అంతరాలు చెరిపిన ప్రేమ గుర్తులు

(అంశం: మనసులు దాటని ప్రేమ)

అంతరాలు చెరిపిన ప్రేమ గుర్తులు

రచయిత:పరిమళ కళ్యాణ్

మొట్టమొదటిగా కాలేజిలో అడుగుపెట్టిన రోజు అది. ఒక కొత్త రంగుల ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా అనిపించింది సుభాష్ కి. పదవ తరగతి వరకూ బాయ్స్ స్కూల్లో చదివిన సుభాష్ ఒక్కసారి కో-ఎడ్ కాలేజిని అందులో అమ్మాయిలని చూసేసరికి రెక్కలు తొడిగిన పక్షిలా భావించాడు.

అమ్మాయిలతో పెద్దగా మాట్లాడే అలవాటు లేకపోవడంతో అందరితో ఎక్కువ కలవలేక పోయేవాడు. కానీ తన స్నేహితులు అమ్మాయిలతో క్లోజ్ గా ఉండటం చూసి బాధ పడేవాడు.

నాకు కూడా ఎవరైనా ఒక మంచి అమ్మాయి దొరికితే బాగుణ్ణు అనుకునేవాడు. సరిగ్గా అప్పుడే కల్పన కాలేజీకి వచ్చింది. కల్పనని చూడగానే ఎదో వింత భావన కలిగింది సుభాష్ కి.

తనని చూడాలని, తనతో మాట్లాడాలని అనిపించేది. రోజూ తనని చూస్తూ ఉండేవాడు. ఒకరోజు ధైర్యం చేసి కల్పనతో మాట్లాడాలని వెళ్ళాడు.

“హాయ్ కల్పనా, నా పేరు సుభాష్, నాకు ఇక్కడ ఎవరూ ఫ్రెండ్స్ లేరు, నేను పెద్దగా ఎవరితోనూ మాట్లాడను. కానీ నిన్ను చూసిన దగ్గర నుంచీ నీతో మాట్లాడాలని అనిపిస్తోంది. నాతో స్నేహం చేస్తావా?” అని అడిగాడు అమాయకంగా.

సుభాష్ అమాయకత్వాన్ని, అతను ఎవరితోనూ కలవకపోవటం చూసిన కల్పన అతనితో స్నేహం చెయ్యటానికి ఒప్పుకుంది. అలా వారిద్దరి పరిచయం స్నేహంగా మారింది. రోజూ కాలేజీకి రాగానే ఇద్దరూ కలిసి క్యాంపస్ లో అడుగు పెట్టేవారు.

కాలేజి క్యాంపస్ లో గార్డెన్ దగ్గర ఉన్న పెద్ద రావి చెట్టు కింద ఉన్న బెంచ్ వాళ్ళ ప్లేస్ అయ్యింది. రోజూ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు, కాలేజి నుంచి ఇంటికి వెళ్ళేముందు ఇద్దరూ ఆ బెంచి మీద కూర్చుని కబుర్లు చెప్పుకునే వారు.

అలా కొద్ది రోజులకే వారిద్దరి స్నేహం కాలేజి అంతా మారు మోగిపోయింది. ఆ విషయం ఇద్దరి ఇళ్లలోనూ తెలిసింది. సుభాష్ తండ్రి ఒక చిరుద్యోగి, కానీ కల్పన తండ్రి వాళ్ళు చదివే కాలేజి యజమాని, అంతేకాదు ఆ ఊర్లో పెద్ద పేరుమోసిన వ్యక్తి.

అలాంటిది తన కూతురితో ఒక సాధారణ ఉద్యోగి కొడుకు స్నేహం చెయ్యటం కూడా సహించలేక పోయాడు సుదర్శనం.

కల్పన, సుభాష్ మాత్రం పెద్దల మాట లెక్క చేయకుండా ఇద్దరూ ఇంకా స్నేహంగా మెలిగేవారు. అది తెలిసిన కల్పన తండ్రి, సుభాష్ ని కాలేజీ నుంచి పంపెయ్యాలని చూసాడు. సుభాష్ తండ్రి ఉద్యోగం కూడా తీసి వేయించాడు.

విషయం తెలిసిన సుభాష్ చాలా బాధ పడ్డాడు. తన స్నేహం వల్ల, మొండి తనం వల్ల తండ్రి బాధపడాల్సి వచ్చిందని కుమిలిపోయాడు. కల్పనతో స్నేహం చెయ్యకూడదు అని అనుకున్నాడు.

మర్నాడు కాలేజిలో కల్పన ఎప్పటిలాగే వాళ్ళ బెంచి మీద కూర్చుని సుభాష్ కోసం ఎదురు చూస్తూ ఉంది. కానీ సుభాష్ రాలేదు. ఆ కాలేజి నుంచి వెళ్లిపోతున్నట్టు తెలిసింది కల్పనకు. సుభాష్ ని కలవడానికి వెళ్ళింది.

“సుభాష్! కాలేజి నుంచీ వెళ్ళిపోతున్నావా? నాతో మాట్లాడటం లేదు సరిగ్గా. ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు?” అని అడిగింది

“మన ఇద్దరి మధ్య ఉన్న అంతస్తుల అంతరాలు మనల్ని దూరం చేస్తున్నాయి కల్పన. అయినా ఆ ప్రశ్న మీ నాన్నని అడుగు ఎందుకు నన్నూ సుభాష్ ని దూరం చెయ్యాలని చూస్తున్నారు అని? అప్పుడు నీకే తెలుస్తుంది” అన్నాడు సుభాష్.

సుభాష్ వెళ్లిపోతుంటే చాలా బాధ పడింది కల్పన. తనకి ఎంతో మంది స్నేహితులు ఉన్నా కూడా సుభాష్ తనకి దూరం అవుతుంటే ఎందుకు అంత బాధ కలుగుతుందో ఆలస్యంగా గ్రహించింది కల్పన.

తండ్రి మాటతో సుభాష్ ఆ ఊరు నుంచి తండ్రితో పాటు బయలుదేరాడు. కానీ కల్పన గురించిన ఆలోచనలే తనని చుట్టుముడుతున్నాయి.

ఇద్దరూ ఒకరికొకరు దూరం అయ్యాక కానీ తెలియలేదు వాళ్ళ మనసులో ఉన్నది స్నేహం మాత్రమే కాదని, అంతకన్నా ఎక్కువ అనీ. దాని పేరే ప్రేమ అనీ…

కానీ అంతస్తుల తేడా కారణంగా, వాళ్ళ మనసులు దాటని ప్రేమ కాలేజిలోనే సమాధి అయిపోయింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!