాలు అడుగుతూనే ఉన్నాడు మీరా వచ్చింది. గీత కాబోయే అత్తగారిని శేఖర్ ని తెగ పొగిడింది.

“ఓహ్ అయితే మన గీత చాలా లక్కీ అన్నమాట” అన్నాడు ప్రేంచంద్.

గీతకి ఎంత ఆలోచించినా ఈ పరిస్థితుల్లో తన ప్రేమ బయట పెట్టకుండా ఊరుకుంటేనే రెండు కుటుంబాల స్నేహం సజీవంగా ఉంటుంది అనిపించింది. ఇంతకీ ప్రేంకి అసలు
తన మీద ఏ ఫీలింగ్ లేదేమో? ఏదో స్నేహితురాలు కదాని కాస్త ఆప్యాయంగా మాటాడేసరికి తనే ఎక్కువ దూరం ఆలోచించిందేమొ.

గిరుక్కున తిరిగి ఇంటికి వెళిపోయింది.
కానీ ప్రేంచంద్ కూడా తనలాగే ఆలోచించేడని, అతని మనసంతా తనే ఉందని గీతకి కూడా తెలీదు. అసలు ప్రేంచంద్ ఎవరికీ చెప్పలేదు. అనుమానంవచ్చేలా ప్రవర్తించలేదు. గీతమీద ఇష్టం పెరుగుతున్నా, తమ కుటుంబాలకలయిక ఎంత అసాధ్యమో అతనికి ప్రాక్టికల్ గా తెలుసు. ‌మీరాకి ఇప్పుడున్నఈ అభిమానం, స్నేహం ఏవీ ఉండవు.

ఇంట్లోంచి తగిలిసినా తగిలీవచ్చు. త‌న పలుకుబడి ఉపయోగించి మూల్ చంద్, రామలక్ష్మి కుటుంబాన్ని నవ్వులపాలు చేయవచ్చు. ఇంతకీ గీతకి ఒకవేళ శేఖర్ అంటే చాలా ఇష్టం ఉండి ఉంటే? రాజీపడి తీరాలి.

ప్రేం కూడా కామ్ గా అయిపోయేడు.

గీతపెళ్ళి చాలా సంప్రదాయకంగా నవ్వులతో సందడిగా జరిగింది. మీరా, ప్రేం చాల సహాయాలు చేసేరు. శేఖర్ ప్రేంచంద్ స్నేహితులు అయిపోయేరు. మీరా తెల్లటి వజ్రం ఉన్న ఉంగరం గీత వేలికి పెట్టేసరికి గీత మీరాని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది. “మా గుర్తుగా ఉంచు బేటీ, మళ్ళా ప్రేం పెళ్ళికి మీరుఇద్దరు రావాలి. కానుకలు తీసుకెళ్ళాలి” అంది ప్రేమగా. రామలక్ష్మితో పాటు శేఖర్ కూడా
“అమ్మాయి డిసైడ్ అయిపోయిందా? మాకు పరిచయం చేయరూ?” అన్నారు.

“ఓ మీకు చెప్పకుండానా? విద్యా మా దగ్గర బంధువుల అమ్మాయి. పుట్టినప్పుడే మా ప్రేం కి అనుకున్నాం” అంటుంటే శేఖర్ ప్రేంచంద్ కి షేక్ హేండ్
ఇచ్చేడు. అందరి మొహాలమీదా నవ్వులు విరిసేయి. గీతాలక్ష్మి తన మనసు పూర్తిగ శేఖర్ మీదకి తిప్పేసుకుంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!