మరోప్రస్థానం(సంక్రాంతి కథల పోటీ)

మరోప్రస్థానం

(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ-2022)

రచన: శింగరాజు శ్రీనివాసరావు

ఆమె ఓడిపోయింది. ఎదిరించి తీసుకున్న నిర్ణయం ఆమెను అగాధంలో పడవేసింది. వయసు తొందరపాటు కన్నవారి ప్రేమను కంటిముందు ఆవిష్కరించుకోలేక పోయింది. ఫలితంగా మోసపోయింది. కాదు తనను తనే మోసం చేసుకుంది. రాకేష్ ను నమ్మి నిండు జీవితాన్ని హారతి పట్టింది. అతను వెలుగులను దోచుకుని కొడిగట్టిన దీపానివని నిర్దయగా తోసిపారేసి అందకుండా సప్తసముద్రాలు దాటేశాడు. మధ్యతరగతి బ్రతుకు డబ్బు పలుకుబడికి ఓడిపోయి వీధిన పడే స్థితిలో చేయిపట్టి నడిపించిన చేయి చేరదీసింది. ఎంత వద్దనుకున్నా ప్రేగు తెంచుకుని పుట్టిన బిఢ్డను అనాథను చేయలేక పోయింది. భర్తతో కలసి సంతోష వార్తను మోసుకు రావలసిన ఆమె ఒంటరిగా తన తొందరపాటుకు ఫలితాన్ని ప్రతిరూపంగా మోస్తూ పుట్టినింటిలో అడుగుపెట్టింది. తప్పును తప్పని చెప్పి తప్పించుకోలేని పరిస్థితి ఆమెది. జరిగిన తప్పును సరిదిద్ది ఎలా బిడ్డ బ్రతుకును నిలబెట్టాలా అనే ఆలోచన వాళ్ళది. వాళ్ళకు ఎదురునిలిచి పోరాడగలిగే శక్తిలేని దయనీయ స్థితిలో ఉన్న ఆమెకు మౌనమోక్కటే దారిలా కనిపించిది.

“కుముదా జరిగిన దాన్ని తలుచుకుని బాధపడుతూ కూర్చుంటే సమస్యకు పరిష్కారం దొరకదు. ఏదో ఒక దారి వెతుక్కోవాలి. నీలోని అదనపు భారాన్ని అడ్డు తొలగించుకుంటే నీ జీవితానికి మరో తోడును తెచ్చుకోను వీలవుతుంది. ఆలోచించుకో. పోయినవాడు వదిలేసిన ఛండాలాన్ని మోస్తూ బాధపడడం కంటే అదొక పిశాచకల అనుకుని వదిలించుకోవడం మేలు” తల్లి వనజ అన్న మాటలు ఆమె చెవిలో మారుమ్రోగుతున్నాయి.

మేము చేసిన నేరానికి, ఏ నేరమూ చేయని, అభం శుభం తెలియని పసికందు ప్రాణం తీసే హక్కు మాకు ఎక్కడిది. కానీ తెగించి బిడ్డను కని, రేపు సమాజం పొడిచే కత్తిపోట్లను భరిస్తూ బ్రతికేదెలా? తను మొండిగా తట్టుకున్నా, వాడు పెరిగి పెద్దయి తన పుట్టుకను గూర్చి ప్రశ్నిస్తే సమాధానం ఏంచెప్పాలి? కుముదకు ఆలోచనలతో తల తిరిగిపోతున్నది. ఇంతలో ఒక చెయ్యి ఆమె భుజం మీద పడింది. తల తిప్పిచూసింది. తండ్రి కనిపించాడు. తలవంచుకుంది.

“అమ్మలూ. తప్పు చేశానని బాధపడుతున్నావా. మనం మనుషులమమ్మా తప్పు చేయడం సహజం. జరిగిపోయిన దాన్ని తలచుకుని బాధపడుతూ కూర్చుంటే, జరిగిన పోయిన తప్పును దిద్దుకోలేము, భవిష్యత్తును గురించి సరియైన నిర్ణయమూ తీసుకోలేము”

“ అమ్మ ఈ పాపాన్ని తొలగించుకోమంటుంది”

“మీరు చేసిన తప్పుకు ఆ బిడ్డకు శిక్ష విధిస్తావా?”

“మరేం చేయను. రబ్బరుతో తుడిపితే పోయే తప్పుకాదు అది”

“అది చేసే ముందే ఆలోచించుకోవాలి. కానీ జరిగిపోయింది. ఒక ప్రాణాన్ని నిలువునా చంపడం చదువుకున్న నీకు న్యాయం అనిపిస్తుందా?”

“మరేం చెయ్యను”

“ఏటికి ఎదురీదాలి. నువ్వు చేసిన పొరపాటుకు లోకం చూడవలసిన పసిగుడ్డును కడుపులోనే చంపకూడదు. చదువుకున్నావు. కొంతకాలం ఉద్యోగం కూడ చేశావు. మరల ప్రయత్నించు. అలుపెరుగని యోధునిలా పోరాడు. తండ్రి దుర్మార్గుడని, తల్లి హంతకురాలు కాకూడదు. సమస్యకు జడిసి పారిపోతే నేటి మహిళకు, నాటి మహిళకు తేడా ఏమిటి? నిన్ను నిందించి వేలెత్తి చూపే సమాజం నీకు ఒక్క పిడికెడు ముద్ద కూడ పెట్టదు. దాన్ని గురించి ఆలోచించడం అవసరమా? కుముదా నీకు అండగా తండ్రిని నేను ఉన్నాను. అడుగు ముందుకు వెయ్యి. మగవాడు మోసం చేస్తే ఆడది బేలలా మారి ఆత్మహత్య చేసుకోవడం మీ జాతికే అవమానం. ధైర్యాన్ని గుండెలో నింపుకో. నిన్ను వదిలి వెళ్ళిననాడే వాడు పార్ధివదేహమైనాడని మనసును రాయి చేసుకో. నీ బిడ్డకు నీవే తల్లి, తండ్రి. ముందుకు నడువు”

“నాన్నా. నేనంటే మీకు అసహ్యం వేయడం లేదా. మీకు కళంకం తెచ్చిన నన్ను దూరంగా నెట్టి వేయాలని అనిపించడం లేదా”

“గుండెకు జబ్బు చేసిందని ఆ గుండెనే పెకలించి పారవేస్తామా.. పిచ్చితల్లీ తండ్రికి బిడ్డంటే పంచప్రాణాలమ్మా. మీ బ్రతుకు ప్రశ్నార్ధకమవుతుంటే సమాధానంగా నిలుస్తామే గానీ, తప్పించుకుని పోము. నీలోని పిరికితనానికి చరమగీతం పాడు. సబలగా మారి ముందుకు కదులు. భయపడితే తరుముతుంది లోకం. అదే ఎదురుతిరిగి నిలిస్తే నీరాజనం పడుతుంది. ఈ నిజాన్ని గ్రహించి సాగిపో” కర్తవ్యాన్ని బోధించాడు తండ్రి విశ్వనాథ్.

కుముదలో కొత్త చైతన్యం పురుడు పోసుకుంది. పొట్ట మీద చెయ్యి వేసుకుంది. ‘కన్నా నీకు నేనున్నాను. నా మరణం వరకు నీకోసం సమాజంతో రణం సాగిస్తాను’

“నాన్నా. ఈ లోకంలో ఆడపిల్లలందరికీ మీలాంటి తండ్రి ఉంటే దారి తప్పిన ఆడపిల్లలెవరూ మరణాన్ని ఆశ్రయించరు. పోరాటం చేస్తారు. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు” కుముద మాటల్లో ఆనందం, ఆమె గుండెలో ధైర్యం.

“కుముదా ఒక్క విషయం గుర్తు పెట్టుకోండమ్మా. జీవితం అంటే పెళ్ళి, పిల్లలు, సంసారం కాదు. జీవితంలో అవి ఒక భాగం మాత్రమే. ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. అందుకోసం ఏ అవాంతరాన్నైనా ఎదుర్కునే ధైర్యం ఉండాలి. కష్టసుఖాలు వెలుగు, నీడల వంటివి. వాటిని సమర్దవంతంగా ఎదుర్కోవాలి. ఆశ, ఆశయం ఈ రెండే జీవితాన్ని నడిపించే ఇంధనాలు. అందరూ నిన్ను మోసం చేసిన వాడిలా ఉండరు. మంచివాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. చిన్న పొరపాటుకే జీవితం మోడువారిందనే ఆలోచన మరచిపోయి, లక్ష్యం వైపు అడుగులు వేస్తే, గమ్యంతో పాటు మరో నీడ కూడ నీకు దొరకవచ్చు” కుముదను దగ్గర తీసుకుని నీకు నేనున్నానని భరోసా ఇచ్చే తండ్రి చేతులలో పసిపాపలా వొదిగిపోయింది కుముద.

‘నీకు నేనున్నానమ్మా. చిన్నతనంలో నీ వ్యత్యస్త పాదాలకు నడక నేర్పినవాడిని, ఈరోజు నువ్వు తప్పటడుగు వేస్తే నాకూ సంబంధం లేదని దులుపుకు పోగలనా తల్లీ. తన మరణం వరకు బిడ్డలకు భరోసాను ఇచ్చేవాడేనమ్మా కన్నతండ్రి అంటే’ అనుకుంటూ కుముద భుజం తట్టాడు విశ్వనాధ్.

ఇప్పుడు కుముదలో అచంచలమైన విశ్వాసం నెలకొంది. నడిసముద్రంలో చిక్కుకున్న నావను ఒడ్డుకు చేర్చే దిక్సూచిలా కనిపించాడు తండ్రి. మగవాడు చేసిన తప్పును సమర్ధించి, ఆడపిల్ల తప్పును ఎత్తి చూపే వివక్ష సమాజానికి ఎదురుతిరిగి నిలవాలని నిశ్చయించుకుంది.

మరోప్రస్థానానికి మార్గం తెరుచుకుంది.

**అయిపోయింది*
******************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!