అన్నా చెల్లెళ్ళ ప్రేమ(కథాసమీక్ష)

అన్నా చెల్లెళ్ళ ప్రేమ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

సమీక్షకులు: పరిమళ కళ్యాణ్

కథ: పెళ్ళి విందు (తెలుగు అనువాదం కథ)
రచన: బెంగాలీ రచయిత్రి ఆశాపూర్ణాదేవి

ఆశాపూర్ణా దేవి గారి బెంగాలీ కథ అయిన పెళ్ళి విందు చాలా బాగుంది. పెళ్ళి ఇంటి వర్ణనతో మొదలైన కథ, ఏదో అనర్థం జరగబోతోంది అన్న తలపుని తెచ్చింది. కూతురి పెళ్ళి పనుల్లో హడావుడిగా ఉండగా అక్కడ జరిగిన ఉదంతం అందరినీ కలవర పెట్టింది. కంగారు పెట్టింది. పెళ్ళి ఏర్పాట్లన్నీ పాడు చేసిన చెల్లెలి భర్త సుజిత్ ని చూసిన ఆ క్షణంలో బిభూతి భూషణ్ కోపానికి అవధులు లేకుండా పోయాయి. ఏమీ తెలియని స్థితిలో ఉన్న బావగారు అయిన సుజిత్ ని పెళ్ళి సామగ్రి అంతా పాడు చేసినందుకు శిక్షించటం బిభూతి భూషణ్ కి ఆ సమయంలో తప్పనిపించలేదు. కొట్టి గదిలో వేసి తలుపులు వేస్తాడు. దాంతో కోపం, బాధ కలిగిన బిభూతి భూషణ్ చెల్లెలు ఇంద్రాణి కూడా భర్త వెనుకే గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది. ఎవరెంత పిలిచినా కిందకి రాలేదు. పెళ్ళి కార్యక్రమం, భోజనాలు అయితే కానిచ్చారు కానీ చివరికి ఒక విషాదాంతంగా మిగిలిపోయింది.
కథంతా బిభూతి భూషణ్, అతని చెల్లెలు గురించే ఉంది. వారిద్దరి మధ్య ప్రేమ, త్యాగం చివరికి కంటతడి పెట్టించింది. పెళ్లింట్లో మరణ వార్త తెలియకూడదని ఇంద్రాణి భర్త శవాన్ని పక్కనే పెట్టుకుని అదే గదిలో పెళ్ళి పూర్తయ్యేవరకు బాధ పడటం ఆమె త్యాగానికి ప్రతీక.
చెల్లెలికి తెలిసో తెలియకో తన వల్ల అన్యాయం జరిగిందని బిభూతి భూషణ్ బాధ పడటం అన్నగా అతని బాధ్యతని, చెల్లి పట్ల ప్రేమని తెలియచేస్తుంది.
ఇంద్రాణి పెళ్ళి సమయంలో కిందకి రాకపోవటంతో బంధువులు ఒక్కొక్కరు ఒక్కొక్కరకంగా చెవులు కోరుక్కుంటారే తప్ప ఎవరూ ఆమె కోసం పైకి కూడా వెళ్ళలేదు. వదిన గారు పిలిచినా రాని చెల్లి కోసం చివరికి పశ్చాత్తాపం కలిగిన అన్నగారు వెళ్లి పిలిచినా రాకపోవటం తో ఆ బాధ మరింత ఎక్కువయ్యింది బిభూతికి. పెళ్ళి వారు, బంధువులు అందరూ వెళ్ళిపోయాక చెల్లెలి కోసం గదిలోకి వెళ్లిన అన్నగారు చెల్లిని చూసి, అక్కడ జరిగింది చూసి హతాసుడయ్యాడు. బావగారి మరణానికి తానే కారణం అని తెలుసుకున్న బిభూతి భూషణ్ ఏం చేసి ఉంటాడో, భర్త మరణం తర్వాత ఇంద్రాణి పరిస్థితి ఏమిటో అన్న ఆలోచనలు చుట్టుముట్టాయి.
ఎంతో హృద్యమైన కథ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!